క్రితం సారి చేసిన పొరపాట్లను మరోసారి చేయకుండా చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాడు అఖిలేష్ యాదవ్. అప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపితే చాలు తిరుగులేదనే రాంగ్ క్యాలుక్లేషన్లతో అఖిలేష్ యాదవ్ బోర్లా పడ్డాడు. కాంగ్రెస్ బలాన్ని అతిగా ఊహించి ఏకంగా వంద సీట్లను ఆ పార్టీకి కేటాయించి చిత్తయ్యాడు అఖిలేష్. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అఖిలేష్ అనుభవించారనేది వాస్తవం.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ను పూర్తిగా పక్కన పెట్టి అఖిలేష్ యాదవ్ సోలోగా సాగుతున్నాడు. అయితే చిన్నా చితక పార్టీలకు వీలైనన్ని సీట్లను కేటాయించడానికి మాత్రం అఖిలేష్ యాదవ్ కు అభ్యంతరాలు లేవని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ కు కేటాయించే బదులు చిన్న పార్టీలతో పొత్తే బెటరని అఖిలేష్ లెక్కేశాడు ఈ సారి.
ఈ మేరకు ఒక్కో పార్టీతో అఖిలేష్ చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్టున్నాయి. రాష్ట్రీయ లోక్ దళ్ తో ఇప్పటికే పొత్తు ఖరారు అయ్యిందట. అయితే సీట్ల బేరం ఏమిటో క్లారిటీ లేదు. ఇరు వర్గాలూ మాత్రం పొత్తు కుదిరిందని ప్రకటిస్తున్నాయి.
ఇక అప్నా దళ్ లోని ఒక వర్గంతో అఖిలేష్ యాదవ్ పొత్తు చర్చల్లో ఉన్నారనే సమాచారమూ అందులోంది. ఇప్పుడు ఎన్డీయేలో అప్నాదళ్ (ఎస్) భాగస్వామిగా ఉంది. మూడు ఎంపీలు, పది వరకూ ఎమ్మెల్యే ల బలం ఆ పార్టీకి ఉంది. అందులోని ఒక చీలిక వర్గం అప్నాదళ్ (కే)తో సమాజ్ వాదీ పార్టీ పొత్తు ఉంటుందని తెలుస్తోంది. కుర్మీ కులస్తులపై అప్నాదళ్ ప్రభావం ఉంటుంది. గత ఎన్నికల్లో ఇలాంటి సమీకరణాలతోనే బీజేపీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించగలిగింది.
మరోవైపు ఆప్ తో కూడా సమాజ్ వాదీ పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. ఆప్ కు ఎక్కడా ఒక ఎమ్మెల్యే సీటును గెలిచేంత బలం లేకపోయినా.. ప్రతి నియోజవర్గంలోనూ ఐదు వందల నుంచి వెయ్యి ఓట్లు కలిసి వచ్చినా ప్రభావమే అవుతుంది. అలాగే ఆప్ తో పొత్తు ఒక పాజిటివ్ సంకేతం అవుతుందని ఎస్పీ కూడా భావిస్తోందట.
కేజ్రీవాల్ వచ్చి సమాజ్ వాదీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయవచ్చు. ఎస్పీ పట్ల ఆప్ కు అనుకూలత లేకపోయినా.. పొత్తుతో యూపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టవచ్చు. ఇలాంటి నేపథ్యంలో పొత్తుకు ఆ పార్టీకి కూడా అనుకూలంగా ఉందని స్పష్టం అవుతోంది.
ఇలా చిన్న పార్టీలతో కలిసి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద కూటమినే తయారు చేసే పనిలో ఉన్నట్టున్నారు అఖిలేష్ యాదవ్. మరి ఈ మంత్రాంగం ఏ మేరకు అధికారానికి చేరువ చేస్తుందో!