ఏపీలో నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్‌గా నిలిచాయి. తమ సొంత ప్రభుత్వంపైన్నే నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ వాళ్లిద్దరూ వేర్వేరుగా ఘాటు ఆరోపణలు చేశారు. వీళ్లిద్దరి మధ్య అంత మంచి సంబంధాలు లేకపోవడం గమనార్హం. కానీ రాజకీయంగా ఇద్దరూ వైఎస్ జగన్‌ను తీవ్రంగా విభేదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వెంకటగిరి ఇన్‌చార్జ్‌గా నియమితులైన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆనం రామనారాయణరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో వైఎస్ జగన్‌ను అనరాని మాటలు అన్నప్పటికీ, క్షమించి పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. వెంకటగిరి సీటు ఇచ్చి, అందరినీ ఏకం చేసి ఆనంను గెలిపించారన్నారు.
జగన్ దయతలచి ఇచ్చిన సీటు, పదవిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే ఆనం మొదలు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. వెంకటగిరిలో నక్సలైట్లు ఉన్నారనడం ఏంటని ఆయన నిలదీశారు. వెంకటగిరి ప్రజల్ని నక్సలైట్లు చేశారా? అని నేదురుమల్లి ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, వాటిని ప్రజలపై రుద్ధాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఆనం రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం రామనారాయణ రెడ్డి అని ఘాటు విమర్శ చేశారు. వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించిందన్నారు. ఆనంను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నారన్నారు. ముందునుంచే శ్రీధర్ రెడ్డి, ఆనంలు టీడీపీతో టచ్‌లో ఉన్నారని రామ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇదిలా వుండగా గతంలో జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అంటూ ఆనం రామనారాయణరెడ్డి చేసిన ఆరోపణలను ఇవాళ నేదురుమల్లి పరోక్షంగా గుర్తు చేశారు. జగన్‌ను అనరాని మాట అంటే అదే అనే చర్చ జరుగుతోంది.