జగన్‌ సక్సెస్‌ – చంద్రబాబు కంగారు

టైమ్‌ అండ్‌ టైడ్‌ విల్‌ నెవర్‌ స్టాప్‌ అని నానుడి. అంటే  కాలం, అలలు ఆగవని అని అర్థం. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అప్పుడే ఆరునెలల పదవీకాలం పూర్తి చేశారు.…

టైమ్‌ అండ్‌ టైడ్‌ విల్‌ నెవర్‌ స్టాప్‌ అని నానుడి. అంటే  కాలం, అలలు ఆగవని అని అర్థం. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అప్పుడే ఆరునెలల పదవీకాలం పూర్తి చేశారు. ఈ ఆరు నెలల్లో ఆయన ఏమి సాధించారు? ఏమి సాధించలేకపోయారన్నది సహజంగానే చర్చనీయాంశం అవుతుంది. ఆయన విజయ పదంలో ఉన్నారా? లేరా అన్నది కూడా పరిశీలనార్హమే.

జగన్‌ కచ్చితంగా ప్రజలలోకి దూసుకు వెళుతున్నారని చెప్పడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంగారుపడుతున్న విధానమే నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రబాబు ప్రతి రోజు ఎలా గింజుకుంటున్నారో చూస్తున్నాం.

ఎలా ఆందోళన చెందుతున్నది అర్థం చేసుకోవచ్చు. చివరికి జిల్లాలకు వెళ్లి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నట్లు కనిపిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ పై విమర్శలు సాగిస్తున్న తీరు కూడా గమనించదగినవే.

ఇవన్ని ఆయన ఎందుకు చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలిస్తే తేలికగా అర్థం చేసుకోవచ్చు. జగన్‌ జనంలోకి పాజిటివ్‌గా వెళుతున్నారు. ఆయన ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు, అనండి, ఇకొంకటి అనండి చాలా పద్దతిగా టార్గెటెడ్‌గా వెళుతున్నారు.

దానిని పసికట్టారు కనుకే చంద్రబాబు నాయుడు హడావుడి పడి టిడిపి ఉనికిని నిలబెట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషయంలో ఆయనను తప్పు పట్టలేం. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడుగా ఆయన  ఆ తంటాలు పడుతున్నారు. తనకు ఎదురైన పరాజయ పరాభవాన్ని కప్పిపుచ్చుకుని మళ్లీ జనం ఆదరిస్తున్నారన్న భ్రమ కల్పించడానికి ఆయన కృషి చేస్తున్నారు.

దీనిని బట్టే ముఖ్యమంత్రి జగన్‌ ఎంతగా సఫలీకృతం అయింది తెలుసుకోవచ్చు. ఇక ఆయన ఎలా చేశారన్నది చూద్దాం. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఆయన ఒక మాట చెప్పారు. ప్రాంతం చూడను, కులం చూడను, మతం చూడను. పార్టీ చూడను. సంక్షేమం అయినా పాలన అయినా అందరూ సమానమే అని ప్రకటించడం ద్వారా తాను చంద్రబాబుకన్నా భిన్నమైన వ్యక్తిని అని, టిడిపి కన్నా తమ పార్టీ భిన్నమైనదని ప్రజలలో అభిప్రాయం తెచ్చుకోగలిగారు. ఆ తర్వాత ఆయా స్కీములను అమలుకు నడుం బిగించారు. ఆరు నెలల వ్యవధిలో ఇన్ని స్కీములు ప్రకటించడం కాని, అమలు చేయడం కాని చేసిన ముఖ్యమంత్రి బహుశా జగనే కావచ్చు.

నా నలభై రెండేళ్ల జర్నలిజం అనుభవంలో ఇన్ని కార్యక్రమాలు మరెవరూ చేపట్టలేదంటే ఆశ్చర్యం కాదు. వాటిలో కొన్నిటిపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అయినా ఆయన తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే సంకల్పంతో సాగుతున్నారు. ముందుగా ఉద్దానం కిడ్నీ బాధితులకోసం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థానప చేయడం, కిడ్నీ  వ్యాధి గ్రస్తులకు పదివేల రూపాయల పెన్షన్‌ ప్రకటించడం చేశారు. ఆ తర్వాత ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థను తెచ్చారు. వలంటీర్ల సిస్టమ్‌ ప్రవేశ పెట్టారు.ఆటో డ్రైవర్‌లకు పదివేల రూపాయల హామీని నెరవేర్చారు. రైతులకు భరోసా కింద 7500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందచేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇస్తానన్న విధంగా పదివేల చొప్పున అందచేశారు. స్కూళ్లకు నాడు-నేడు అంటూ సరికొత్త కార్యక్రమం చేపట్టి సంచలనాత్మకంగా ఆంగ్ల మీడియంను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇవన్ని ఒకరకంగా చెప్పాలంటే మాస్టర్‌ స్ట్రోక్‌లే అని విశ్లేషించాలి. ఆయా వర్గాలవారిని ఆకట్టుకునేవే. చేనేతవారికి 24 వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి తేదీ ఖరారు చేశారు. అమ్మ ఒడి కింద తల్లులకు డబ్బు ఇవ్వడానినిక ముందుగానే షెడ్యూల్‌ చేశారు. మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తూ బెల్ట్‌ షాపులు నియంగ్రించడానికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వమే మద్యం షాపులు నడిపేలా చర్యలు తీసుకుని ధర పెంచడం, అమ్మకాల టైమ్‌ తగ్గించడం వంటివి చేశారు.

