ఢిల్లీ పర్యటన తర్వాత ఆర్టీసీ కార్మికుల్ని కలుస్తానని చెప్పిన కేసీఆర్, అంతకంటే ముందే వాళ్లకు ఆహ్వానం పలికారు. ఈరోజు వందల సంఖ్యలో ప్రగతి భవన్ కు తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వాళ్లతో కలిసి భోజనం చేశారు. వరాల జల్లు కురిపించారు.
ఇంతకుముందు చెప్పినట్టుగానే కార్మిక సంఘాల నాయకుల్ని కేసీఆర్ దూరం పెట్టారు. కేవలం ఉద్యోగులతో మాత్రమే మాట్లాడారు. 97 డిపోల నుంచి దాదాపు 700 మంది కార్మికులు వచ్చి కేసీఆర్ ను కలిశారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు మహిళలకు కూడా చోటిచ్చారు. వీళ్లతో భోజనం తర్వాత ఇష్టాగోష్టీ మాట్లాడిన ముఖ్యమంత్రి.. సమ్మె చేసిన కాలానికి జీతం చెల్లించడానికి అంగీకరించారు. అంతే కాదు, పెండింగ్ లో ఉన్న ఆ మొత్తాన్ని రేపు సాయంత్రం లోగా కార్మికుల ఖాతాల్లో జమచేయాలని కూడా ఆదేశించారు.
తమ డిమాండ్లతో 55 రోజుల పాటు సమ్మె చేశారు ఉద్యోగులు. అలా సమ్మె చేసిన 55 రోజుల్లో ఏ ఒక్క రోజును కట్ చేయకుండా పూర్తి జీతం చెల్లిస్తున్నారు ముఖ్యమంత్రి. అంతేకాదు.. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ లాభాల్లోకి తీసుకొస్తే, సింగరేణి తరహాలో బోనస్ లు ఇస్తామని మరోసారి స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రైవేటైజేషన్ పై మరోసారి స్పందించారు కేసీఆర్. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారనే ఆలోచనల్ని మనసులోంచి తీసేయాలని కోరారు. రాష్ట్రంలో ఏ చిన్న రూటును ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు ఇవ్వమని స్పష్టంచేశారు. అంతేకాదు, ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోగొట్టుకోరని, పూర్తి ఉద్యోగ భద్రత అందివ్వబోతున్నట్టు తెలిపారు.
తాజా భేటీతో కార్మికులంతా పూర్తిగా యూనియన్లకు దూరమైనట్టయింది. కేసీఆర్, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆర్టీసీ కార్మికులు ఇక సమ్మె బాట పట్టరు. అంతలా కార్మికులకు సోప్ వేశారు కేసీఆర్. సమ్మె కాలంలో ఎంత కఠినంగా వ్యవహరించారో, ఇప్పుడు కార్మికుల పట్ల అంత సుతారంగా వ్యవహరించి వాళ్లను ఐస్ చేశారు.