శ్రీకాకుళం వెనకబాటుకు గురి అయిన జిల్లా ఉమ్మడి ఏపీలో చూసుకున్నా విభజన ఏపీలో తీసుకున్నా కూడా ప్రగతిలో చిట్టచివరి జిల్లాగా వెనక్కు నెట్టబడింది శ్రీకాకుళమే. ఈ జిల్లాలో ఉన్నంత వలసలు వేరే ఎక్కడా లేవు. జిల్లాకు జిల్లా టోటల్ గా రాష్ట్రాలు, దేశాలు దాటి ఉపాధి కోసం తరలిపోతోంది.
అటువంటి వారిలో రైతాంగం, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఆరుగాలం పొలాల్లో పనిచేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా కూడా నీటి వనరులు లేవు. ఉన్న జలవనరులు సరిపోదు. దాంతో వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది.
అలాంటి అద్భుతం జరిగితే శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. జిల్లాలో తాగు, సాగు నీరు దండిగా ఉంటుంది. వలసలు సైతం ఆగిపోతాయి. దాని కోసం ఇపుడు జగన్ సర్కార్ హయాంలో పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే జరుగుతోంది.
ఈ రెండు నదులను కలుపుతూ సిక్కోలుకు ఉజ్వల భవిష్యత్తులు అందించే కార్యక్రమానికి పునాది పడే సూచనలు అయితే మెండుగా ఉన్నాయి. దీని మీద జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. డీపీఆర్ తయారు చేయించి దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుంటే దశాబ్దాల కాలం నాటి కల సాకరం అయ్యేందుకు అడుగులు ముందుకు పడతాయి. మొత్తానికి జగన్ సర్కార్ లోనే ఇది జరిగితీరుతుందన్న నమ్మకం అయితే జిల్లా ప్రజలలో ఉంది.