రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అన్నీ ఆలోచించి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుందని, ఇక దీని మీద ఎటువంటి చర్చ అనవసరం అని వైసీపీ నేతలు మంత్రులు అంటున్నారు. మూడు కీలకమైన ప్రాంతాల అభివృద్ధి వైసీపీ అజెండా అని పేర్కొంటున్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది, కర్నూల్ లో న్యాయ రాజధాని వస్తుంది, విశాఖ పరిపాలనా రాజధానిగా ఏర్పాటు అవుతుంది అని మంత్రి గుడివాడ అమరనాధ్ వెల్లడించారు.
ప్రభుత్వం ఏపీ భౌగోళిక సామాజిక ప్రాంతీయ సమతూల్యత సాధించడం కోసమే ఆయా ప్రాంతాలకు రాజధాని హోదాను ఇచ్చిందని ఆయన అంటున్నారు. అన్నీ ఆలోచించిన మీదటనే ఈ కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని వివరించారు. ఇందులో ఒక ప్రాంతం పట్ల ఆపేక్ష కానీ మరో ప్రాంతం పట్ల వివక్ష కానీ తమకు లేనే లేదని ఆయన అన్నారు.
ఏపీలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అందరి శ్రేయస్సు ఆలోచన చేసి ముందుకు సాగుతుందని అంటున్నారు. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే మరో అడుగు ముందుకేసి విశాఖ రాజధానికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఈ ఏడాది మార్చి 22న ఉగాది శుభ వేళ ముఖ్యమంత్రి విశాఖ రాజధానిగా ప్రకటిస్తారని ఆయన అంటున్నారు.
విశాఖ రాజధాని వల్ల వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తాయని, అలాగే రాయలసీమకు న్యాయ రాజధానితో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో విపక్షాలు ఇంకా రాద్ధాంతం చేయడం అంటే అది వారి రాజకీయమే అనుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రభుత్వం ప్రజల కోసం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇందులో వేరే ఏ ఉద్దేశ్యాలు లేవని ప్రజలు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు.