ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇరకాటంలోకి నెట్టేశారు. ఇటీవల ఆయన బీఆర్ఎస్‌తో విభేదించి రాజకీయంగా కొత్త నడకను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అలాగే వైఎస్ షర్మిలతో మంతనాలు సాగించారని బీఆర్ఎస్ అగ్రనేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఇవాళ వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు.
మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనతో భేటీ అయిన మాట నిజమే అని ప్రకటించి ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కుటుంబంతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలున్నాయి. 2014లో ఖమ్మం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన పొంగులేటి గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో కేసీఆర్ పంచన చేరారు.
సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ పొంగులేటిని కేసీఆర్ పక్కన పెట్టారు. అప్పటి నుంచి పొంగులేటి అసంతృప్తిగా ఉన్నప్పటికీ, తెలంగాణ అధికార పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈ ఏడాది చివరికల్లా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండడంతో భవిష్యత్ కార్యాచరణపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్‌లో ఉండకూడదనే నిర్ణయానికి ఆయన వచ్చారు. మరోవైపు వైఎస్సార్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో షర్మిలతో పొంగులేటి భేటీ అయ్యారు.
అయితే ఆ విషయాన్ని షర్మిల బయటికి చెప్పడంతో పొంగులేటి, ఆయన అనుచరులు ఖంగుతిన్నారు. తనకు పొంగులేటి మాట ఇచ్చారని షర్మిల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అలాగే మున్ముందు చాలా మందే తమ పార్టీలో చేరుతారని కూడా షర్మిల తాజాగా వ్యాఖ్యానించారు. షర్మిలతో భేటీ అయిన విషయాన్ని రహస్యంగా ఉంచకుండా, దాన్ని పది మందికి తెలిసేలా చేయడం అంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టి, తమ వైపు తిప్పుకోడానికి ఆమె బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పొంగులేటి అనుచరులు ఆరోపిస్తున్నారు. షర్మిల తన రాజకీయ ప్రయోజనాలే తప్ప, ఎదుటి వాళ్ల గురించి ఆలోచించడం లేదని పొంగులేటి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.