తన మేనత్త, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరికి సంబంధించిన వివాదంలో నందమూరి యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై టీడీపీ గుర్రుగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌పై ఆగ్రహాన్ని టీడీపీ ఏ మాత్రం దాచుకోవడం లేదు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేరుగానే జూనియన్ ఎన్టీఆర్‌ను నిలదీశారు.
మేనత్తపై దూషణలకు దిగితే ఇదేనా స్పందించే తీరు అంటూ ఎన్టీఆర్‌ను టీడీపీ నేతలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అంతేకాదు, తన శిష్యులైన మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఎన్టీఆర్ కంట్రోల్ చేయాలని వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో స్పందించారు. వల్లభనేని వంశీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై మండిపడ్డారు.
తమను జూ.ఎన్టీఆర్ ఎందుకు కంట్రోల్ చేస్తాడని కొడాలి నాని ప్రశ్నించారు. తాము ఏమైనా ఆయన దర్శకులమా? లేదా ఆయన వద్ద నటన నేర్చుకున్నామా? అని నిలదీశారు. తాను, వంశీ… జూనియర్ ఎన్టీఆర్ శిష్యులమని వర్ల రామయ్య అనడం సరికాదన్నారు. ఆయనే స్వయంగా పెంచి పోషించిన ఎంతోమంది ఎన్నో మాటలు అంటే వాళ్లను చంద్రబాబు ఎందుకు కంట్రోల్ చేయడం లేదని నాని ప్రశ్నించారు.
సీఎం జగన్ మోహన్‌రెడ్డి కొట్టిన దెబ్బకు వర్లరామయ్య వంటి వాళ్లకు బుర్ర పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. సంబంధం లేని వాళ్లను ఇందులోకి తీసుకొస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకూ జూనియర్ ఎన్టీఆర్‌కు ఏంటి సంబంధం? అని నాని ప్రశ్నించడం గమనార్హం.
ఒకప్పుడు కలిసి ఉన్నామని, ఆ తర్వాత తమ మధ్య విభేదాలొచ్చి… బయటకు వచ్చేశామన్నారు. తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమే అన్నారు. జగన్ చెప్పింది చేస్తాం, చెప్పకపోయినా చేస్తామని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే అందరికీ అభిమానమే అన్నారు. వాళ్లంతా అమాయకులన్నారు.
చంద్రబాబు మాటలు విని వాళ్లు అలా మాట్లాడి ఉంటారన్నారు. తనకూ, వంశీకి వాళ్లమీద జాలి వేస్తోందని వ్యంగ్యంగా అన్నారు. రోజురోజుకూ జూనియర్ ఎన్టీఆర్‌పై దాడి జరుగుతోంది. రోజుకో ముఖ్య నేత మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయడం ద్వారా ….యువ హీరోపై టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకత పెంచే ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగమే వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న తదితరుల విమర్శలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.