ఉత్తరాదిన రాజకీయ నేతలకు హేమమాలిని బుగ్గలంటే అపరిమితమైన ప్రేమ. ఎంతలా అంటే.. తమ రాజకీయ ప్రసంగాల్లో కూడా ఆమె బుగ్గల్లోని సున్నితత్వం, మృదుత్వాన్ని గుర్తు తెచ్చుకుని మరీ మాట్లాడుతూ ఉంటారు. కొన్నేళ్ల కిందట బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడుతూ.. బిహార్ లో రోడ్లను హేమమాలిని బుగ్గలతో పోల్చారు.
తమకు అధికారం ఇస్తే.. రోడ్లను హేమమాలిని బుగ్గల్లా చేస్తామంటూ హామీ ఇచ్చారు. అప్పట్లో ఈ పోలికపై దుమారం రేగింది. మహిళలను ఆబ్జెక్టిఫై చేస్తున్నారంటూ కొందరు ధ్వజమెత్తారు. అయితే రోడ్ల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు ఆ పోలిక వాడాడనే సమర్థింపూ వినిపించింది.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు రోడ్లను కత్రినాకైఫ్ బుగ్గలతో పోల్చాడో రాజస్తాన్ మంత్రి. ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి ఈ పోలిక తెచ్చాడు. తమ హయాంలో రోడ్లు కత్రినాకైఫ్ బుగ్గల్లా ఉన్నాయంటూ ఆయన పొంగిపోయాడు. తాము ఆ రేంజ్ అభివృద్ధి చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. దీంతో.. మరో దుమారం రేగింది. కత్రినాకైఫ్ బుగ్గలు, రోడ్లు అంటూ పోల్చడం స్త్రీని ఆబ్జెక్టిఫై చేయడంలో భాగమే అనే విమర్శను ఎదుర్కొంటున్నారు మంత్రి.
హీరోయిన్ల పేర్లు మారాయి కానీ, రోడ్ల గురించి చెప్పడానికి నేతల మాటలు మారినట్టుగా లేవు. అప్పట్లో హేమమాలిని బుగ్గలు ఇప్పుడు కత్రినాకైఫ్ బుగ్గలయ్యాయి. రాజస్తాన్ మంత్రి మాటలపై మహిళా వాదులు విరుచుకుపడుతున్నారు. గతంలో తన బుగ్గలను పోలిక పెట్టడంపై హేమమాలిని కూడా స్పందించారు. మరి ఈ సారి కత్రినా స్పందిస్తుందో లేదో!