కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం అప్పర్ భద్ర ప్రాజెక్టును నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్రం 5300 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రకటించింది.
ఒకవైపు కొన్నేళ్లుగా నిర్మాణానికి కేంద్రం నుంచి సరిగా నిధులు విడుదల కాకుండా.. అలోలక్ష్మణా అని పోలవరం విలపిస్తున్న నేపథ్యంలో పొరుగున ఉన్న కర్ణాటకలోని కొత్త ప్రాజెక్టు అప్పర్ భద్రకు ఈ స్థాయిలో నిధులు ఇవ్వడం ప్రతి తెలుగువాడి గుండెను మండిస్తుంది. పైగా దీనిపై రకరకాల భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి.
అప్పర్ భద్ర ప్రాజెక్టు కడితే.. సీమకు నీటిలభ్యత మరింత ఘోరంగా మారుతుందని, రాయలసీమ మొత్తం కరవు తాండవిస్తుందనే భయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో అసలు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు వారు చూపించినంత నికర నీటి లభ్యత లేనేలేదని అయినా సరే.. దానిని జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించి నిధులు ఇవ్వడం దారుణం అని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ఓకే.. కానీ ఆ ప్రాజెక్టు పట్ల మన ఏపీ లోని నాయకులు ఎలా స్పందిస్తున్నారు?
పోలవరం నిధుల గురించి ప్రస్తావన కూడా లేకుండా, అప్పర్ భద్రకు 5300 కోట్లు ఇచ్చిన వైనంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కారు ప్రశ్నించాలి. కానీ అది జరగడం లేదు. అదే సమయంలో ఈ ప్రాజెక్టు అసలు రాయలసీమకు ద్రోహం తలపెట్టే ప్రాజెక్టు అనే అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో స్పందించాల్సింది ప్రభుత్వం మాత్రమే కాదు. ప్రతిపక్షాలకు కూడా ఆ బాధ్యత ఉంది.
అయితే చంద్రబాబునాయుడు ఈ విషయంలో తన కుటిల రాజకీయనీతిని ప్రదర్శిస్తున్నారు. అప్పర్ భద్ర విషయంలో నోరెత్తడం లేదని జగన్ ను విమర్శిస్తున్నారు. రాజకీయంగా ప్రభుత్వంగా అచేతనంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం విమర్శించడం మంచిదే. ఆయన విమర్శలు ఆహ్వానించదగ్గవే. కానీ.. ప్రధానప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం చేస్తున్నారు? ఏం చేయదలచుకున్నారు? నిర్దిష్ట కార్యచరణ ఆయనవైపు నుంచి తెదేపా వైపునుంచి ఉంటుందా? ఉండదా? అనేవి ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్నలు.
జగన్ పట్టించుకోలేదన్నది విమర్శలకు వాడుకోండి.. కానీ.. కనీసం మీరైనా న్యాయం చేయడానికి ప్రయత్నించండి అని ప్రజలు కోరుకుంటున్నారు. అప్పర్ భద్రకు వ్యతిరేకంగా, కేంద్రం నిధులు విడుదల చేయడానికి వ్యతిరేకంగా తెలుగుదేశం తొలుత రాజకీయ పోరాటమూ, తర్వాత న్యాయపోరాటమూ కూడా చేయాలని ప్రజలు అభిలషిస్తున్నారు.
నిజానికి ఆ పనిచేస్తే.. జగన్ చేయని పని చేశానని చంద్రబాబు మైలేజీ సంపాదించవచ్చు. కానీ ఆయనకు అంత ధైర్యం ఉందా అంటే అనుమానమే. కేంద్రంలో మోడీని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్న చంద్రబాబు.. బిజెపి పాలనలోని కర్నాటక ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, కేంద్రం నిధుల ప్రకటన నిర్ణయానికి వ్యతిరేకంగా వారి మీద ధ్వజమెత్తుతారని అనుకోవడం భ్రమ.
కేంద్రం వైఫల్యాలు అన్నింటి విషయంలో కూడా.. జగన్ మీద నిందలేస్తూ, కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా కుటిలనీతి పాటించినంతకాలం చంద్రబాబుకు ప్రజల్లో గౌరవం దక్కదు.