కరోనా కథ ముగిసిపోయిందని అనుకుని, మాస్కులు తీసిపారేసి, ఫంక్షన్లన్నిటికి హాయిగా హాజరవుతూ, దేశవిదేశాల మధ్య యాత్రలు ఉధృతంగా సాగుతున్న యీ సమయంలో చైనాలో కరోనా మళ్లీ ఎలా విజృంభించింది అని అందరికీ వస్తున్న పెద్ద సందేహం. దానికి పలు కారణాలు చెప్తున్నారు. చైనా ఓ చెత్త వాక్సిన్ను తయారుచేసుకుని దాన్నే వాడిందని, అది సరిగ్గా పని చేయకపోవడంతో యీ అనర్థం వచ్చిందని కొందరన్నారు. బూస్టరు డోసులు వేయించుకోలేదు కాబట్టే.. అని మరి కొందరన్నారు. 60 ఏళ్లకు పైబడిన వారిలో తగినంత వాక్సినేషన్ కాలేదని సౌమ్యా స్వామినాథన్ అన్నారు. చైనాలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మన మీడియా బాగానే కవర్ చేసింది కానీ అసలు కారణమేమిటో నాకు బోధపడలేదు. జనవరి 7 నాటి ‘‘హిందూ’’లో అనంత్ కృష్ణన్ అనే ఆయన రాసిన వ్యాసం చాలా విషయాలు చెప్పింది. అదే అంశంపై యితర వ్యాసాలు కొన్ని చదివి వాటి సారాంశం మీతో పంచుకుంటున్నాను.
పూర్తిగా చదివే ఓపిక లేని వారి కోసం రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇది చైనా పాలకుల విధానవైఫల్యం. కోవిడ్ మొదటి వేవ్‌లో లాక్డౌన్ మంత్రం పని చేసింది కదాని, దాన్ని వెర్రిగా కొనసాగించడంతో జరిగిన అనర్థం. నొప్పి వచ్చినపుడు పెయిన్ కిల్లర్ తగ్గించింది కదాని అదే పనిగా వాడుతూ పోతే కిడ్నీలు చెడిపోయి ప్రాణానికే ముప్పు వస్తుందంటారు కదా, అలాటి కేసన్నమాట. చలికాలంలో చలి బాధిస్తున్నపుడు, కిటికీలు మూసేసి, స్వెట్టర్ వేసుకుని, చల్లగాలి తగలకుండా మఫ్లర్ చుట్టుకుని యింట్లో కూర్చోవడం కరక్టు. వేసవికాలం వచ్చినా స్వెటర్ యిప్పకుండా తలుపులు తెరవకుండా కూర్చోవడం చేటు. ఎండలు వచ్చేశాయి, స్వెట్టర్ విప్పేయి అని ఎవరైనా వచ్చి చెపితే, మరి చలికాలంలో వేసుకోవడం తెలివితక్కువ పని అంటారనే భయంతో విప్పకుండా కూర్చునికూర్చుని ఒక్కసారిగా జ్ఞానోదయమై స్వెటర్‌తో బాటు బట్టలన్నీ యిప్పేసిన వైనమిది. మార్పు ఏదైనా సరే, క్రమేపీ దశలవారీగా తీసుకురావాలి. ఒక్కసారిగా గేట్లన్నీ ఎత్తేస్తే ఏమౌతుంది?
