టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మళ్లీ తన మాతృసంస్థలో అడుగుపెట్టబోతున్నారా? కంపెనీని తిరిగి టేకోవర్ చేసుకోబోతున్నారా? నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ రవిప్రకాష్ మాత్రం ఈ దిశగా తన పనులు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఆయన చెబుతున్న వాదనల్లో లాజిక్ కనిపిస్తోంది.
కొత్త యాజమాన్యం అసమర్థత, అనుభవరాహిత్యం కారణంగా ఓ షేర్ హోల్డర్ గా తను తీవ్రంగా నష్టపోతున్నానని వాదిస్తున్నారు రవిప్రకాష్. ఈ మేరకు ఆయన కోర్టును ఆశ్రయించారు. కంపెనీని తిరిగి టేకోవర్ చేయడానికి అనుమతించాలని కోరారు.
ఇంతకీ మేటర్ ఏంటంటే..
టీవీ9 నుం 500 కోట్ల రూపాయలకు కొన్నామని గతంలోనే ప్రకటించింది కొత్త యాజమాన్యం. అయితే గత వారం సంస్థ అప్ లోడ్ చేసిన వాల్యూయేషన్ రిపోర్ట్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. సంస్థ తీవ్ర నష్టాల్లో మునిగిపోయిందని, నెలకు 6 కోట్ల లాభాలతో ఉన్న సంస్థ, ప్రస్తుతం నెలకు 6 కోట్ల నష్టంలోకి దిగజారిపోయిందని ఆ రిపోర్ట్ లో తెలిపింది.
కొత్త యాజమాన్యం అలంద మీడియాతో టేకోవర్ చేసుకున్నప్పుడు 250 రూపాయలుగా ఉన్న షేర్ వాల్యూ.. ప్రస్తుతం 78 రూపాయలకు పడిపోయింది. సరిగ్గా ఇక్కడే రవిప్రకాష్ తెరపైకి వచ్చారు. ఇప్పటికే కొన్ని వివాదాలపై కొత్త యాజమాన్యానికి, రవిప్రకాష్ కు మధ్య కేసులు నడుస్తున్నాయి.
ఇప్పుడు రవిప్రకాష్ ఏం చేశారంటే…
తాజా రిపోర్ట్ అధారంగా రవిప్రకాష్ ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్) లో కొత్తగా కేసు వేశారు. కంపెనీ విలువ ఏడాదిన్నరలో 500 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలకు పడిపోయిందని ఆరోపించిన రవిప్రకాష్.. తాజా ముఖవిలువతో మెజారిటీ షేర్లను కొనడానికి అనుమతించాలని కోర్టును కోరారు.
మైనారిటీ షేర్ హోల్డర్లు, మెజారిటీ షేర్లను కొనుగోలు చేసిన ఉదంతాలు గతంలో చాలానే ఉన్నాయి. పైగా కొత్త యాజమాన్యం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెట్ వర్క్ ఛానెళ్లను మూసేయడాన్ని కూడా రవిప్రకాష్ ప్రస్తావించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తిరిగి కంపెనీని టేకోవర్ చేయడానికి అనుమతించాలని కోరారు. రవిప్రకాష్ విజ్ఞప్తిపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.