మద్యం వల్ల సామాన్యులు నష్టపోకూడదన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్ని సంక్షేమ చర్యలే. ఇక రాజధానికి సంబంధించి కమిటీ వేసి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నారు.తాజాగా అవసరమైన మేర పనులు చేపట్టాలని ఆదేశించి, రాజధానిపై స్పష్టత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్నట్లుగానే నవంబర్‌ ఒకటి నుంచి ఆరంభం అయ్యేలా చేయగలిగారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వందల కోట్ల రూపాయల ఆదా అయినట్లు ప్రకటించారు. అన్నిటిని మించి ప్రభుత్వంలో వృధా వ్యయం తగ్గించారు. అవినీతి నిర్మూలనకు టోల్‌ నెంబర్‌ పెట్టారు. ప్రజల సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం తీసుకు వచ్చారు. బలహీనవర్గాలకు ఏభై శాతం పదవులు రిజర్వేషన్‌ బిల్లు, పరిశ్రమలలో స్థానికులకు డెబ్బై శాతం రిజర్వేషన్‌లు, స్థానికులకోసం నైపుణ్యాభివృద్ది కేంద్రాల ఏర్పాటు ..

ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం కనిపిస్తాయి. అదే సమయంలో లోపాలు లేవా అంటే ఎన్నో కొన్ని ఉండకుండా ఎలా ఉంటాయి. ప్రభుత్వం అంటేనే అమీబా వంటిదని అంటాం. అది ఎటు నుంచి ఎటు పోతుంటుందో గమనించడమో కష్టం అవుతుంటుంది. ఇసుక విషయంలో ప్రభుత్వపరంగా కొంత ఆలస్యం అయిందన్న విమర్శలు వచ్చాయి. అయితే మంచి విధానం తీసుకురావడం అబిలషణీయమే. సలహాదారు పదవులు కొంత ఎక్కువగా ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. పిపిఎల విషయంలో నిర్ణయం సరైనదే అయినా, కేంద్రంతో సమన్వయం చేసుకోలేదన్న వ్యాఖ్య వచ్చింది. ఛీఫ్‌ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యంను తప్పించడం కరెక్టు కావచ్చు. కాని ఆకస్మికంగా తొలగించిన తీరు కాస్త విమర్శలకు దారి తీసింది.

అభివృద్ధి పరంగా అనంత-అమరావతి హైవే నిర్మాణానికి ఓకే చేశారు. పరిశ్రమలు తీసుకు రావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కడప స్టీల్‌ ప్లాంట్‌ వైపు అడుగులు పడుతున్నాయి. ఎపికి ఆయా ప్రాజెక్టులు రావడానికి గాని ఇతరత్రా కాని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పరిశ్రమల ఒప్పందాల పేరుతో హడావుడియే కాని వచ్చిందేమీ పెద్దగా లేదు. అయితే జగన్‌ ప్రభుత్వం కాంక్రీట్‌గా ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలి. చంద్రబాబు ప్రభుత్వం మాదిరి అబద్ధాలు చెప్పకపోవడం పెద్ద రిలీఫ్‌గా ఉంది.

అలాగే చంద్రబాబు మాదిరి రోజూ గంటల తరబడి టీవీలలో కనిపిస్తూ ఉపన్యాసాలు చేయకపోవడం కూడా ప్రజలకు మరింత ఉపశమనం కలిగించే విషయమే. అలాగే జగన్‌పై ప్రతిపక్షాలు ఒక్క ఆరోపణ కూడా చేయలేకపోయాయి. ప్రభుత్వంలో ఒక్క స్కామ్‌ జరగకుండా జాగ్రత్తపడ్డారు. ప్రభుత్వపరంగా బాగా యాక్టివ్‌గా ఉన్న జగన్‌ పార్టీ వైపు ఇంకా దృష్టి సారించలేదని, పార్టీ ఆఫీస్‌లో సరైన వ్యవస్థను ఇంకా ఏర్పాటు చేసుకోలేదని కొందరు చెబుతున్నారు.

ఏది ఏమైనా ముఖ్యమంత్రిగా జగన్‌ ఏమి చేస్తారులే అనుకున్నవారందరికి ఆయన ధీటుగా జవాబు ఇచ్చి ఔరా అనిపించుకున్నారని ఒప్పుకోవాలి. ఇవన్ని ఒక ఎత్తు అయితే ప్రకృతిపరంగా ఆయనకు బాగా కలిసి వచ్చింది. వర్షాలు దండిగా పడడం, ప్రాజెక్టులు నిండడం, వ్యవసాయం కళకళలాడడం ఎపికి, ముఖ్యమంత్రి జగన్‌కు ఎంతో అదృష్టం అని చెప్పాలి.

ఇంతవరకు సక్సెస్‌ ఫుల్‌గా నడిచిన వైఎస్‌ జగప్‌ ప్రభుత్వం ఇకపై సూపర్‌ సక్సెస్‌ కావాలని ఆల్‌ ద బెస్ట్‌ చెబుదాం.

కొమ్మినేని శ్రీనివాసరావు