కీలక సమయంలో చంద్రబాబునాయుడు ప్రజల వద్దకు వెళ్లడం లేదు. ఆన్‌లైన్‌లో నాయకులతో సమీక్షలకే ఆయన పరిమితం కావడం చర్చనీయాంశమైంది. తాను జనం వద్దకు వెళితే, లోకేశ్‌కు ప్రాధాన్యం దక్కదనే ఉద్దేశంతో ఆయన ఇంటికి పరిమితం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు లోకేశ్ పాదయాత్రకు టీడీపీ ఊహించిన స్థాయిలో ప్రజాదరణ లభించలేదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ఆన్‌లైన్‌లో గురువారం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారే తప్ప, దాన్ని బలంగా నిర్వహించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఇదేం ఖర్మ అంటూ టీడీపీ నేతలు మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించడం తప్పితే, నిర్మాణాత్మకంగా, నిబద్ధతతో ఎవరూ చేయడం లేదు.
చంద్రబాబే పట్టించుకోనప్పుడు, కిందిస్థాయిలో నాయకులు ఎందుకు రిస్క్ చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే తాను జనంలోకి వెళితే, మీడియా అంతా తన చుట్టూ వుంటుందని, లోకేశ్ యువగళం మూగబోతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణం వల్లే జనంలోకి వెళ్లలేకపోతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు సమీపించే తరుణంలో ఇలా ఎన్నాళ్లని ఇంటి పట్టునే వుంటారో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.