అప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా బాబు!

ఇసుక పాలసీ అయిపోయింది.. ఇంగ్లిష్ మీడియం అయిపోయింది.. మొన్నటికిమొన్న రాజధాని అమరావతి ఇష్యూ కూడా అయిపోయింది. ఈ అంశాలన్నింటిలో సున్నం పెట్టించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు కొత్త అంశాన్ని తలకెత్తుకున్నారు. అదే రాష్ట్రం చేసిన అప్పుల…

ఇసుక పాలసీ అయిపోయింది.. ఇంగ్లిష్ మీడియం అయిపోయింది.. మొన్నటికిమొన్న రాజధాని అమరావతి ఇష్యూ కూడా అయిపోయింది. ఈ అంశాలన్నింటిలో సున్నం పెట్టించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు కొత్త అంశాన్ని తలకెత్తుకున్నారు. అదే రాష్ట్రం చేసిన అప్పుల సంగతి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విపరీతంగా అప్పులు చేస్తున్నారట. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తుతున్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. అసలు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన ఘనతే చంద్రబాబుది. అడ్డమైన పథకాలకు అప్పులుతెచ్చి ప్రజల నెత్తిన మోపారు బాబు. అంతెందుకు, జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికే రాష్ట్రం పెను సంక్షోభంలో ఉంది.

తీవ్రమైన అప్పులతో సతమతమౌతోంది. ఈ విషయాల్ని ఇప్పుడు చంద్రబాబు ఆయాచితంగా మరిచిపోయారు. తప్పంతా జగన్ దే అన్నట్టు మాట్లాడుతున్నారు.

రాష్ట్ర విభజన నాటికి ఏపీకి 97 వేల కోట్ల అప్పులు ఉంటే, చంద్రబాబు పుణ్యమా అని అవి 2 లక్షలా 60 వేల కోట్ల రూపాయలకు చేరాయి. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర బడ్జెట్ కంటే అప్పులే అధికంగా ఉన్నాయి. ఈ లెక్కలు మాత్రం బాబు ఇప్పుడు మాట్లాడరు. అసలు చంద్రబాబే సవ్యంగా పరిపాలించి ఉంటే, ఇప్పుడు జగన్ కు అప్పులు చేసే పరిస్థితి వచ్చేది కాదు కదా.

ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా, కొత్త పథకం ప్రవేశపెట్టాలన్నా అప్పు చేయాల్సిందే. గతంలో బాబు అదే చేశారు. ఇప్పుడు జగన్ అదే చేస్తున్నారు. కానీ చంద్రబాబులా అడ్డగోలు అప్పులు మాత్రం జగన్ చేయడం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు చంద్రబాబు ఆడిన డ్రామాల్ని యువత మరిచిపోలేదు.

ఆ పథకం కోసం బాబు వేల కోట్ల అప్పులు చేశారు. కానీ పైకి నిరుద్యోగ భృతి అని చెప్పి, ఆ డబ్బు మొత్తాన్ని తన పార్టీ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. జగన్ ఇలాంటి పనులు చేయడం లేదు. కేవలం సంక్షేమం కోసం మాత్రమే అప్పులు చేస్తున్నారు.

అప్పులు చేయడాన్ని ఎవరూ ప్రోత్సహించరు. అది జగన్ అయినా సరే. కాకపోతే పాలన సాగాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ప్రస్తుతం జగన్ అదే చేస్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేయడం, హామీలిచ్చి మభ్యపెట్టడం జగన్ కు చేతకాదు. అందుకే అప్పులు చేసైనా సంక్షేమాన్ని తీసుకురావాలనుకుంటున్నారు.

బాబుకు మాత్రం ఇవేం పట్టవు. జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు.. పేపర్ క్లిప్పింగ్స్ పెట్టి మరీ రాష్ట్రం అప్పుల పాలైందంటూ బీద అరుపులు అరుస్తున్నారు. మరో 2 రోజులు ఇదే వైఖరి కొనసాగిస్తే, ఈ విషయంలో కూడా బాబు తిట్లు తినక తప్పదు. ఈ వ్యవహారం అతడికి రివర్స్ లో తగలక మానదు. !