చంద్రబాబు తన గురించి తాను రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చెప్పుకున్నారు గానీ.. నిజానికి ఆయనది రెండు నాలుకల సిద్ధాంతం. ఆ విషయాన్ని ఆయన తన వ్యవహార సరళితో పదేపదే నిరూపించుకుంటూ ఉంటారు. తాజాగా కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా ఆయన తన బుద్ధిని దాచుకోలేదు. విషయం ఒకటే.. కేంద్ర బడ్జెట్! దాని గురించి చంద్రబాబునాయుడు మాట్లాడిన తీరు ఆయన సహజలక్షణాల్ని వివరిస్తోంది. అదే బడ్జెట్ విషయంలో కేంద్రం పాత్ర గురించి ఆయన చిడతలు పట్టుకుని తయారైపోయారు. శతవిధాలుగా కీర్తించారు. అదే రాష్ట్రం విషయానికి వచ్చేసరికి జగన్ ప్రభుత్వాన్ని తూలనాడడానికి ఆ బడ్జెట్ నే వాడుకున్నారు.
బడ్జెట్ ప్రకటన సందర్భంగా నిర్మల సీతారామన్ తమ ప్రభుత్వం గురించి డప్పు కొట్టుకోవడానికి ఏయే అంశాలనైతే చెప్పుకుంటూ వచ్చిందో.. వాటన్నింటినీ చంద్రబాబు మళ్లీ ఏకరవు పెడుతూ.. ‘ఆహా ఇదంతా అద్భుతం’ అని సెలవిచ్చారు. కొత్త పథకాలను, ఇతర అంశాలను కీర్తించారు. ఆయన ప్రస్తుతం మోడీ గుడ్ లుక్స్ లో ఉంటూ.. ఆయనను ప్రసన్నం చేసుకోవడం ద్వారా.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కాపాడుకునే కోరికతో ఉన్నారు గనుక.. బడ్జెట్ భజనకు చిడతలు వాయించారని అనుకోవచ్చు.
అదే సమయంలో రాష్ట్రప్రభుత్వం విషయంలో ఆయన ఎందుకు తేడాగా మాట్లాడుతున్నారు. కేంద్రంనుంచి రాష్ట్రప్రభుత్వానికి ఈ బడ్జెట్ రూపేణా దక్కింది పెద్దగా ఏమీ లేదు. ఆ మాట వాస్తవమే. దానిని సాకుగా పెట్టుకుని జగన్ సర్కారు మీద నిందలు వేయడానికి చంద్రబాబు ఉత్సాహపడుతున్నారు. పోలవరానికి కేటాయింపులు లేవు, వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్యాకేజీ కూడా రాలేదు. విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్ కాగా, అవీ అమలు అయ్యే సూచనలు లేవు. ఇదంతా బాగానే ఉంది. మరి.. ఆ విషయాల్లో మోడీ సర్కారు ఏపీ ప్రజలను మోసం చేసిందనే మాట చంద్రబాబు నోటినుంచి ఎందుకు రావడం లేదు. ఇదంతా జగన్ మీదకు నెట్టేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ఎందుకు కుట్రపూరిత మాటలు మాట్లాడుతున్నారు.
రాష్ట్రంలో వైసీపీతో తెలుగుదేశానికి లడాయి ఉండొచ్చు. కానీ కేంద్రం వరకూ వచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వంచన జరిగితే కేంద్రంతో తలపడడానికి సిద్ధపడితేనే ప్రయోజనం దక్కుతుంది. దానికి ధైర్యం లేనివాడు ఏదీ సాధించలేడు.
రాష్ట్రానికి మోసం చేసినది కేంద్రప్రభుత్వం. ఆ మాట అనే దమ్ముచంద్రబాబుకు లేదు.. వాళ్లను భజన చేస్తూ ఉండాలి. రాష్ట్రప్రజల దృష్టిలో వారి పరువును కాపాడే ఏజంటు లాగా పనిచేయాలి. అదే సమయంలో.. జరుగుతున్న ప్రతి నష్టానికి జగన్ ను కారణంగా చూపించి పబ్బం గడుపుకోవాలి.. ఇలాంటి కుటిల రాజనీతితో చంద్రబాబు ముందుకు వెళ్లడం చీప్ గా ఉందని పలువురు భావిస్తున్నారు.