కేంద్రప్రభుత్వం తమ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపించింది. బడ్జెట్ లో ఈ రాష్ట్ర ప్రజల మొహంలో చిరునవ్వు విరిసేలా ఒక్కటంటే ఒక్క నిర్ణయాన్ని కూడా కేంద్రం ప్రకటించలేకపోయింది. పైగా వారికి దుఃఖం కలిగించే రీతిలో పోలవరం లాంటి ప్రాజెక్టుల పేరు కూడా ప్రస్తావించకుండానే బడ్జెట్ ముగిసిపోయింది.
ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గమైన మోసపూరిత వైఖరి నిజమే. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి కేంద్రం మీద ధ్వజమెత్తగలిగితే.. ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఇక్కడ వాతావరణం అలా లేదు. కేంద్రం రిక్తహస్తం చూపించడాన్ని కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ వైఫల్యంగా ప్రొజెక్టు చేయడానికి విపక్షాలు, యెల్లో మీడియా పడుతున్న తపన చీదర పుట్టిస్తోంది.
అందరూ చెబుతున్న మాట ఒక్కటే.. జగన్ ప్రభుత్వం సాధించలేకపోయింది అని. అసలు సాధించడం అంటే ఏమిటి? కేంద్రం గల్లా పట్టుకుని వారి జేబుల్లోంచి సొమ్ములు గుంజుకుని రావాల్నా? వీరు ఏం తలచుకుంటున్నారో అర్థం కావడం లేదు. సాధించడం అంటే ఎలా ఉంటుంది.
అటు మోడీ సర్కారు సింగిల్ పార్టీగానే విస్పష్టమైన మెజారిటీతో కేంద్రంలో పాలన సాగిస్తోంది. కేంద్రప్రభుత్వ నిర్ణయాలు చాలా వరకు నియంతృత్వాన్ని తలపిస్తుంటాయి. ఎవ్వరి ఆలోచనలు, అభిప్రాయాలతోను తమకు నిమిత్తం లేదు. చేయదలచుకున్నది చేసుకుంటూ పోవడమే.. అన్నట్టుగా కేంద్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రంతో సామరస్య సంబంధాల ద్వారా అంతో ఇంతో రాష్ట్రప్రభుత్వం సాధించగలుగుతోంది.
పోలవరం విషయానికే వస్తే.. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కేంద్రానికి వినతిపత్రాలు ఇచ్చారో లెక్కేలేదు. సాధించడం లేదు అని జగన్ మీద నింద వేసేప్పుడు ఎలా సాధించాలో ఒక సలహా ఇవ్వొచ్చు కదా. 31 మంది ఎంపీలున్నా కూడా ఏమీ చేయలేకపోయారని జగన్ అంటున్నారు. కానీ నెంబర్ గేమ్ ప్రజాస్వామ్యంలో జగన్ కు ఈ నెంబర్ ఉండడం మాత్రమే సరిపోదు కదా.. ఈ నెంబర్ మీద ఆధారపడే బలహీనత కేంద్రానికి కూడా ఉండాలి. అయితే ఇంతకంటె బలమైన మెజారిటీతో బిజెపి రాజ్యం చేస్తోంది. వైసీపీ బలాన్ని వారు ఖాతరు చేయని పరిస్థితి ఉంది.
ఇవాళ చంద్రబాబునాయుడు గానీ, పచ్చమీడియా గానీ.. రాష్ట్రానికి దక్కకపోయిన వాటిగురించి జగన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. వారి ఆరాటం మంచిదే. కానీ.. చంద్రబాబునాయుడు గతంలో కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి పోలవరానికి ఏం సాధించారు. అంత అసమర్థుడైన నాయకుడిగా ముద్రపడిన చంద్రబాబుకు మరొకరిని నిందించేందుకు నోరెలా వస్తుంది అని ప్రజలు దెప్పిపొడుస్తున్నారు.