థియేటర్లకు కరెంట్ కట్ కట

కరోనా కారణంగా మార్చి 14 తరువాత నుంచి మూతపడిన థియేటర్లు నేటికీ తెరుచుకోలేదు. అక్టోబర్ మొదటి వారం నుంచి తెరుచుకుంటాయని వార్తలు వున్నాయి. కానీ ఈలోగా థియేటర్ల నిర్వాహకులకు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. సిబ్బందికి…

కరోనా కారణంగా మార్చి 14 తరువాత నుంచి మూతపడిన థియేటర్లు నేటికీ తెరుచుకోలేదు. అక్టోబర్ మొదటి వారం నుంచి తెరుచుకుంటాయని వార్తలు వున్నాయి. కానీ ఈలోగా థియేటర్ల నిర్వాహకులకు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. సిబ్బందికి పెద్దగా జీతాలు ఇవ్వకపోయినా కరెంట్ బిల్లులు తప్పడం లేదు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆశ పెట్టుకుని ఇప్పటి వరకు కరెంట్ బిల్లులు కట్టకుండా వుండిపోయారు. కానీ రెండు చోట్లా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

వ్యాపార రంగమైన థియేటర్లకు కరెంట్ బిల్లులు మాఫీ చేస్తే, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకీడ్చే మధ్యతరగతి వారి పరిస్థితి ఏమిటి? జనం నుంచి ముక్కు పిండి మరీ కరెంట్ బిల్లులు వసూలు చేసారు. చిన్న వ్యాపారులు, పెద్ద వ్యాపారులు అంతా కరెంట్ బిల్లులు మినిమమ్ కట్టారు. భారీ వస్త్ర దుకాణాలు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోన్నాయి.

మరి వీరందరినీ వదిలేసి కేవలం థియేటర్లకు మాత్రమే కరెంట్ బిల్లులు రద్దు చేయడం ఎంత వరకు సమంజసం అనే వాదన ఒకటి వుంది. సినిమా పెద్దలు అటు కేసిఆర్ ను, ఇటు జగన్ ను కలిసినపుడు కరెంట్ బిల్లుల ప్రస్తావన వచ్చింది. అయితే జగన్ చూస్తాను అని అన్న మాట అయితే అన్నారు. కానీ దానికి 'చేస్తాను' అన్నంతగా బయటకు వచ్చింది.  కానీ ఇప్పటికీ ఉత్తర్వులు అయితే రాలేదు.

ఇటు తెలంగాణలో కూడా ఉత్తర్వలు రాలేదు కానీ, వస్తాయని సినిమా జనాలు ఆశగా వున్నారు. తప్పకుండా తెలంగాణలో థియేటర్ల కరెంట్ బిల్లులు రద్దు చేస్తారని నమ్మకంగా వున్నారు. ఈలోగా ఆంధ్రలో మాత్రం చాలా చోట్ల థియేటర్ల కరెంట్ కట్ చేయడం ప్రారంభమైపోయింది. చాలా జిల్లాల్లో థియేటర్లకు కరెంట్ కట్ చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

ఒక పక్క కరెంట్ కష్టాలు ఇలా వుంటే, థియేటర్లు ఓపెన్ చేస్తే, లీజు మొత్తాలు కూడా కట్టుకోవాల్సి వుంటుంది. లేదా ఆ మొత్తాన్ని ఏదో విధంగా సద్దుబాటుకు ఎవరికి వారు వారివారి సంబంధాల మేరకు ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వుంటుంది.  ఇప్పటి వరకు సిబ్బందికి పెద్దగా జీతాలు ఇవ్వకపోయినా నడచిపోయింది. వన్స్, థియేటర్లు ఓపెన్ చేస్తే జీతాలు ఇవ్వాల్సిందే. కరెంట్ బిల్లులు అప్పటి నుంచి అయినా పూర్తిగా కట్టాల్సిందే. 

కానీ ఇవన్నీ సినిమాలు విడుదల కావడం, జనాలు థియేటర్లకు రావడం బట్టి వుంటుంది. బహుశా ఈ కష్టాలు అన్నీ ఊహించే సురేష్ బాబు లాంటి వాళ్లు ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేయడం వద్దు అంటూ వెనక్కు లాగుతున్నారు. కానీ థియేటర్లపై మక్కువ వున్న ఆసియన్ సునీల్ లాంటి వాళ్లు థియేటర్లకు అనుమతి కావాలని పట్టుపడుతున్నారు. మొత్తం మీద థియేటర్ల తలుపులు అయితే అక్టోబర్ మొదటి వారం నుంచి తెరచుకుంటాయని నమ్మకమైన వార్తలు వినిపిస్తున్నాయి.

పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగానే వున్నాయి. ఈస్ట్ గోదావరి లాంటి కొన్ని జిల్లాలు మినహా, అలాగే జిల్లా జిల్లా గుత్తగా కాకుండా, ఏరియాల వారీ థియేటర్లు తెరిచే అవకాశం వుంది. కానీ అలా తెరిచి ప్రయోజనం లేదు. సినిమాలు విడుదల కావడం కష్టం.

ఇలాంటి నేపథ్యంలో కరెంట్ బిల్లుల భారం, లీజు మొత్తాల భారం మీద పడితే ఎగ్జిబిటర్ల పని కాస్త కష్టంగానే వుంటుంది.

నిఖిల్ ఎలా ఉన్నాడో రెండేళ్లు చూసి అప్పుడు పెళ్లి చేసుకుంటా