రాజకీయ నాయకులకు సాధారణంగా భయాలు ఎక్కువగా ఉంటాయి. తమ మీద ఎవరైనా దాడులు చేస్తారని భయపడుతుంటారు. దాడులు అంటే మాటల దాడులు కాదు భౌతిక దాడులు. ఇలాంటి భయాలున్న నాయకులు అధికార పార్టీవారైతే ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుంది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆ పనే చేసింది. నలుగురు వైసీపీ నాయకులకు భద్రత కల్పించడం కాదు ఉన్న భద్రతను పెంచింది. ఎందుకు? టీడీపీ వాళ్ళు దాడులు చేయవచ్చనే భయం కావొచ్చు.
ఆ నలుగురిలో ఒకాయన మంత్రి. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు. ఆ మంత్రి కొడాలి నాని. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, వల్లభనేని వంశీ. ఈ నలుగురికీ ప్రభుత్వం ఉన్నట్లుండి భద్రత ఎందుకు పెంచింది? వారికి మావోయిస్టుల నుంచిగానీ, ఇతరుల నుంచిగాని బెదిరింపులు వచ్చినట్లు, ప్రాణహాని ఉన్న దాఖలాలు లేవు.
కానీ వీరిపై దాడులు జరగవచ్చని ప్రభుత్వానికి అనుమానంగా ఉంది. లేదా ఆ అనుమానాన్ని వారే వ్యక్తం చేశారేమో. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై అనుచిత ఆరోపణలు చేసినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న వీరికి సెక్యూరిటీని ప్రభుత్వం సమీక్షించింది. మరింత అదనపు భద్రత కల్పించాలని నిర్ణయించింది.
మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం 4 + 4 సెక్యూరిటీ..కాన్వాయ్‌తోపాటు ఉంది. మంత్రి ప్రోటోకాల్‌కు తగ్గట్లుగా ఆయనకు రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు మరింత భద్రత కల్పించాలని నిర్ణయించారు. మొత్తం 17 మంది భద్రతా సిబ్బందితోపాటు కాన్వాయ్‌లో ఆదనంగా మరో కారును చేర్చాలని నిర్ణయించారు.
ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా భద్రత పెంచారు. ఆయనకు ఇప్పటి వరకూ 1 + 1 సెక్యూరిటీ ఉండేది. ఇక నుంచి ఆయనకు 4 + 4 సెక్యూరిటీని కల్పిస్తారు. అలాగే అంబటి రాంబాబుతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా సెక్యూరిటీ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేష్‌పై మొదట విమర్శలు, ఆరోపణలు ప్రారంభించింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే. ఆయన ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. అసెంబ్లీలో ఈ అంశాన్ని అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ చంద్రబాబు ఉన్నప్పుడే లేవనెత్తి అసభ్యంగా మాట్లాడారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తన భార్యను కించ పరచడం తట్టుకోలేక చంద్రబాబు కన్నీరు పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు. చంద్రబాబు సతీమణి ..ఎన్టీఆర్ కుమార్తె కావడంతో వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది.
నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.ఈ కారణంగా ఆ మాటలన్నవారందరికీ భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బెదిరింపులు వస్తున్నాయని అందుకే భద్రత పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.