వైసీపీకి ఉమ్మడి నెల్లూరు జిల్లా కంచుకోట. గత సార్వత్రిక ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అలాంటి జిల్లాలో నిరసన గళాలు వినిపించడం వైసీపీని కలవరపెడుతోంది. ఎన్నికలు సమీపించే సమయానికి నెల్లూరు జిల్లానే కాకుండా ఇతర చోట్ల మరెంతగా నిరసన గళాలు వినపడుతాయో అనే ఆందోళన అధికార పార్టీలో నెలకుంది.
ఇదిలా వుండగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికల్లో ఇద్దరికి సీట్లు ఇవ్వద్దని అనుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో జగన్‌ను వద్దని మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అనుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు బహాటంగానే జగన్ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేస్తుండడం చూస్తున్నాం, వింటున్నాం.
జగన్ వద్దనుకుంటున్న వారిలో ఉదయగిరి, గూడూరు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, వరప్రసాద్ ఉన్నారు. అలాగే జగన్‌ను వద్దనుకున్న వారిలో నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉండగానే ఆనం, కోటంరెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి సంచలన ఆరోపణలు చేసి, ప్రత్యర్థులకు ఆయుధాలు అందించారు. సాంకేతికంగా మాత్రమే వాళ్లిద్దరూ వైసీపీలో ఉన్నారని లెక్క.
ఇక గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ విషయానికి వస్తే… వైసీపీకి కంచుకోటైన ఆ నియోజకవర్గంలో చేజేతులా వ్యతిరేకతను సంపాదించుకున్నారు. మరోసారి వరప్రసాద్‌కే టికెట్ ఇస్తే, అటు వైపు ప్రత్యర్థులెవరైనా సునాయాసంగా గెలుపొందడం ఖాయం. గూడూరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సీఎం జగన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. త్వరలో అక్కడ కూడా ఇన్‌చార్జ్‌గా కొత్త వారిని నియమించే అవకాశాలున్నాయి.
టికెట్ దక్కదనే ప్రచారమవుతున్న వారిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేరు కూడా చేరింది. వ్యక్తిగత వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుటుంబంతో కూడా సంబంధాలు అంతంత మాత్రమే. వివాహేతర సంబంధాల విషయమై ఈయన నిత్యం విమర్శలకు గురవుతుండడం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ప్రస్తుతం ఉదయగిరి పరిశీలకుడిగా ధనుంజయ్‌రెడ్డిని నియమించడంపై ఎమ్మెల్యే బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
ఒకవైపు వైఎస్ కుటుంబానికి తాను వీర విధేయుడినని చెప్పుకుంటున్నా, చంద్రశేఖర్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లి నష్టపోయే పరిస్థితిలో జగన్ లేరని సమాచారం. వైసీపీ కంచుకోటలో ప్రస్తుత పరిస్థితి ఇది.