బాలీవుడ్ వసూళ్ల రికార్డులను తిరగరాస్తోంది షారూక్ ఖాన్ సినిమా *పఠాన్*. పోస్ట్ కోవిడ్ తర్వాత అయితే ఈ సినిమానే అత్యంత భారీ వసూళ్ల సినిమాగా నిలుస్తోంది. కరోనా లాక్ డౌన్ తెరలు తెరుచుకున్నాకా.. బోలెడన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లను దక్కించుకున్న సినిమా మరోటి లేదు! పెద్ద హీరోల సినిమాలు రావడం బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించలేకపోవడం ఆనవాయితీగా కొనసాగింది. గత ఏడాది భూల్ భులయ్యా, దృశ్యం 2 వంటి సినిమాలు చెప్పుకోదగిన స్థాయి లాభాలను సంపాదించుకున్నాయి.
మరోవైపు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక బాలీవుడ్ పని అయిపోయిందనేంత స్థాయిలో విశ్లేషణలు సాగాయి. దీనిపై బాలీవుడ్ మూవీ మేకర్లు కూడా వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. బాలీవుడ్ పడిలేచిన కెరటం లా మళ్లీ లేస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఈ పరిస్థితుల్లో షారూక్ సినిమాపై కూడా మరీ భారీ అంచనాలు లేవు! ఈ సినిమా విడుదలకు ముందు రేగిన వివాదాలు దీన్ని వార్తల్లో నిలిపాయి, అంతేకానీ ఈ సినిమా పై అరివీర భయంకర అంచనాలు ఏమీ లేవు. అయినప్పటికీ ఈ సినిమా వసూళ్ల ఊపును అందుకుంది. దీని గ్రాస్ వసూళ్ల మార్కు 668 కోట్ల పై మాటే అని బాక్సాఫీస్ పండితులు అంటున్నారు.
ఈ వసూళ్లతో ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ప్రముఖమైన స్థానాన్ని అందుకుంటోంది. దీని బడ్జెట్ 225 కోట్ల రూపాయలు అని అంచనా. ఇప్పుడు గ్రాస్ వసూళ్ల మార్కుతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దశను దాటుకుని యశ్ రాజ్ ఫిల్మ్స్ కు లాభాలను అందిస్తూ ఉంది పఠాన్. ఇక డిజిటల్, ఓటీటీ వంటివి కూడా భారీ స్థాయి ధరలే కాబట్టి అవి అదనం. మొత్తానికి బాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది షారూక్ సినిమా.