వ్యాపారంలో లాభం, నష్టం సహజమే. కానీ వారం రోజుల్లోనే అదానీ జాతకం తలకిందులైంది. అదానీ గ్రూప్ షేర్లన్నీ కుప్పకూలాయి. హిండెన్ బర్గ్ ఆరోపణల తర్వాత వరుసగా గురువారం కూడా షేర్ల విలువ భారీగా పడిపోయింది. దీంతో అదానీ నష్టం 10వేల కోట్ల రూపాయలకు చేరింది. వారం రోజుల్లో ఈ స్థాయిలో నష్టాలు మూటగట్టుకున్న కుబేరుడిగా అదానీ రికార్డ్ సృష్టించారు.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానం నుంచి ఏకంగా 16వ స్థానానికి పడిపోయారు.
దెబ్బ మీద దెబ్బ..
హిండెన్ బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ ఎంత కవర్ చేసుకోవాలనుకున్నా షేర్ల పతనం ఆగలేదు. ఒకదాని తర్వాత మరొకటి.. షేర్లన్నీ కుప్పకూలాయి. గురువారం అదానీ షేర్లు కాస్త కోలుకుంటాయనే అంచనాలున్నాయి కానీ, బుధవారమే ఆ ఆశల్ని కూడా తుంచేశారు అదానీ. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ను అదానీ ఎంటర్ ప్రైజెస్ వెనక్కి తీసుకుంది. 20వేల కోట్ల రూపాయల పబ్లిక్ ఆఫర్ ని ఉపసంహరించుకుని వాటాదారులకు తిరిగి సొమ్ము చెల్లిస్తామని ప్రకటించింది.
దీంతో వరుసగా గురువారం కూడా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మొత్తంగా 10వేల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు 15శాతం పడిపోయింది. అదానీ పోర్ట్స్ 14 శాతం, అదానీ ట్రాన్స్ మిషన్, గ్రీన్ ఎనర్జీ, టోటల్ గ్యాస్ 10 శాతం చొప్పున పడిపోయాయి.
అదానీ అప్పులు ఎంతంటే..?
2022 మార్చి తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ అప్పులు 2453 కోట్ల రూపాయలుగా తేలగా.. అందులో 40శాతం వరకు భారతీయ బ్యాంకులే అప్పులిచ్చినట్టు తెలుస్తోంది. ఈ అప్పులపై భారతీయ సెంట్రల్ బ్యాంక్, స్థానిక బ్యాంకులను వివరాలు కోరింది.
అప్పులపై స్వయంగా గ్రూప్ ఛైర్మన్ అదానీ వివరణ ఇచ్చారు. తమ బ్యాలెన్స్ షీట్ ఆరోగ్యకరంగానే ఉందన్న ఆయన, అప్పులు తీర్చడంలో తమకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉందని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.