పోలీసులు అంటే మన భద్రతను ఇచ్చే వారు. నిరంతరం డ్యూటీలో ఉంటూ ప్రజలకు అండగా ఉండేవారు. పోలీసులు అన్న వ్యవస్థ లేకపోతే ఈ సమాజం ఒక్క నిముషమైనా గడపలేక ఎలా అల్లాడిపోతుందో ఊహించుకుంటే భయమేసే సీన్.
అలాంటి పోలీసులు కూడా మనుషులే. వారికీ మనసు ఉంటుంది. వారు కూడా భుక్తి కోసమే ఉద్యోగం చేస్తున్నారు. పోలీసులు సమాజం కోసం పనిచేస్తారు. ఎవరైనా తమకు కోపం వచ్చిందని నిరసన తెలియచేయాలీ అంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి.
మరి పోలీసులు రూల్స్ పేరిట అడ్డుకున్నారని ఎవరైనా బాధపడితే ఆ తప్పు ఎవరిది అన్నది కూడా చూడాలి. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి రావడంతోనే ఒక్కసారిగా పోలీసుల మీద విరుచుకుపడుతోంది. ఈ విషయంలో వారు ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు. పోలీసులతో ప్రతీ సందర్భంలో ఎక్కడో ఎవరో టీడీపీ నాయకుడు గొడవ పడుతూనే ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో తాజాగా టీడీపీ నేత కూన రవికుమార్ పోలీసుల మీద విమర్శలు చేసి అరెస్ట్ అయ్యారు. ఇపుడు విశాఖ జిల్లా తమ్ముళ్ళ వంతు అయింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఇతర టీడీపీ నేతలు నర్శీపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించే క్రమంలో పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసు అధికారుల సంఘం ఆక్షేపిస్తోంది.
గతంలో కూడా పోలీసుల మీద టీడీపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేయడంతో ఇలాగే పోలీసు అధికారులు ముందుకు వచ్చి వాటిని తప్పు పట్టారు. మొత్తానికి చూస్తే ఏపీలో ఎన్నడూ లేని రాజకీయ చిత్రం కనిపిస్తోంది. అధికార వైసీపీ విపక్ష టీడీపీ రాజకీయ సమరం సంగతి ఎలా ఉన్నా మధ్యలో పోలీసుల మీద ఈ విమర్శలు ఏంటి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో పడి తాము నలిగిపోతున్నామని వాపోతున్నారు.