జగన్ మాత్రమే డబ్బున్న రాజకీయ నాయకుడు

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా పుస్తకాలు చదివేసారు. అందువల్ల ఆయనకు అపార పరిజ్ఙానం వుంది అనుకుందాం కాస్సేపు. నిన్నటికి నిన్న ఆంధ్ర సిఎమ్ జగన్ ఓ మాట చెప్పారు. ఆంధ్రలో…

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా పుస్తకాలు చదివేసారు. అందువల్ల ఆయనకు అపార పరిజ్ఙానం వుంది అనుకుందాం కాస్సేపు. నిన్నటికి నిన్న ఆంధ్ర సిఎమ్ జగన్ ఓ మాట చెప్పారు. ఆంధ్రలో క్లాస్ వార్ జరుగుతోందని అన్నారు. కానీ ఇది పాపం పవన్ కళ్యాణ్ కు కాస్త అర్థం కాలేదేమో అనిపిస్తోంది. దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు అంటూ ఇంగ్లీష్ లో ట్వీట్ లు మొదలుపెట్టారు. తెలుగులో వేస్తే భాజపా జాతీయ నాయకులకు అర్థం కాదనో ఏమిటో? గతంలో జీ..జీ అంటూ హిందీలో ట్వీట్ లు వేసిన వైనం వుందనుకోండి. అది వేరే సంగతి.

ఇంతకీ జగన్ చెప్పిన క్లాస్ వార్ అంటే ఏమిటి? డబ్బున్న మారాజులు క్లాస్ వార్ గురించి మాట్లాడకూడదా? పేదలకు అన్యాయం చేసిన వాళ్లు అదే అన్యాయం గురించి మాట్లాడితే తప్పు కానీ, పేదలకు న్యాయం చేసే వాళ్లు మాట్లాడితే తప్పేంటీ? ఈ దేశంలో పుట్టి పేరు తెచ్చుకున్న ఎందరో జాతీయ నాయకులు గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వారే. వారంతా పేదల పక్షాన పోరాడిన వారే. అంతెందుకు వేల కోట్లు సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి జనం కోసం ఎలుగెత్తి ప్రజారాజ్యం అంటూ పోరాడలేదా. ‘అన్నా నువ్వ బాగా డబ్బున్న వాడివి, పేదల గురించి మాట్లాడకూడదు’ అని ఆ రోజు ఎందుకు సుద్దులు చెప్పలేదో?

ఇంతకీ జగన్ చెప్పిన క్లాస్ వార్ ఏమిటి?

ఒకే బడా సామాజిక వర్గానికి చెందిన నాలుగు మీడియా సంస్థలు కలిసి జగన్ మీద పడడం. ఎందుకు పడ్డాయి. వాళ్లకు అధికారం పోయిందని, రాష్ట్రంలో వ్యాపారమైనా, అధికారమైనా, మీడియా అయినా మరేదైనా తమదే అయి వుండాలనే అహంకార పూరిత ధోరణి వున్న ఆ సామాజిక వర్గం ఇప్పుడు ఎలాగైనా జగన్ ను గద్దె దింపేసి, మళ్లీ మరెప్పుడూ తమకు అధికారం చేజారకుండా వుండేలా పటిష్టమైన పునాది వేసుకుంటోంది. అందుకే తెల్లవారి లేచింది మొదలు జగన్ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుంది.

జగన్ ఈ ‘ముఠా’ ను ఎదుర్కోవడానికి ఎస్టీ,ఎస్సీ,బీసీ,మైనారిటీల లను తనకు అండగా వుండేలా చేసుకోవాలని అనుకుంటున్నారు. అలా లేకపోతే వారితో పోరాటం అసాధ్యం అని తెలుసు కనుక. అందుకే తన సైన్యం అనుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు వీలయినంత నగదు పంపిణీ పథకాలు చేపడుతున్నారు.

ఈ పథకాల గురించి డైరక్ట్ గా మాట్లాడకుండా, పథకాలు అమలు చేస్తున్న జగన్ ను గద్దె దింపడానికి ప్రయత్నించడం అంటే మరి క్లాస్ వార్ కాక మరేమిటి?

సరే, జగన్ అన్న మాటలు కాస్సేపు పక్కన పెడదాం. కృష్ణ, గుంటూరు ల్లో కాపు-కమ్మల మధ్య క్లాస్ వార్ దశాబ్దాల కాలంగా లేదు అని పవన్ చెప్పగలరా?

వెస్ట్ లో క్షత్రియులతో కాపులకు క్లాస్ వార్ లేదని అనగలరా?

ఈస్ట్ లో కాపులకు-కమ్మలకు, కాపులకు-ఎస్సీలకు క్లాస్ వార్ లేదని ప్రకటించగలరా?

విశాఖ జిల్లాలో గవరలతో, విజయనగరం జిల్లాలో వెలమలతో, శ్రీకాకుళం జిల్లాలో కాళింగులతో కాపులకు వైరుధ్యం వున్న మాట వాస్తవం కాదా?

ఇలా ప్రతి చోటా కాపులతో క్లాష్ అవుతున్న క్లాస్ లు అన్నీ ఇప్పుడు ఏ పార్టీ వైపు వున్నాయి? అలాంటి పార్టీకే కదా పవన్ వత్తాసు పలుకుతోంది. అలా పలుకుతూనే మళ్లీ తనకు కాపులు అండగా వుండాలని కోరుతోంది.

జగన్ డబ్బున్న సిఎమ్. మరి చంద్రబాబు డబ్బున్న మాజీ సిఎమ్ కాదా? వేల కోట్ల ఆసామీ కాదా? మరి ఆయన పేదల గురించి మాట్లాడవచ్చా? ఆయన ఏకైక వారసుడు లోకేష్ పేదల గురించి మాట్లాడ వచ్చా? జగన్ తప్ప ఇంకెవరు ఏం చేసినా పవన్ కు ఒప్పేనా?

జగన్ ను దింపడానికి అందరినీ ఒకటి చేస్తా అంటున్న పవన్ ఇండైరెక్ట్ గా జగన్ ఒక్కరు ఒకవైపు, మిగిలిన వారంతా మరో వైపు అనే యుద్దానికి రంగం సిద్దం చేస్తున్నట్లే కదా. మరి దీనిని ఏ వార్ అంటారు? అసలు 2019 ఎన్నికల నాటికి ఇప్పటికి చంద్రబాబులో ఏం మార్చు చూసి పవన్ మనసు మార్చుకున్నారు. ఆ రోజు లోకేష్, బాబు అవినీతి అని ఎలుగెత్తిన పవన్ కు ఇప్పుడు క్లీన్ చిట్ ఎలా దొరికంది?

జగన్ మాత్రమే కాదు సిఎమ్ లుగా వున్న చేసిన చాలా మంది ధనికులే. ఎన్టీఆర్ ధనికుడు కాదా? చంద్రబాబు కాదా? జయలలిత కాదా? ఇలా జాబితా తీస్తే చాలా మంది ధనికులే. కానీ వారంతా ప్రజల పక్షాన పోరాడ లేదా? వారికి వున్న అర్హత ఏమిటి? జగన్ కు లేనిదేమిటి? జగన్ ఫేస్ పవన్ కు నచ్చకపోవడం తప్ప?