తనే గనుక అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగి ఉండి ఉంటే .. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ మేఘాలే ఉండేవి కావంటున్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుత అమెరికా పాలకుడి చేతగాని తనం వల్లనే యుద్ధం ఏడాదిపై నుంచి కొనసాగుతూ వస్తోందని ట్రంప్ ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ట్రంప్ మాట్లాడుతూ..తనకు పూర్వం అధ్యక్షులు ఉన్నప్పుడు రష్యా తీరును, తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రష్యా తీరును ప్రస్తావిస్తున్నారు.
తనకు పూర్వం క్రిమియాను రష్యా ఆక్రమించుకుందని, తన తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్ పై దండెత్తిందని, తను పదవిలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి దుందుడుకు చర్యలు లేవని ట్రంప్ విశ్లేషిస్తున్నారు. వేరే వాళ్లు అధ్యక్ష పీఠంపై ఉన్నప్పుడూ తను పీఠంపై కూర్చున్నప్పుడూ ఈ తేడా ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు.
ఒకవేళ అమెరికన్లు తనకు రెండో అవకాశం ఇచ్చి ఉంటే ఈ యుద్ధం వచ్చేది కాదని, ఒకవేళ యుద్ధ మేఘాలు కమ్ముకున్నా 24 గంటల వ్యవధిలోనే యుద్ధాన్ని ఆపేందుకు తన చర్యలు ఉండేవని ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. తను అమెరికా అధ్యక్ష పీఠంపై లేకపోవడం వల్లనే ఇదంతా అని చెప్పుకుంటున్నారు!
మరి పదవి పోయిన చాలా మంది నేతలు ఇలానే మాట్లాడుతూ ఉంటారు. నేను గానీ ఒక ఈల కానీ వేశానంటే అన్నట్టుగా ఇలాంటి ప్రగల్బాలు ఉంటాయి. ట్రంప్ ఇలాంటి విషయాల్లో అస్సలు మొహమాట పడే టైపు కాదు కాబట్టి, తను ప్రెసిడెంట్ గా లేకపోవడం వల్లనే ఇదంతా అని చెప్పుకుంటున్నట్టుగా ఉంది వ్యవహారం!