కోవిడ్ తొలిసారి విరుచుకుపడినప్పుడు దాని స్వభావమేమిటో ఎవరికీ తెలియదు. ఇది అతి త్వరగా వ్యాపిస్తుంది కాబట్టి, ఎవరింట్లో వాళ్లు తలుపులు మూసుకుని, ఎవరితో సంపర్కం పెట్టుకోకుండా కూర్చుంటే రెండు వారాల్లో కరోనా పారిపోతుంది, ఎందుకైనా మంచిదని మరొక్క వారం అంటే మూడు వారాల లాక్డౌన్ చాలు అనుకుని మన దేశంలో ఆ మంత్రం పఠించారు. తర్వాత మరో 19 రోజులన్నారు, ఆ తర్వాత 14, మళ్లీ యింకో 14 రోజులు, మొత్తం 68 రోజులు లాక్డౌన్ పెట్టారు. దాని కారణంగా అనేక సమస్యలు వచ్చాయి కానీ కరోనా భూతం వదిలిపెట్టలేదు. దాంతో క్రమేపీ దశల వారీగా అన్‌లాక్ చేస్తూ వచ్చారు. పోనుపోను మనం కోవిడ్‌తో సహజీవనం చేయడం నేర్చుకున్నాం. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లతో అవస్థలు పడ్డాం. రోగంతో, మందులతో, వాక్సిన్లతో వేగాం, ఫోర్త్ వేవ్‌లో పోస్ట్ కోవిడ్ లక్షణాలతో యిబ్బంది పడుతున్నాం. పడుతూ, లేస్తూ ఏదోలా నెట్టుకొచ్చేస్తున్నాం. లాక్డౌన్ల వలన, ఆంక్షల వలన చిన్నాభిన్నమైన ఆర్థికవ్యవస్థను మళ్లీ నిలబెట్టుకోవడానికి శ్రమిస్తున్నాం.
దీనికి భిన్నంగా చైనా జీరో-కోవిడ్ పాలసీని పెట్టుకుంది. కోవిడ్ కేసు ఒక్కటీ లేకుండా చేస్తామని కంకణం కట్టుకుంది. మనలాటి ప్రజాస్వామ్య దేశాల్లో లాక్డౌన్ నియమాలు, మాస్కు, శానిటైజర్ వగైరా నిబంధనలు స్ట్రిక్టుగా అమలు చేయడం కష్టం కానీ చైనా వంటి నియంతృత్వ దేశాల్లో పాలకులు తలచుకుంటే ఏదైనా చేసేయగలరు. అందుకని ఊళ్లకు ఊళ్లు, రాష్ట్రాలకు రాష్ట్రాలను తక్కిన ప్రాంతాల నుంచి వేరు చేసేయగలిగారు. రాకపోకలు నిషేధించ గలిగారు. మన కంటె వాళ్ల దగ్గర ఫెసిలిటీస్ ఎక్కువ కాబట్టి మాస్ టెస్టింగులు చేశారు. ప్రతీ కేసుని పర్యవేక్షించారు. రోగలక్షణాలు లేకపోయినా కోవిడ్ పాజిటివ్ వస్తే చాలు తీసుకెళ్లి క్వారంటైన్ చేసేశారు. తక్కిన ఎవరితో కలవకుండా చేయగలిగారు. వాళ్లపై నిఘా వేయడమే కాదు, వాళ్లతో కాంటాక్ట్ ఉన్నవాళ్లనీ మానిటార్ చేశారు.
ఇది సత్ఫలితాలనిచ్చింది. కోవిడ్ సమయంలో అమెరికా తప్ప అనేక దేశాల్లో ఫ్యాక్టరీలు, ఆఫీసులు, స్కూళ్లు మూతపడ్డాయి. ఆన్లైన్ చదువులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు యిలాటివాటితో సర్దుకోవలసి వచ్చింది. టూరిజం కుప్పకూలింది. కానీ చైనాలో 2020, 2021లో అన్నీ నడిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ కుదేలు కాగా, చైనాది మాత్రం నిక్షేపంలా ఉంది. మెరుగైంది కూడా. 2021లో చైనా ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. స్వదేశంలో టూరిజం బాగా పెరిగింది. దాదాపుగా కోవిడ్‌ను తుడిచి పెట్టేశారు. చైనా పాలకులు కాలరెగరేశారు. చూశారా, మా జీరో-కోవిడ్ పాలసీ మహిమ అని చెప్పుకున్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో వాక్సిన్లు తయారయ్యాయి. చైనాలో కూడా సైనోవాక్, సైనోఫార్మ్ అని రెండు తయారయ్యాయి. వాటి ఉత్పత్తి చైనా జనాభాకు సరిపోదు. అయినా చైనా విదేశీ వాక్సిన్లను కొనలేదు. తమ దగ్గర ఉన్నవాటితోనే సర్దుకుంది.
