ఆరు నెలల పాలనలో వైఎస్ జగన్ “మంచి సీఎం కాదు…జనాన్ని ముంచే సీఎం పేరు”తో ప్రతిపక్ష టీడీపీ రెండురోజుల క్రితం ఓ పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఆరునెలలుగా జగన్ సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలకు వివరించేందుకు ఈ పుస్తకాన్ని రూపొందించినట్టు తెలిపారు.
అదలా ఉంటే… ప్రధానంగా టీటీడీలో ఓ ఉద్యోగుడిని పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 484 గురించి టీటీడీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇంత చర్చకు కారణం సదరు ఉద్యోగి పక్కా టీడీపీ అభిమానితో పాటు చంద్రబాబు, లోకేశ్ల కుడి, ఎడమ చేతుల్లాంటి వారనే ప్రచారం సాగుతుండడమే.
“మంచి సీఎం కాదు…జనాన్ని ముంచే సీఎం పేరుషతో ఆవిష్కరించిన పుస్తకంలో వైసీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు 2 లక్షల మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారని, అలాగే ఆ పార్టీకి చెందిన 90 శాతం మంది కార్యకర్తలకు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక సభలో మాట్లాడిన అంశాలను ప్రస్తావించారు.
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన డాక్టర్ వేమ వెంకటరత్నం టీటీడీలో పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ లో 2016, మే 20న ఓఎస్డీ గా రూ.30 వేల వేతనంతో చేరాడు. ఇతను కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు. వాసు సిఫార్సుతో లోకేశ్ చొరవతో వెంకటరత్నం టీటీడీలో ప్రవేశించాడని అక్కడి ఉద్యోగులు చెప్పేమాట. అలాగే ఇతను చంద్రబాబు పాలన-సంక్షేమ పథకాలపై పీహెచ్ డీ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే టీడీపీ హయాంలో నియమితులై రూ.40 వేల పైబడి వేతనం ఉన్న ఉద్యోగులను తొలగించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వెంకటరత్నం వేతనం అంతలేకపోవడంతో…అతన్ని తొలగించే పనిలేదు. ఉద్యోగుల ఉపాధిని దెబ్బతీయడాన్ని ఏ ఒక్కరూ సమర్థించరు. అయితే వైసీపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జగన్ కు ముఖ్యమంత్రి పదవితో పాటు తమకు ఉపాధి లభిస్తుందని లక్షలాది, కోట్లాది మంది ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నోవ్యయ ప్రయాసలకు ఓర్చుకుని కష్టపడ్డారు.
వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం చకాచకా జరిగిపోయాయి. అయితే వైసీపీ కార్యకర్తలను పట్టించుకునే దిక్కే లేకుండా పోయిందనే వాదన వినవస్తోంది. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ కార్యకర్తలకు వారి వారి విద్యార్హతలను బట్టి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదిక ఉద్యోగాలు కల్పించవచ్చు. అలా జరుగుతుందని ఆశించారు. జగన్ అధికారాన్ని చేపట్టి ఆరునెలలు కావస్తున్నా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగలేదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాకుండా టీడీపీ సానుభూతిపరులనే అందలం ఎక్కిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
దానికి ఉదాహరణగా డాక్టర్ వెంకటరత్నానికి అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా రెగ్యులర్ గా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వి.ఉషారాణి పేరుతో జీఓ విడుదల కావడమే అని చెబుతున్నారు. కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక ఉద్యోగిని పర్మినెంట్ చేయడంలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని, అలాంటిది చంద్రబాబు, లోకేశ్ ల కుడి, ఎడమ చేతులుగా పేరొందిన వెంకటరత్నం కోసం అన్ని నిబంధనలను జగన్ సర్కార్ అతిక్రమించిందని స్వయాన వైసీపీ కార్యకర్తలే అంటున్నారు.
టీటీడీ పౌరసంబంధాల శాఖలో పనిభారం పెరిగిందని, మీడియాతో మరింత సమన్వయం కోసం వెంకటరత్నాన్ని పర్మినెంట్ చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్న ప్రభుత్వం, మరి అదేశాఖలో అతనికంటే ముందు నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాటేమిటని టీటీడీలో పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. శ్వేత డైరెక్టర్ గా ఓ అనర్హుడుని నియమించడంతో పాటు వెంకటరత్నాన్ని పర్మినెంట్ చేయడంటో కడపకు చెందిన ఓ కీలక నేతకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వినపడుతున్నాయి.