బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరేందుకు సర్కస్ ఫీట్స్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ద్వారా టీడీపీతో రాయబారం నడుపుతున్నట్టు సమాచారం. తన కుమార్తె శబరి రాజకీయ భవిష్యత్ కోసం బైరెడ్డి రాజశేఖరరెడ్డి తిప్పలు పడుతున్నారు. ఎన్నికల బరిలో నిలబడడానికి తనకంటూ ఓ నియోజకవర్గం లేకపోవడం ఆయనకు రాజకీయంగా మైనస్ అయ్యింది.
నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 1994, 1999లో వరుసగా ఆయన టీడీపీ తరపున గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ హవా నడిచింది. 2009లో నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ అగమ్యంగా మారింది. ఏపీలో వేర్పాటువాద ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో 2012లో ఆయన టీడీపీని వీడారు. ప్రత్యేక రాయలసీమ పరిరక్షిణ డిమాండ్‌తో ప్రయోగం చేశారు.
బైరెడ్డిని జనం నమ్మలేదు. దీంతో ఆయన రాయలసీమ నినాదాన్ని కొంత కాలం విడిచిపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అక్కడి నాయకత్వంతో పొసగకపోవడంతో బీజేపీలో చేరారు. ప్రస్తుతం పేరుకు బీజేపీ అయినప్పటికీ, ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సొంత ఎజెండాతో ముందుకెళుతున్నారు. తన కుమార్తెకు రాజకీయంగా సరైన వేదిక కల్పించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.
టీడీపీ అయితేనే బాగుంటుందని ఆయన నమ్ముతున్నారు. దీంతో నంద్యాల ఎంపీ టికెట్‌ను తనకు లేదా కుమార్తె శబరికి ఇవ్వాలని టీడీపీ ముందు ప్రతిపాదన పెట్టారు. ఇదంతా త్వరలో టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ద్వారా జరుగుతోంది. బైరెడ్డి భరించడం కష్టమని టీడీపీ భయపడుతున్నట్టు సమాచారం. స్థిరమైన అభిప్రాయాలు ఉండవని, అలాగే నోటి దురుసు బైరెడ్డికి మైనస్ అనే అభిప్రాయాలున్నాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.