విదేశీ వాక్సిన్లు కొనకుండా తప్పు చేసిందని అనలేం. ఫైజర్ గురించి కథనాలు వస్తున్నాయి. తక్కినవాటి గురించి కూడా త్వరలో వస్తాయేమో తెలియదు. ఒకటి మాత్రం నిజం, కోవిడ్ బూచి చూపించి, అనేక దేశాధినేతలు ప్రజాధనంతో ఫార్మా, వాక్సిన్ల కంపెనీల నుంచి అధికధరలకు మందులు, వాక్సిన్లు కొన్నారు. ఆ అత్యవసర సమయంలో వాటి నాణ్యత వెరిఫై చేసే అవకాశం, సమయం లేదంటూ కొనేశారు. ఆ క్రమంలో సొంతానికి డబ్బు చేసుకున్నారేమో ప్రస్తుతానికి తెలియదు. వాక్సిన్లు, మందులు ఎన్ని గుప్పించినా కోవిడ్ విజృంభణ ఆపలేక పోయారు కాబట్టి అవి పెద్దగా పనిచేయలేదనే అనుకోవాలి. రాబోయే రోజుల్లో శాస్త్రీయంగా దీన్ని నిరూపిస్తారేమో చూడాలి. సరే ఏది ఏమైనా చైనా విదేశీ వాక్సిన్లు కొనకుండా తన వాక్సిన్లనే మొత్తం మీద 350 కోట్ల డోసులు యిచ్చింది.
వాటితోనే కాలక్షేపం చేయాలి కాబట్టి, ప్రజల్లో కొన్ని వర్గాల వారికి రెండు డోసులు ప్లస్ బూస్టరు యిచ్చి, మరి కొన్ని వర్గాలకు బూస్టరు డోసులు యివ్వడం మానేసింది. ఆర్థిక వ్యవస్థ నడవాలంటే వర్క్ ఫోర్స్ ఆరోగ్యంగా ఉండాలి. అందుకని 18-59 ఏళ్ల వయసున్న వారందరికీ తప్పనిసరిగా వాక్సిన్లు యివ్వడం మీద దృష్టి పెట్టారు. 60-80 ఏళ్ల వయసున్నవారికి ఓ మాదిరిగా యిచ్చారు. 80 పై బడినవారికి పెద్దగా యివ్వలేదు. తక్కిన గ్రూపులన్నీ అయిపోయాక వీరికివ్వసాగారు. నగర ప్రాంతాల్లో చేసినంత వాక్సినేషన్ గ్రామీణ ప్రాంతాల్లో చేయలేదు. దీంతో చాలామందికి పూర్తి డోసులు పడలేదు. ఈ విధానం వలన వాక్సిన్ల సామర్థ్యంపై ప్రభుత్వానికే నమ్మకం లేదనే సంకేతం ప్రజల్లోకి వెళ్లింది. ‘వాక్సిన్‌లో తేడా వస్తే ముసలివాళ్లు తట్టుకోలేరు, పడుచువాళ్లు, మధ్యవయస్కులు తట్టుకోగలరు, అందుకని వారి మీదనే ప్రయోగాలు చేద్దాం’ అని ప్రభుత్వం అనుకుంటోందని వారనుకున్నారు. నిజానికి చైనీస్ వాక్సిన్ సామర్థ్యానికి ఢోకా లేదని హాంగ్‌కాంగ్‌లో నిరూపణ జరిగింది. అక్కడ మూడు డోసులు యిచ్చాక హాస్పటలైజేషన్, మరణాలు చాలా బాగా తగ్గాయి.
