మొన్నటివరకు ఒకటే పోటీ. జియోకు పోటీగా ఎయిర్ టెల్ చార్జీలు తగ్గిస్తే, ఆ రెండింటికి పోటీగా వోడాఫోన్, ఐడియా చార్జీలు తగ్గించాయి. దీంతో వినియోగదారుడు బాగా లాభపడ్డాడు. తక్కువ ధరకే డేటా, కాల్ చార్జీలు పొందాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దీనికి రివర్స్ అయింది.
కంపెనీలన్నీ లోపాయికారీగా ఒకటయ్యాయి. ధరలు పెంచక తప్పదని ఐడియా-వోడాఫోన్ ప్రకటిస్తే.. నిజమే పెంచాల్సిన అవసరం ఉందని ఎయిర్ టెల్ కూడా సన్నాయినొక్కులు నొక్కుతూ వచ్చింది. స్థిరీకరణలో భాగంగా మేం కూడా చార్జీలు పెంచుతామంటూ జియో కూడా చెప్పుకొచ్చింది. ఇలా దాదాపు నెల రోజులుగా లీకులిస్తున్న ఈ సంస్థలన్నీ అన్నంత పని చేశాయి.
ఏకంగా 40 నుంచి 50శాతం చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలన్నీ. వీటిలో ఏ కంపెనీని మినహాయించడానికి వీల్లేదు. వోడాఫోన్, ఐడియా, జియో, ఎయిర్ టెల్.. ఇలా మీరు ఏ కంపెనీ నెట్ వర్క్ వాడుతున్నా చార్జీలు పెంపు కామన్ అయింది. పెరిగిన చార్జీలు ఈరోజు అర్థరాత్రి నుంచే అమల్లోకి రాబోతున్నాయి.
ఏ ప్లాన్ కు ఎంత పెరిగిందనేది నెట్ వర్క్ ల వారీగా ఇక్కడ చర్చించుకోవడం కష్టం. ఎంత పెరిగిందో ఓ అంచనాకు వచ్చే సింపుల్ లెక్క మాత్రం ఒకటుంది. ఇప్పటివరకు మీరు రీచార్జ్ కోసం వంద రూపాయలు కేటాయిస్తే.. ఇక నుంచి అదే రీచార్జ్ కోసం 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఇక్కడ రేటు ఏ 10 రూపాయలో, 20 రూపాయలో పెరగలేదు. అమాంతం ప్రతి రీచార్జ్ మీద 40 నుంచి 50 రూపాయలు పెరిగింది. వాలిడీటీ, డేటా లిమిట్ తో సంబంధం లేకుండా అన్ని నెట్ వర్క్ చార్జీలకు ఇదే సూత్రం వర్తిస్తుంది.
ఈసారి మొబైల్ నెట్ వర్క్స్ అన్నీ ఏం చేశాయంటే.. చార్జీలు పెంచేసి, అందుకు ప్రతిఫలంగా డేటాను కూడా పెంచాయి. ప్రస్తుతం అనుభవిస్తున్న ప్లాన్స్ లో ఎంత డేటా లిమిట్ ఉందో, అంతకంటే కాస్త ఎక్కువ లిమిట్ ను ఇచ్చాయి. వీటితో పాటు తమ పరిథిలో ఉన్న వివిధ యాప్స్ కు ఉచిత యాక్సెస్ అందించాయి.
అయితే ఇవన్నీ కొసరే అని చెప్పుకోవాలి. వినియోగదారుడికి ప్రధాన అవసరం కాల్స్. ఆ తర్వాతే డేటా అయినా మిగతా యాప్స్ అయినా. అలాంటి కీలకమైన కాల్ చార్జీలు పెంచేసి, అదనాలు ఎన్ని ఇచ్చినా ఉపయోగం లేదు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. ఇక ముందులాగ ఇన్-కమింగ్ కూడా ఉచితంగా రాదు. ప్రతి నెల కనీసం 49 రూపాయలతో రీచార్జ్ చేయించుకుంటేనే ఇన్-కమింగ్. లేదంటే ఫోన్ డెడ్.