ఇటీవలి పరిణామాల్లో నటి కంగనా రనౌత్ తీరును తప్పు పడుతూ ఒక పోస్టు పెట్టాడు నటుడు ప్రకాష్ రాజ్. భారతీయ జనతా పార్టీ అనుకూలవాదిగా ముద్ర వేయించుకోవడానికి ఉబలాటపడుతూ ఉంది కంగనా రనౌత్. ఈ క్రమంలో తనను తాను ఝాన్సీ లక్ష్మీభాయిగా అభివర్ణించుకుంది కంగనా. ఝాన్సీ బయోపిక్ లో నటించిన వైనాన్ని గుర్తు చేసుకుంటూ, తను కూడా ఝాన్సీ అని ఆమె ప్రకటించుకుంది. దానిపై ప్రకాష్ రాజ్ సెటైర్ వేశాడు.
మణికర్ణికలో నటించినంత మాత్రానా కంగనా ఝాన్సీ అయిపోతే.. మహామహుల బయోపిక్స్ లో నటించిన మిగతా వారి పరిస్థితి ఏమిటి? అంటూ ప్రకాష్ రాజ్ సెటైర్ వేశాడు.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు. అదే జయలలిత బయోపిక్. ఇప్పటికే ఆ సినిమా కొంత షూటింగును కూడా పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్ షూటింగును ఇప్పుడు చేపడుతున్నారట. విశేషం ఏమిటంటే… ఈ సినిమాలో కూడా కంగనా చేస్తున్న పాత్రను వ్యతిరేకించే పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తూ ఉండగా, ప్రకాష్ రాజ్ కరుణానిధి పాత్రలో కనిపిస్తున్నాడని తెలుస్తోంది.
ఇది వరకూ కరుణ పాత్రను ప్రకాష్ రాజ్ ఒక సారి పండించాడు. మణిరత్నం ఇద్దరు సినిమాలో కరుణను ఉద్దేశించిన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఈ సారి ఇన్ డైరెక్టుగా అదే పాత్రలో కనిపిస్తున్నాడు. మరి తనపై సెటైర్లు వేసిన ప్రకాష్ రాజ్ ను కంగనా తన సినిమాలో ఉంచమంటుందో, ఆయనను తొలగించాల్సిందే అంటుందో, ఆమె తీరు చూస్తే ఏమైనా అనగలదు.
అదలా ఉంటే.. కంగనా రనౌత్ తీరుకు భయపడిపోయి పీసీ శ్రీరామ్ ఆమె నటిస్తున్న ఒక సినిమా నుంచి తప్పుకున్నాడు. వివాదాలకు, అలాంటివి క్రియేట్ చేసే వాళ్లకు దూరంగా ఉండటం మంచిదనే ఉద్దేశంతో ఆ ఫేమస్ కెమెరామ్యాన్ కంగనా నటిస్తున్న ఒక సినిమా నుంచి వైదొలిగినట్టుగా తెలుస్తోంది. ఇది వరకూ కూడా తనతో పని చేస్తున్న వారిని కంగనా బుల్లీయింగ్ చేసినంత పని చేసిందని వార్తలు వచ్చాయి. కొందరు సినిమాలు పూర్తవుతున్న దశలో కూడా తప్పుకున్నారు. మణికర్ణిక సినిమా విడుదల సమయానికి ఆ సినిమా దర్శకుడు క్రిష్ దానికి ఎలా దూరమయ్యాడో అప్పట్లో వార్తలు వచ్చాయి.