ఏది ఏమైనా వాక్సిన్ అందరికీ యివ్వకపోవడమనే విధానం వలన చెఱుపు జరిగింది. 2022 నవంబరు నాటికి మూడు డోసులు పూర్తవని వారిలో 80 ఏళ్లు దాటిన వారి సంఖ్య 1.20 కోట్లుంటే, 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 80 లక్షలుంది. ఇప్పుడీ వేవ్‌లో పిట్టల్లా రాలిపోతున్నవారు వీరే! ఇదే ముక్క సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నవారు యిప్పుడు హఠాత్తుగా మృత్యువు పాలవుతున్నారెందుకు అనే ప్రశ్నకు సమాధానం – ఉన్నట్టుండి జీరో- కోవిడ్ పాలసీని అటకెక్కించి, అన్ని నిబంధనలను ఒక్కసారిగా ఎత్తివేయడం! దాంతో డిసెంబరు 20 నాటికి చైనాలో కోవిడ్ విజృంభించి ఆసుపత్రి వ్యవస్థ కుప్పకూలి, చేతులెత్తేసింది. ఏ మేరకు అనేది సరిగ్గా చెప్పడం కష్టం. ఎందుకంటే చైనా గణాంకాలు నమ్మదగినవి కావు. 2020 జనవరి నుంచి 2022 డిసెంబరు దాకా తమ వద్ద 3.80 లక్షల కేసులు, 5వేల మరణాలు మాత్రమే అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చెప్పుకుంది. కానీ అవర్ వ(ర)ల్డ్ ఇన్ డేటా ప్రకారం మొత్తం వ్యాధిగ్రస్తులు 20 లక్షలు మొత్తం మరణాలు 84 వేలు. 3.70 కోట్ల కరోనా కేసులున్నాయని మరో సంస్థ అంచనా. జనవరి 10 నుంచి మా దగ్గర కొత్త కేసులేమీ రావటం లేదని చైనా చెప్పుకుంటోంది. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపడకండి. వాళ్లు లెక్కలు తీయడం మానేశారు. దాని గురించి తర్వాత రాస్తాను.
ఒమైక్రాన్ వేరియంట్ చైనా జీరో-కోవిడ్ పాలసీకి సవాలు విసిరింది. తక్కిన దేశాల్లో కోవిడ్‌తో సహవాసం చేయడం వలన హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది కానీ చైనాలో అది జరగలేదు. ఒమైక్రాన్ వేరియంట్‌కు విపరీతంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో అనేకమందికి సోకింది. ముఖ్యంగా 2.60 కోట్ల జనాభా ఉన్న షాంఘైలో 2022 మార్చి నాటికి అది తీవ్రస్థాయికి చేరింది. వాక్సిన్ తీసుకున్నవారికి ప్రాణాలు దక్కితే, తీసుకోనివారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఎక్కడైనా కేసు కనబడగానే విపరీతంగా టెస్ట్ చేయడం, కఠిన నిబంధనలు విధించడం చైనాలో పరిపాటి కదా. ఇంతమందిని క్వారంటైన్లో పెట్టడం అసాధ్యం కావడంతో జీరో కోవిడ్ పాలసీని షాంఘై ప్రజలు ప్రశ్నించ నారంభించారు. దాంతో షాంఘై స్థానిక ప్రభుత్వం లాక్డౌన్ విధించడం మానేసి, వయసు మీరినవారికి వాక్సినేషన్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.
హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియాలకు కూడా యిదే సమస్య వచ్చింది. వాళ్లూ జీరో-కోవిడ్ పాలసీయే అవలంబించారు. కానీ 2022 ఫిబ్రవరి నాటికి ఒమైక్రాన్ వారి విధానాన్ని వెక్కిరించింద్. కొంత తర్జనభర్జన తర్వాత వాళ్లు మార్చిలో ఆంక్షలు సడలించి, కోవిడ్ కేసులు పెరగకుండా చూసుకున్నారు. షాంఘై అదే విధానాన్ని అవలంబించ బోయింది కానీ యిది బీజింగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కోపం తెప్పించింది. హత్తెరీ మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే మేమెందుకు యిక్కడ అని అహంకరించి, హుంకరించి, షాంఘై సిటీపై రెండు నెలల లాక్డౌన్ విధించారు. లక్షలాది మందిని క్వారంటైన్లకు తరలించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన పిల్లలను తలిదండ్రుల నుంచి విడదీయడంతో గగ్గోలు పుట్టింది.
