కొందరు నిర్మాతలు సినిమాను నమ్ముకుంటారు. మరి కొందరు నిర్మాతలు కాంబినేషన్లను ‘అమ్ముకుంటారు’. హారిక హాసిన సంస్థ ఈ రెండో పనే చేస్తున్నట్లు కనిపిస్తోంది. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ ను ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఈ సంస్థ ఇలా చేయడం ఇది రెండోసారి. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ తరువాత త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లోని అజ్ఙాతవాసికి వచ్చిన హైప్ ఇంతా అంతా కాదు. అప్పట్లో దాన్ని అలవి కాని భారీ రేట్లకు థియేటర్ హక్కులు విక్రయించారు. సినిమా డిజాస్టర్ అయింది. కొంత వెనక్కు ఇచ్చారు.
ఈ స్కీమ్ ఏదో బాగుందే అనిపించింది అందరికీ. అప్పటి నుంచి భారీ రేట్లకు అమ్మడం, తేడా వస్తే వెనక్కు ఇస్తారులే అని నమ్మి కొనడం, అలాగే తేడా వచ్చిన వాటికి వెనక్కు ఇవ్వడం అన్నది టాలీవుడ్ లో మామూలు అయింది. నిర్మాతల వరకు ఇది బాగానే వుంది. కానీ అంతంత రేట్లు ఇచ్చి, అవి రానపుడు హీరోల ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్నది విస్మరిస్తున్నారు. అప్పటికి ఈ వెనక్కు ఇవ్వడం అన్నది గుట్టు చప్పుడు లేకుండా మేనేజ్ చేస్తున్నారు. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ కు వైజాగ్ ఏరియాకు మూడు కోట్లకు పైగా వెనక్కు ఇచ్చారు. ఫ్యాన్స్ హిట్ లు అనుకున్న అనేక సినిమాలకు సైతం వెనక్కు ఇచ్చిన దాఖలాలు వున్నాయి.
వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి కలిపి ఇచ్చారు కనుక సరిపోయింది. లేదూ అంటే ఓ సినిమాకు వెనక్కు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వుండేది. నిజానికి కేజిఎఫ్ నిర్మాతలు సరైన, ధైర్యమైన పని చేస్తున్నారు. సినిమాను తమకు తామే విడుదల చేసుకుంటున్నారు. అమ్మడం లేదు.
లేటెస్ట్ గా మహేష్ బాబు చేస్తున్న త్రివిక్రమ్ సినిమా నైజాం హక్కులు 45 కోట్లకు అమ్మేసారు అంటూ వార్తలు వస్తున్నాయి. బయ్యర్ల మధ్య పోటీ వుండడంతో ఇంత రేట్ కోట్ చేసి, సాధించి వుండొచ్చు. కానీ రేపు తేడా వస్తే పోయేది మహేష్ పరువు. సరిలేరు నీకెవ్వరు హిట్ అనిపించుకుంటేనే 40 కోట్లు నైజాంలో టచ్ చేయలేదు. సర్కారు వారి పాట 30 కోట్లు టచ్ చేయలేదు. కానీ ఏ విధంగా 45 కోట్లు డిమాండ్ చేసారు అంటే త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురం కలెక్షన్లు చూపించి.
బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ మ్యాజిక్ నే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ చేస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. హారిక హాసిని అంటే తేడా వస్తే చూసుకుంటుందని బయ్యర్లు నమ్ముతున్నారు. టికెట్ రేట్లు ఎలాగూ నైజాంలో ఫ్లెక్సిబుల్ సిస్టమ్ లో వున్నాయి కనుక అదో ధీమా వుంది.
అంతా బాగానే వుంది. అల వైకుంఠపురములో ఓ అరి వీర బ్లాక్ బస్టర్. ఇప్పుడు నైజాంలో ఇప్పటికి నలభై కోట్లు దాటిన సినిమాలు గా. బాహుబలి వన్.. బాహుబలి2. అల వైకుంఠపురములో, ఆర్ఆర్ ఆర్ లనే చెప్పుకుంటారు. వీటిలో రాజమౌళి సినిమాల సంగతి వేరు. మరి తెలుగులో ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అయినా కూడా మూడే సినిమాలు నలభై మార్కు దాటగలిగాయి. పోనీ అప్పట్లో టికెట్ రేట్లు తక్కువ అనుకుందాం. కానీ ఇటీవల థియేటర్ కు రావడం తగ్గింది. జనం విరగబడి చూసారు..టికెట్ రేట్లు ఫరవాలేదు అనుకున్నా వాల్తేర్ వీరయ్య 35 దగ్గరకు చేరగలుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో తన సినిమాకు భారీ రేటు వస్తే ‘తనకూ మంచిదే’ అనే ఆలోచనతో మహేష్ సై అని వుండొచ్చు. కానీ రేపు తేడా వస్తే..(రాదు.రాకూడదు అనే కోరుకుందాం) యాంటీ ఫ్యాన్స్ తో మామూలుగా వుండదు. మహేష్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సరిలేరు నీకెవ్వరు తక్కువకు ఇచ్చారు కనుక, ఆ ఫిగర్ ను దాటింది కనుక సమస్య లేదు. అలాగే సర్కారు వారి పాట అక్కడకు అక్కడ సరిపోయింది. అందువల్ల మహేష్ డ్యామేజ్ కాలేదు. కానీ అలా చేయకుండా కేవలం ఇమేజ్ ను, కాంబినేషన్ ను క్యాష్ చేసుకుంటే పరిస్థితి వేరుగా వుంటుంది.
మరి ఈ వ్యవహారానికి మహేష్ ఎందుకు తల ఊపారో ఆయనకే తెలియాలి. వెనకాల ఎలాగూ రాజమౌళి సినిమా వుందనే ధీమా కావచ్చు. అన్నీ ఆ సినిమాతో లెవెల్ అయిపోతాయనే నమ్మకం కావచ్చు.
ఇంతకీ నైజాంనే 45 కోట్లకు అమ్మితే, ఆంధ్ర ఎంతకు అమ్ముతారో..50 కోట్లు దాటించేస్తారేమో? అలాగే ఓవర్ సీస్ 24 కోట్లు అంటున్నారు. అక్కడ ఎలా వుంటుందో పరిస్థితి. వెయిట్ అండ్ సీ.