ఉన్నట్లుండి ఓ గ్యాసిప్. ప్రభాస్-నాగ్ అశ్విన్ ల ప్రాజెక్ట్ కే రెండు భాగాలుగా వస్తుంది అంటూ. ఇప్పటికే ఆదిపురుష్…సలార్ వన్.. సలార్ 2..ఆపై ప్రాజెక్ట్ కె వన్..టూ అంటే ఇక పాపం పీపుల్స్ మీడియా సినిమా ఎప్పటికి రావాలి? ప్రాజెక్టుకు ఎంత అవుతుందో జీతాలకు, వడ్డీలకు అంత అవుతుంది. సరే అది వేరే సంగతి. పైగా తరువాత సిద్దార్ధ్ ఆనంద్ సినిమా వుండనే వుంది.
2023 లో రెండు సినిమాలు అనుకుంటే 2024 లో మరో రెండు సినిమాలు అనుకుంటే, 2025 లో ఇంకో రెండు సినిమాలు అన్నమాట. అంటే ప్రభాస్ డైరీ 2026 వరకు ఫుల్. భారీ సినిమాలు, భారీ పెట్టుబడులు, భారీ వ్యయాలతో చేసే సినిమాలు చకచకా విడుదలైతేనే మంచింది. కానీ ప్రభాస్ తన కెరీర్ ను సీరియస్ గా తీసుకుంటున్నారా అన్నది అనుమానం. రాజమౌళి బిల్డ్ చేసిన అద్భుతమైన ఇమేజ్ ప్రభాస్ స్వంతం.
2019లో సాహు..2022 లో రాధేశ్యామ్. రెండు సినిమాలు పూర్తి స్థాయి విజయాలు సాధించలేదు. కానీ ప్రభాస్ కు బలమైన, అపారమైన ఫ్యాన్ బేస్ వుంది. అలాంటపుడు చకచకా ఏడాదికి ఓ సినిమా చేసుకుంటే వేరు. అలా కాకుండా, ఓ భాగమా..రెండు భాగాలా అన్నది క్లారిటీ లేకుండా అరడజను సినిమాలు ఒకేసారి కొంచెం కొంచెం వాయిదాల పద్దతిలో పూర్తి చేయాలని అనుకోవడం సరైనదేనా అన్నది ప్రభాస్ నే ఆలోచించాలి.
ప్రభాస్ లెవెల్ స్టార్ ఇలా ఇన్ని సినిమాలు వారం..వారం షెడ్యూలు లెక్కన సినిమాలు చేయడం ఆయన దగ్గర మాత్రమే కనిపిస్తుంది. ఇలా చేసే మరో హీరో అది కూడా ప్రభాస్ రేంజ్ హీరో కనిపించరు. నిజానికి ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె మూడూ ప్రామిసింగ్ సినిమాలే. కానీ చకచకా ఫినిష్ చేసి విడుదల చేయాల్సి వుంది. సలార్ రెండు భాగాలు అన్నారు. కానీ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఫస్ట్ పార్ట్ నే ఇంకా పూర్తి కాలేదు. మరి రెండో భాగం ఎప్పుడో?
ఇప్పుడు ప్రాజెక్ట్ కె రెండు భాగాలు అంటున్నారు. ఆ సినిమా అసలు సగం కూడా పూర్తి కాలేదు. మరి రెండు భాగాలు ఎప్పుడో? రెండు భాగాలు అంటే ఆ స్క్రిప్ట్ వేరు. బాహుబలికి మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు పుష్పకు సాధ్యం కావచ్చు. కానీ సినిమా ఎప్పటికీ పూర్తి కావడం లేదని, రెండు భాగాలు చేసి, ఒక భాగం ముందు వదిలేసి, కమర్షియల్ గా డబ్బులు చేసుకోవచ్చు. నిర్మాత హ్యాపీ నే. కానీ వన్ బై వన్ రెండు భాగాలు వస్తే ఒకలా వుంటుంది. లేకపోతే వేరుగా వుంటుంది. ఈ మధ్యలో వేరే సినిమా వస్తే ఒకలా వుంటుంది. లేదంటే మరోలా వుంటుంది.
ఇలా తికమకగా సినిమాలు ప్లాన్ చేయడం కన్నా వన్ బై వన్ సినిమాలు చేస్తూ వెళ్తే అది వేరుగా వుంటుంది. కానీ ఇక్కడ ప్లాన్ చేసేది ప్రభాస్ నే. మరెవరు కాదు. అందుకే ఆయన కెరీర్ కు ఆయనదే బాధ్యత. ఇది కరెక్ట్ నా కాదా అన్నది కాలమే చెప్పాలి.