అయినా బీజింగ్ చలించలేదు. ఎందుకంటే జీరో కోవిడ్ పాలసీ అనేది చైనీస్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం. దాన్ని ఎవరూ ధిక్కరించడానికి వీల్లేదు అనేదే వారి స్టాండ్. అధినాయకత్వం అని పేరే కానీ నిర్ణయాలు తీసుకునేది అధ్యక్షుడు జిన్‌పింగే కదా. కోవిడ్ ప్రబలినప్పుడు అతని రెండో టెర్మ్ నడుస్తోంది. ప్రపంచమంతా కోవిడ్‌తో కునారిల్లితే జిన్‌పింగ్ నేతృత్వంలో చైనా కోవిడ్ వైరస్‌ను దుడ్డుకర్రతో బాది చంపేసింది, ఆర్థికప్రగతికి కించిత్తు ఆపద రాకుండా జిన్‌పింగ్ చూశాడు అనే డబ్బు కొట్టుకుంటూ వచ్చారు. అతని రెండో టెర్మ్ 2022 అక్టోబరుతో పూర్తవుతోంది. మూడో టెర్మ్‌కి ఎన్నిక కావాలంటే జీరో కోవిడ్ పాలసీలో లోపముందన్న విషయం బయటకు రాకూడదు. ఒకవేళ పాలసీ మార్చాలన్నా అక్టోబరు పార్టీ సమావేశంలో ఐదేళ్ల కోసారి జరిగే అధ్యక్ష ఎన్నిక తర్వాతే మార్చాలి అనుకున్నారు.
అందుకని బీజింగ్ నుంచి అన్ని స్థానిక ప్రభుత్వాలకు జీరో కోవిడ్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సడలించడానికి వీల్లేదని ఆదేశాలు వెళ్లాయి. పార్టీ అధికారిక పత్రిక ఐన ‘‘పీపుల్స్ డైలీ’’ జీరో కోవిడ్ విధానానికే అంటిపెట్టుకుని ఉండాలంటూ మూడు ఎడిటోరియల్స్ రాసింది. నిబంధనలు ఎత్తివేసి వైరస్‌తో కాపురం చేయాలనే వాదించేవారిని తిట్టిపోసింది. కోవిడ్ పట్ల ఉదాసీన వైఖరి అవలంబించి, నిబంధనలు సవ్యంగా అమలు చేయని అమెరికా, తక్కిన యూరోప్ దేశాలు ఎలా భ్రష్టు పట్టాయో గమనించాలని హెచ్చరించింది. గత మూడేళ్లగా పార్టీ తాలూకు మీడియా, నాయకులు యిదే వల్లిస్తూ వచ్చారు. సడన్‌గా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆ విధానాన్ని తిరగతోడితే పరువు పోతుందని జిన్‌పింగ్ భయపడడంలో ఆశ్చర్యం ఏముంది?
కానీ ప్రజల్లో అసంతృప్తి ప్రబలింది. కోవిడ్ పాత వేరియంట్లు ఉన్నపుడు యీ నిర్బంధాల విధానం బాగానే పనిచేసింది కాబట్టి వాళ్లు కొంత ఓర్చుకున్నారు కానీ కొత్త వేరియంటు వచ్చి, కోవిడ్ విపరీతంగా వ్యాపిస్తూ ఉంటే దానికి తగ్గట్టు విధానాన్ని మార్చుకోకుండా పాతదాన్నే పట్టుకుని వేళ్లాడడం వాళ్లకు కోపం తెప్పించింది. క్వారంటైన్ చేయడం, నియంత్రణలు మరింత బిగించడం తప్ప మరో మార్గం లేదన్నట్లు ఎందుకుండాలి, కొత్త మార్గాలు అన్వేషించాలి కదా అని వారు అభిప్రాయపడ్డారు. పైగా యీ నియంత్రణల ఖర్చు పెరిగిపోతూ వచ్చి ఆర్థికవ్యవస్థను దెబ్బ తీసింది. 2022 జులైలో నిరుద్యోగిత 19.9శాతం రికార్డు స్థాయికి చేరింది. అయినా రాజకీయ కారణాలతో చైనా పాలకపక్షం ఆంక్షలు ఎత్తివేయలేదు. కరోనా విషయంలో ప్రపంచంలో అనేక దేశాలు రాజకీయ కారణాలతో ఆంక్షలు విధించకపోవడమో, ఆలస్యం చేయడమో చేశాయి. కానీ చైనా విషయంలో అది దారుణ ఫలితాలనిచ్చింది.
