ఎంత మంచివాడవురా కల్యాణ్ రామ్!

సంక్రాంతి సినిమాలనగానే రెండే సినిమాలు గుర్తొస్తాయి. ఒకటి మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు, రెండోది బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురములో. కానీ ఈ రెండు సినిమాలతో పాటు వస్తున్న స్ట్రయిట్ మూవీ ఎంత మంచివాడవురా.…

సంక్రాంతి సినిమాలనగానే రెండే సినిమాలు గుర్తొస్తాయి. ఒకటి మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు, రెండోది బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురములో. కానీ ఈ రెండు సినిమాలతో పాటు వస్తున్న స్ట్రయిట్ మూవీ ఎంత మంచివాడవురా. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గురించి మాత్రం ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందులో తప్పు ప్రేక్షకులది కాదు, అక్షరాలా కల్యాణ్ రామ్ దే.

అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్ ప్రారంభమై చాన్నాళ్లయింది. స్టిల్స్, సాంగ్స్ బోలెడన్ని బయటకొచ్చాయి. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా సంగతి సరేసరి. సెట్స్ పైకొచ్చినప్పట్నుంచి ఈ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. టీజర్లు కూడా వదిలారు. రేపోమాపో సాంగ్స్ కూడా రాబోతున్నాయి.

ఈ మొత్తం ఫ్రేమ్ నుంచి తనకు తెలియకుండానే సైడ్ అయిపోయాడు కల్యాణ్ రామ్. తన సినిమా సంక్రాంతికి వస్తోందని తెలిసి కూడా ప్రచారాన్ని లైట్ తీసుకున్నాడు. దీంతో జనాలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మానేశారు. మధ్యమధ్యలో స్టిల్స్ రిలీజ్ చేసినప్పటికీ, మహేష్-బన్నీ సినిమాల ప్రమోషన్ ముందు అవి తేలిపోయాయి. ఉన్నంతలో టీజర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది.

ఎట్టకేలకు కల్యాణ్ రామ్ కూడా తేరుకున్నాడు. తన సినిమాకు ఎగ్రెసివ్ ప్రమోషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికి జరిగిన డ్యామేజీ చాలని, ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకూడదని యూనిట్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అందుకే ఆఘమేఘాల మీద ఈ సినిమా పాటల్ని (డిసెంబర్ 6 నుంచి) విడుదల చేయాలని నిర్ణయించారు.

అంతేకాదు.. సినిమాకు 3 వారాల ముందు నుంచి తనే స్వయంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేయాలనుకుంటున్నాడు కల్యాణ్ రామ్. అలా బన్నీ, మహేష్ కంటే కాస్త ముందు నిలవాలని భావిస్తున్నాడు.