ఒకవైపు పర్మిట్లు లేకుండా నడుపుతున్న బస్సులకు రవాణా శాఖ అధికారులు బ్రేకులు వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పుడు కూడా జేసీ బస్సుల అక్రమ దందా ఎంచక్కా సాగిపోయింది. దశాబ్దాలుగా అడిగే నాథుడు లేడు. అయితే ఇప్పుడు రోజులు జేసీ దివాకర్ రెడ్డికి అనుకూలంగా లేవు. దీంతో బస్సులకు బ్రేకులు పడుతూ ఉన్నాయి.
అదేమంటే.. ఇప్పుడు కూడా జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతూ ఉన్నారు. ‘మా బస్సులు మాత్రమే అక్రమంగా నడుస్తున్నాయా, అందరివీ కరెక్టుగా ఉన్నాయా?’ అంటూ ఆయన ప్రశ్నించేశారు ఈ మధ్యనే.
తన బస్సులకు సరైన పర్మిట్లు లేవని, అడ్డగోలుగా ట్రావెల్ బస్సులను నిర్వహిస్తున్నట్టుగా ఈ మాజీ ఎంపీగారే ఒప్పుకున్నారు. ‘కొన్నాళ్లు బస్సులను ఆపేస్తాం..’ అంటూ దివాకర్ రెడ్డి ముక్తాయింపును ఇచ్చారు.
అన్ని పర్మిట్లూ తెచ్చుకుని తాము బస్సులను నడుతామని చెప్పట్లేదాయన. పర్మిట్లు లేవు కాబట్టి బస్సులను ఆపేస్తామని ప్రకటించుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి చేరుతున్న నేతల మీదా దివాకర్ రెడ్డి ఈ మధ్యనే కామెంట్లు చేశారు.
కేసులకు భయపడే వాళ్లంతా తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే దివాకర్ రెడ్డి మీదా ఆ టాక్ నడుస్తూ ఉంది. ఆయన బీజేపీలోకి చేరతారనే ప్రచారం ఉండనే ఉంది.
గత వారంలో మరో ఝలక్ తగిలింది జేసీ ఫ్యామిలీకి. ‘త్రిశూల్ సిమెంట్స్’ పేరుతో ఫ్యాక్టరీ నెలకొల్పడానికి తీసుకున్న భూముల వ్యవహారం పై విచారణ వేగంగా సాగుతూ ఉంది. ఈ భూములను ఎప్పుడో దశాబ్దం కిందటే తీసుకున్నారట జేసీ దివాకర్ రెడ్డి కుటుంబీకులు.
రెండు వేల పదిలోనే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పాల్సిందట. అయితే ఇప్పటి వరకూ అది జరగలేదు. అయితే భూముల లీజులను పొడిగిస్తూ వచ్చారు. లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ కూడా పొడిగిస్తూ వచ్చారు. దానిపై ఏడెనిమిదేళ్ల కిందటే కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు అయ్యింది. ఇన్నాళ్లూ దాని విచారణ మందకొడిగా సాగింది.
అయితే తాజాగా దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఆయన తనయుడు పవన్ రెడ్డి, పవన్ రెడ్డి భార్య పేరిట ఈ లీజులుతీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి పేరు మీద కోర్టు నోటీసులు జారీ అయ్యాయి.
ఇదంతా చూస్తుంటే.. జేసీ దివాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయి, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందడానికి సమయం ఆసన్నమైందనట్టుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!