అక్టోబరు 16న పార్టీ కాంగ్రెసులో జిన్‌పింగ్ జీరోకోవిడ్ విధానాన్ని గట్టిగా సమర్థిస్తూ ప్రసంగించాడు కానీ ముఖ్యమైన సమావేశాలన్నీ ముగిసేదాకా ఆగి అప్పుడు ఆంక్షలు ఎత్తివేయమన్నాడు. ఇదంతా అయ్యేసరికి నవంబరు 12 వచ్చింది. కేంద్రం ఆంక్షలు ఎత్తివేయమన్నా స్థానిక ప్రభుత్వాలు ఒక్కోటీ ఒక్కోలా అమలు చేశాయి. కొన్ని ప్రభుత్వాలు క్వారంటైన్ పీరియడ్‌ను 5 రోజులకు తగ్గిద్దామని, సెకండరీ కాంటాక్ట్‌లను వెతికి పట్టుకోవడం మానేద్దామని ప్రతిపాదించి, ఆ విధంగా అమలు చేశాయి. మరి కొన్ని లాక్డౌన్ విధానాన్ని కొనసాగించాయి. ఇలాటి స్థానిక ప్రభుత్వాలపై ప్రజల్లో ఆగ్రహం కలిగింది. నవంబరు 24 నాటి ఉరుంక్వీ దుర్ఘటనతో అది పెల్లుబికింది. జిన్జియాంగ్ రాష్ట్ర రాజధాని ఐన ఉరుంక్వీలో 2022 ఆగస్టు నుంచి కోవిడ్ బాగా వ్యాపించింది. స్థానిక ప్రభుత్వం లాక్డౌన్, నిర్బంధ టెస్టింగ్ అమలు చేసింది. ప్రజలు రోజులో ఒకటి, రెండు గంటలు మాత్రమే బయటకు వెళ్లవచ్చని, తక్కిన సమయమంతా యిళ్లలో తలుపులు మూసుకుని కూర్చోవాలని ఆంక్షలు పెట్టింది. నవంబరు 12 తర్వాత కూడా వాటిని సడలించలేదు.
నవంబరు 24న ఆ ఊళ్లో 21 అంతస్తుల ఒక భవంతిలో ఎలక్ట్రికల్ కనక్షన్లో సమస్య వచ్చి అగ్నిప్రమాదం జరిగింది. భవంతి అంతా మంటలు వ్యాపించాయి. పార్కింగ్ స్థలంలో వాహనాలు అడ్డంగా ఉండడం చేత ఫైరింజన్లు దగ్గరకు రాలేకపోయాయి. పిల్లలతో సహా 10 మంది చచ్చిపోయారు. ఈ సంఘటన వీడియోల ద్వారా వైరల్ కావడంతో అందరూ అట్టుడికి పోయారు. తమ తమ భవనాల్లో యిదే తీరుగా బంధించబడిన కోట్లాది మందికి తమకూ యీ గతి పడుతుందనే భయం ఆవహించింది. నవంబరు 26న షాంఘై నగరంలో ఉరుంక్వి మృతులకు నివాళి పేరుతో వందలాది మంది పోగుపడ్డారు. నివాళి కొద్ది సేపట్లోనే నిరసన ప్రదర్శనగా మారింది. ఇది చైనాలోని తక్కిన నగరవాసులకు స్ఫూర్తి నిచ్చింది. అక్కడా నివాళి-నిరసన కార్యక్రమాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను యిలా వ్యతిరేకించడం దశాబ్దాల క్రితం ఎప్పుడో జరిగింది.
బీజింగ్‌లో ప్రముఖ కూడలిలో 500 మంది గుమిగూడి ‘లాక్డౌన్లు ఎత్తివేయాలి, టెస్టింగ్‌లు ఆపేయాలి’ అని నినాదాలు అందుకున్నారు. నిరసనకారుల్లో యువత ఎక్కువగా ఉంది. ‘ఈ కోవిడ్ నిబంధనలు మూడేళ్లగా మా యవ్వనాన్ని హరించాయి’ అంటూ ఓ కుర్రవాడు వీడియోలో చెప్పినది జనంలోకి బాగా వెళ్లిపోయింది. 50 కాలేజీలలో యిలాటి ప్రదర్శనలు జరిగాయి. ఒక యూనివర్శిటీలో ‘మాకు ప్రజాస్వామ్యం కావాలి, భావప్రకటనా స్వేచ్ఛ’ కావాలి అని నినదించారు కూడా. మరో యూనివర్శిటీలో విద్యార్థినీవిద్యార్థులు ఖాళీ కాగితాలు చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. ఆ పద్ధతి నచ్చి దేశవ్యాప్తంగా అన్ని కాలేజీలన్నిటికీ పాకింది. ఒక యూనివర్శిటీ అధికారి విద్యార్థులను ‘ఏదో ఒక రోజు మీరు దీనికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది, జాగ్రత్త’ అని బెదిరిస్తే, ‘ఆ మాటకొస్తే ప్రభుత్వమూ చెల్లించాల్సి వస్తుంది’ అని విద్యార్థులు జవాబిచ్చారు.
