Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: దృశ్యం-2

మూవీ రివ్యూ: దృశ్యం-2

టైటిల్: దృశ్యం 2
రేటింగ్: 2.75/5
తారాగణం: వెంకటేష్, మీనా, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి, నదియా, నరేష్, తదితరులు
కెమెరా: సతీష్ కురుప్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: డి సురేష్ బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి
దర్శకత్వం: జీతూ జోసెఫ్
విడుదల తేదీ: 25 నవంబర్ 2021
ఓటీటీ: అమేజాన్ ప్రైం

2014లో మళయాళ సినిమా "దృశ్యం" కి ఎంత పేరొచ్చిందో అందరికీ తెలుసు. దానిని మలయాళ సీమకే పరిమితం చేయకుండా తెలుగులో కూడా తీసారు. మళ్లీ అన్ని ప్రశంశలూ దక్కాయి.

మళ్లీ ఈ 2021 ఓటీటీ యుగంలో మళయాళంలో దృశ్యం-2 సీక్వెల్ వచ్చింది. ఓటీటీ ద్వారా అందర్నీ చేరింది. శభాషనిపించుకుంది. అయినా సరే వ్యయ ప్రయాసలకోర్చి మళ్లీ తెలుగులో తీసారు. అదే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఇది సరిగ్గా ఏడేళ్ల తర్వాత అవే పాత్రలతో తీసిన కొనసాగింపు కథ. దృశ్యం కథ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి భాగంలో కథానాయకుడు రాంబాబు తానే హత్య చేసానని పదవీ విరమణ చేసిన హతుడి తల్లైన ఐజీకి (నదియా), ఆమె భర్త (నరేష్) కి చెప్పేసి వెళ్లిపోతాడు.

అక్కడితో కథ ముగిసిపోతుందనుకుంటాం. కానీ ఆమె వదలదు. ఆమె లక్ష్యాలు రెండు.

ఒకటి- తన కొడుకు అస్థికలు పొందడం. రెండు- తన కొడుకుని చంపిన కుటుంబానికి కఠినమైన శిక్ష పడేలా చేయడం.

మొదటి భాగంలో కేబుల్ ఆపరేటర్ గా ఉన్న కథానాయకుడు రెండో భాగంలో థియేటర్ ఓనర్ అవుతాడు. అక్కడికి చనిపోయిన కుర్రాడి తండ్రి (నరేష్) తన కొడుకు అస్థికల కోసం రాంబాబు దగ్గరకు రావడంతో పాత కథకి కొనసాగింపు మొదలవుతుంది.

అక్కడి నుంచి ఏం జరిగింది? పోలీసు యంత్రాంగం అతనిని ఎలా ట్రాప్ చెయ్యాలనుకుంటారు? పోలీసులకంటే తెలివైన వాడైన రాంబాబు ఎటువంటి ఎత్తుగడలు వేస్తాడు అనేది కథ.

నిజానికి ఇది చాలా జాగ్రత్తగా, వాస్తవ దూరం కాని సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా రాసుకున్న కథ. అయినా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ ఘట్టంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కథనాన్ని కన్వీనియంట్ గా మలుచుకున్నారు.

మళయాళంలో ఆల్రెడీ చూసేసినవారికి కూడా భాషాపరమైన సౌలభ్యం, తెలిసిన నటీనటులు ఉండడం వల్ల నచ్చుతుంది.

వెంకటేష్ మొదటి భాగంలో కనిపించినంత హుషారుగా ఇందులో లేరు. పాత్రకి కూడా ఆరేళ్లు వయసు పెరిగింది కాబట్టి వయసు రీత్యా వచ్చిన మార్పని సరిపెట్టుకోవచ్చు. ఓవరాల్ గా వెంకటేష్ తన పాత్రకి మాత్రం న్యాయం చేసారు.

మీనాకి భావోద్వేగాన్ని ప్రదర్శించే అవకాశం కలిగింది. సగటు గృహిణిగా ఆమె సరిగ్గా సరిపోయింది.

నదియా సీరియస్ పాత్రలో తొలి భాగంలో లాగానే ఉంది. రచయితగా తనికెళ్ల భరణి రెండు మూడు సీన్స్ లో కనిపిస్తారు. నరేష్ కూడా తొలిభాగంలోని మూడ్ ని యాజిటీజ్ గా కంటిన్యూ చేస్తూ కనిపిస్తారు.

సీనియర్ పోలీస్ పాత్రలో తెలుగులో కనిపించిన సంపత్ కంటే మళయాళంలో చేసిన మురళీ గోపి బెటరనిపిస్తాడు.

సత్యం రాజేష్, పూర్ణా, షఫీ, సీవీయల్, రాజారవీంద్ర....ఇలా చిన్న చిన్న పాత్రలకి కూడా పెరున్న నటుల్ని ఎంచుకోవడం బాగుంది.

కెమెరా, ఎడిటింగ్ అన్నీ యథాతథంగా మూలాన్ని అనుసరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం మాత్రం ఆకట్టుకోదు.

కథ, ఇంటర్వల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఊహాతీతంగా నడుస్తాయి. అదే ఈ చిత్రంలోని ప్రత్యేకత.

రాంబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు, ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా అప్పటికప్పుడు కథ అల్లగల నేర్పు ఎలా ప్రదర్శిస్తాడు, ప్రమాదాన్ని ముందే ఊహించి చట్టపరంగా దొరక్కుండా ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటాడు...ఇలా అన్నీ ఆకట్టుకుంటాయి.

మళయాళ చిత్రం చూడని వాళ్లకి ఇది కచ్చితంగా నచ్చుతుంది. చూసిన వాళ్ళకి కూడా బోర్ కొట్టదు.

బాటం లైన్: కుటుంబసమేతంగా చూడదగ్గ ఓటీటీ చిత్రం

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా