వాలంటైన్స్ డే రోజు అక్కడ కండోమ్ లు ఉచితంగా ఇస్తారు. ఒకటీ రెండు కాదు, వేలూ, లక్షలూ కూడా కాదు, ఏకంగా కోట్లలోనే. ఈ ఏడాది వాలంటైన్స్ డే టార్గెట్ 9.5 కోట్ల కండోమ్ లు ఉచితంగా పంపిణీ చేయడం. మామూలు రోజుల్లోనే థాయిలాండ్ లో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక వాలంటైన్స్ డే అంటే.. ప్రేమికులంతా థాయిలాండ్ లో విచ్చలవిడిగా రెచ్చిపోతారు. ప్రేమ ముదిరి పాకాన పడిన తర్వాత శృంగారానికి సిద్ధమవుతారు.
ఆ క్రమంలో సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. టీనేజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదం కూడా ఉంది. ఆ తర్వాత వారంతా అబార్షన్లకు ప్రయత్నిస్తే అది మరో పెద్ద సమస్య. అందుకే అలాంటి సమస్యలేవీ లేకుండా ముందుగానే ప్రభుత్వం 9కోట్ల 50 లక్షల కండోమ్ లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
థాయిలాండ్ హెల్త్ కేర్ కార్డ్ కలిగి ఉన్నవారికి వారానికి 10 కండోమ్ లు ఉచితంగా ఇస్తారు. ఇలా ఏడాదిపాటు వారికి ఉచితంగా కండోమ్ లు అందిస్తారు. ఇక ప్రభుత్వం ఇచ్చే ఉచిత కండోమ్ లు మెడికల్ షాపుల్లో, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి. అవి కూడా 4 సైజుల్లో అందుబాటులో ఉంటాయట. ఆస్పత్రికి, లేదా మెడికల్ షాపుకి వెళ్లి సైజ్ చెప్పి.. కండోమ్ ఉచితంగా పొందవచ్చు.
థాయిలాండ్ లో ఆ వ్యాధులు ఎక్కువ..
థాయిలాండ్ లో యువత ఎక్కువగా సుఖ వ్యాధుల బారిన పడుతుంది. గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్, క్లెమిడియా అనే వ్యాధులు అక్కడ ఎక్కువ. అందులోనూ వాలంటైన్స్ డే సీజన్లో ఇలాంటి వ్యాధులు మరింత విజృంభిస్తుంటాయట. ముఖ్యంగా 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత ఈ వ్యాధులబారిన పడటం ఆందోళన కలిగించే విషయం.
2021లో 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న థాయిలాండ్ బాలికల్లో ప్రతి వెయ్యి మందికి 25 మంది అమ్మాయిలు అవాంఛిత గర్భం దాల్చారు. ఇలాంటి ముప్పులను నివారించాలంటే, కండోమ్ లను ఉచితంగా అందించడం ఒక్కటే మార్గం అని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కోట్లాది కండోమ్ లు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అలా థాయిలాండ్ లో సెక్స్ తో వచ్చే వ్యాధులను, టీనేజ్ గర్భాలను అడ్డుకోవాలని చూస్తోంది.