కోటంరెడ్డి ట్యాపింగ్ అంతుతేల్చే ప‌నిలో జ‌గ‌న్‌

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పార్టీ మారేందుకు నిర్ణ‌యించుకుని, సొంత ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి చేసిన ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల నిగ్గు తేల్చాల‌ని సీఎం జ‌గ‌న్…

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పార్టీ మారేందుకు నిర్ణ‌యించుకుని, సొంత ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి చేసిన ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల నిగ్గు తేల్చాల‌ని సీఎం జ‌గ‌న్ ఇంటెలిజెన్స్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు.

త‌న స్నేహితుడు రామ‌శివారెడ్డితో మాట్లాడిన మాట‌ల్ని ట్యాపింగ్ చేశార‌ని కోటంరెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. త‌మ మ‌ధ్య సాగిన సంభాష‌ణను ట్యాపింగ్ చేసి, సంబంధింత ఆడియో రికార్డ్‌ను ఇంటెలిజెన్స్ చీఫ్ త‌న‌కు పంపి, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించార‌ని కోటంరెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి స్నేహితుడు రామ‌శివారెడ్డిని ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నార‌ని స‌మాచారం. ఓ ర‌హ‌స్య ప్రాంతంలో ఆయ‌న్ను ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నార‌ని తెలిసింది. అలాగే రామ‌శివారెడ్డి ఐపోన్‌ను స్వాధీనం చేసుకుని, గ‌త కొంత కాలంగా ఎమ్మెల్యేతో సాగిన సంభాష‌ణ‌ల‌పై నిగ్గు తేల్చే ప‌నిలో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌తో పాటు త‌న స్నేహితుడిది ఐ ఫోన్ల‌ని, వాటిలో కాల్ రికార్డింగ్ చేసే అవ‌కాశం లేద‌ని కోటంరెడ్డి అన్నారు.

కేవ‌లం ప్ర‌భుత్వం ట్యాపింగ్ చేయ‌డం వ‌ల్లే రికార్డు చేసి, వాటిని త‌న‌కు పంపిన‌ట్టు కోటంరెడ్డి ప్ర‌ధాన ఆరోప‌ణ‌. కోటంరెడ్డి ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని ఏ విధంగా రుజువు చేస్తారో చూడాలి. కోటంరెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన రోజే ఇంటెలిజెన్స్ అధికారులు త‌మ ప‌ని మొద‌లు పెట్టిన‌ట్టు స‌మాచారం. చివ‌రికి ఈ ఎపిసోడ్ ఏ ప‌రిణామాల‌కు దారి తీస్తుందో అనే ఉత్కంఠ రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కుంది.