నవంబర్ బాక్సాఫీస్: ఒక్క హిట్ కూడా లేదు

సైరా లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లేవు. ఖైదీ లాంటి మెరుపుల్లేవ్. నవంబర్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఇంకా చెప్పాలంటే గట్టిగా హిట్ కొట్టిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఆవిరి, మీకు మాత్రమే చెప్తా లాంటి…

సైరా లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లేవు. ఖైదీ లాంటి మెరుపుల్లేవ్. నవంబర్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఇంకా చెప్పాలంటే గట్టిగా హిట్ కొట్టిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఆవిరి, మీకు మాత్రమే చెప్తా లాంటి సినిమాలతో నవంబర్ ఓ మోస్తరుగా మొదలైంది. 1వ తేదీనే వచ్చిన ఈ రెండు సినిమాల్లో ఆవిరిపై ఎలాంటి అంచనాల్లేవు. ఆ అంచాలకు తగ్గట్టే రవిబాబు సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.

ఇక విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీసిన మీకు మాత్రమే చెప్తా సినిమాపై ఓ మోస్తరు అంచనాలుండేవి. విడుదలైన తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫ్లాప్ అయింది. మరి ముఖ్యంగా సినిమా క్వాలిటీ, షార్ట్ ఫిలిం కంటే దారుణంగా ఉందంటూ విజయ్ దేవరకొండ బ్యానర్ పై విమర్శలు వచ్చాయి. ఈ రెండు సినిమాలతో వచ్చిన దండుపాళ్యం-4 కూడా ఫ్లాప్ అయింది.

నవంబర్ 8న ఏకంగా అరడజను సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో తిప్పరామీసం సినిమా ఆడుతుందని అంతా ఊహించారు. కానీ శ్రీవిష్ణు నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ మూవీతో పాటు వచ్చిన ఏడు చేపల కథ అనే అడల్ట్ సినిమా కొన్ని రసిక హృదయాల్ని ఓలలాడించినప్పటికీ రిజల్ట్ మాత్రం ఫ్లాప్. ఇక కోనాపురంలో, శివలింగాపురం, గాలిపురం జంక్షన్, 4 ఇడియట్స్ లాంటి సినిమాల గురించి డిస్కషన్ కూడా అనవసరం.

నవంబర్ 15న తెనాలి రామకృష్ణ వచ్చింది. సందీప్ కిషన్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ టైనర్ గా అందర్నీ అలరిస్తుందని విశ్లేషకులు భావించారు. కానీ ట్రయిలర్ లో ఉన్న పంచ్ లు, కామెడీని మించి సినిమాలో ఇంకేం లేకపోవడంతో.. బాక్సాఫీస్ రిజల్ట్ తేడాకొట్టింది. నిను వీడని నీడను నేనుతో సక్సెస్ కొట్టిన సందీప్ కిషన్, ఈ సినిమాతో ఆ విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు. ఇక ఇదే వారంలో వచ్చిన విశాల్-తమన్నాల యాక్షన్, విజయ్ సేతుపతి అనే మరో సినిమా కూడా ఫ్లాప్ అయ్యాయి. ఓన్లీ యాక్షన్ మీద దృష్టిపెట్టి కథ-స్క్రీన్ ప్లేను గాలికి వదిలేయడంతో చేజేతులా ఫ్లాప్ తెచ్చుకున్నాడు విశాల్.

నవంబర్ మూడో వారం (నవంబర్ 22) కూడా ఎలాంటి మెరుపుల్లేకుండానే బాక్సాఫీస్ కథ ముగిసింది. ఈవారం తోలుబొమ్మలాట, రాగల 24 గంటల్లో లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈషారెబ్బ, సత్యదేవ్ నటించిన రాగల 24 గంటల్లో అనే సినిమా, రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ పోషించిన తోలుబొమ్మలాట సినిమాలు మెప్పించలేకపోయాయి. ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన జాక్ పాట్, బీచ్ రోడ్ చేతన్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

అయితే ఈ వారం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మూవీ ఒకటుంది. అదే జార్జి రెడ్డి. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. స్వయంగా చిరంజీవి ప్రచారం చేశారు. చిరంజీవితో పాటు చాలామంది హీరోలు ఈ సినిమాకు ప్రచారం చేశారు. రెబల్ బయోపిక్ అంటూ ఊదరగొట్టిన ఈ సినిమా ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ట్రయిలర్ తో ఒక్కసారిగా హైప్ తెచ్చుకున్న ఈ సినిమా, రిలీజ్ తర్వాత తుస్సుమంది. బిజినెస్ మాత్రం బాగానే చేసుకున్నారు.

ఇక ఈ నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ అర్జున్ సురవరం, రాజావారు రాణిగారు సినిమాలు (29న) రిలీజయ్యాయి. క్రిటిక్స్ అయితే ఈ సినిమాలకు యావరేజ్ మార్కులే వేశారు. బాక్సాఫీస్ రిజల్ట్ తేలాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇలా నవంబర్ నెలలో దాదాపు 20 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో సాలిడ్ హిట్ అనిపించుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు. సాయితేజ్, బాలయ్య సినిమాలతో డిసెంబర్ లోనైనా బాక్సాఫీస్ కు కళ వస్తుందేమో చూడాలి.