ఓ పక్క నిరసనలు, మరో పక్క పెరుగుతున్న కేసులతో కమ్యూనిస్టు పార్టీకి యిదంతా తలకాయనొప్పిగా పరిణమించింది. రోజుకి 40 వేల కేసులు రిపోర్టవుతున్నాయి. ఎవర్ని పరీక్షించినా కోవిడ్ పాజిటివ్ అని వస్తోంది. ఆంక్షలు సడలించినా రోగవ్యాప్తి ఆగటం లేదు, పైగా ఉన్న ఆంక్షలతో ఆర్థికవ్యవస్థ దెబ్బ తింటోంది. మరో పక్క నిరసనల హోరు. ఇంకేమీ చేయలేక ప్రభుత్వం ఏమైతే అది అయిందని జీరో- కోవిడ్ పాలసీ ఎత్తేసి, కోవిడ్ జీరో-పాలసీకి మారిపోవాలనుకుంది. నవంబరు 30న వైస్ ప్రీమియర్ సున్ చున్లాన్ నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులను కలిసి, ‘ప్రస్తుతమున్న వేరియంట్ చాలా మైల్డ్. భయపడవలసిన అవసరం లేదు.’ అని ప్రకటించాడు. డిసెంబరు 7న మొత్తం నిబంధనలన్నీ ఎత్తివేశారు. క్వారంటైన్లు మూసేశారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినవాళ్లు యింట్లోనే విడిగా ఉంటే చాలన్నారు.
క్వారంటైన్ పీడ విరగడ కావడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఒమైక్రాన్ వేరియంట్ విచ్చలవిడిగా వ్యాపించసాగింది. తక్కిన దేశాల్లో అది ప్రాణాంతకం కాకపోయినా ఇమ్యూనిటీ డెవలప్ కాని చైనీయుల, ముఖ్యంగా వృద్ధుల జీవితాలను పొట్టన బెట్టుకుంటోంది. ఆసుపత్రులు రోగుల తాకిడిని తట్టుకోలేక పోతున్నాయి. ఏదో ఒకలా హెర్డ్ ఇమ్యూనిటీ వస్తే చాలు అనుకుంటున్నారు చైనా పాలకులు. వృద్ధులకు వేగంగా వాక్సిన్లు వేయించే పనిలో పడ్డారు. ఈ పని ఐదారు నెలలు పట్టవచ్చు. ఈ లోపున ఉన్నవాళ్లు ఉంటారు, పోయినవాళ్లు పోతారు. ఉన్నదెందరో, పోయినదెందరో చైనా చెప్పదు. ఎందుకంటే మా దగ్గర లెక్కలు లేవంటుంది. డిసెంబరు చివరకి వచ్చేసరికి కోవిడ్ వస్తే మాకు చెప్పనక్కరలేదని ప్రజలకు చెప్పేశాం. మాస్ టెస్టింగ్ కూడా మానేశాం. అందుకని కోవిడ్ కేసులెన్నో, మరణాలెన్నో తెలియదంటోంది. అందుకే అవర్ వ(ర)ల్డ్ డేటా ప్రకారం కేసులు, మరణాలు సున్న అని చూపిస్తోంది. నిజంగా ఎంతమంది పోయారు, ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారో కొన్నాళ్లకు ఎవరో యిన్వెస్టిగేట్ చేసి చెప్పాలంతే! (ఫోటోలు – పార్టీ కాంగ్రెసులో జిన్‌పింగ్ ఉపన్యాసం, పేషంట్లతో కిక్కిరిసిన చైనా ఆసుపత్రి, ఉరుంక్వీ దుర్ఘటన, ఖాళీ కాగితాలతో యువత నిరసన ప్రదర్శనలు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)