తమన్ భార్య మంచి సింగర్. చాలామందికి తెలియని విషయం ఇది. కెరీర్ స్టార్టింగ్ లో తన భార్యతో కొన్ని సాంగ్స్ కూడా పాడించాడు ఈ సంగీత దర్శకుడు. ఎప్పుడైతే స్టార్ డమ్ వచ్చిందో, అప్పట్నుంచి భార్యకు అవకాశాలివ్వడం ఆపేశాడు. తమన్ ఎందుకిలా చేశాడు? ఇంట్లోనే ఉన్న ఓ సింగర్ కు ఎందుకు అవకాశాలివ్వడం లేదు? దీనిపై తమన్ రియాక్ట్ అయ్యాడు.
“ఫ్యామిలీ ప్యాకేజీ అయిపోవడం నాకిష్టం లేదు. నిర్మాతలు నాపై కోట్లు ఖర్చుపెడుతున్నారు. నన్ను చూసి ఆడియో కంపెనీలు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయి. కాబట్టి నేను బాధ్యతగా ఉండాలి. నా దర్శకుడు, నిర్మాత ఏ సింగర్ ను అడుగుతున్నారో వాళ్లతోనే పాడించాలి. నా పెళ్లాం బాగా పాడుతుంది లేదా నా సిస్టర్ బాగా పాడుతుందని వాళ్లకు చెప్పి, నా ఫ్యామిలీని లోపలికి తీసుకురాకూడదు. నన్ను నమ్మి వాళ్లు తీసుకుంటున్నారు, నా ఫ్యామిలీ కావాలని నన్ను వాళ్లు బుక్ చేయడం లేదు కదా.”
కెరీర్ ప్రారంభంలో తన భార్యకు అవకాశాలిచ్చానన్న తమన్, రోజులు గడిచేకొద్దీ తనలో మెచ్యూరిటీ వచ్చిందని.. అప్పట్నుంచి తన భార్యకు అవకాశాలివ్వడం తగ్గించానని అన్నాడు. తన కంటే తన భార్య చాలా టాలెంటెడ్ అంటున్న తమన్, ఆ విషయాన్ని దర్శకుడు-నిర్మాతకు చెప్పి ఒప్పించడం తనకు ఇష్టంలేదంటున్నాడు.
“ఏదైనా పాటకు నా భార్య వాయిస్ బాగుంటుందని నేను నమ్మితే, నా దర్శకుడు, ప్రొడ్యూసర్ కు ముందుగా చెబుతాను. వాళ్లు ఓకే చెబితేనే నేను నా భార్యతో పాడిస్తాను. ప్రతి పాటకు సంబంధించి ప్రొడ్యూసర్-డైరక్టర్ కు లిస్ట్ ఇస్తాను. వాళ్లు అప్రూవ్ చేసిన వాళ్లతోనే పాడిస్తాను. నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోను. అది సిద్ శ్రీరామ్ అయినప్పటికీ వాళ్లు ఒప్పుకుంటేనే నేను పాడిస్తాను, లేదంటే పాడించను.”
తన భార్యను కచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తానని, అయితే తను చేసే సినిమాలతో మాత్రం ఆ పని చేయనంటున్నాడు. భవిష్యత్తులో భార్య కోసం ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసే ఆలోచన ఉందంటున్నాడు ఈ మ్యూజిక్ డైరక్టర్.