స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరికీ ఒక గంట సేపు తేలికగా గడిచే పరిస్థితి లేదిప్పుడు. అది కూడా ఎక్కడకైనా బయటకు వెళితే, పది నిమిషాలు కూడా ఫోన్ లేకుండా గడపడం కష్టం. అయితే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల వివాహానికి హాజరైన వారికి మాత్రం ఇలాంటి కష్టం తప్పదట. ఎందుకంటే.. తమ వివాహ వేడుకు హాజరయ్యే వారు ఫోన్ కు దూరంగా ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారట. వచ్చే నెలలో పెళ్లి చేసుకోనున్న ఈ జంట.. ఈమేరకు తమ ఆహ్వాన పత్రికలను అందించి, షరతును చెబుతోందట.
పెళ్లి మండపంలోకి స్మార్ట్ ఫోన్ ను తీసుకురాకూడదనేది వీరి షరతుగా తెలుస్తోంది. ఇంతకీ ఎందుకు ఫోన్ తీసుకురాకూడదు అంటే.. ప్రైవేసీ కోసమేనని తెలుస్తోంది. తాము ఎంతో ఇష్టంతో పెళ్లికి పిలిచిన వారు. అక్కడకు వచ్చి తమను విష్ చేసి వెళ్లాలనే కత్రినా, విక్కీలు అనుకుంటున్నారట.
అయితే అక్కడకు వచ్చిన వారు అదే అదనని పెళ్లి వేడుకను ఫొటోలుగా, వీడియోలుగా తీయడం, వాటిని తమకు కావాల్సిన వాళ్లతో షేర్ చేసుకోవడం కత్రినా, విక్కీలకు ఇష్టం లేదట. అందుకే నిర్మొహమాటంగా వివాహానికి ఆహ్వానించిన వారికి, ఈ నో ఫోన్ కండీషన్ ను చెబుతున్నారట.
అయితే ఇది కొత్తది కాదు. ఇది వరకూ కూడా పలువురు సెలబ్రిటీలు తమ పెళ్లి వేడుక వైపుకు స్మార్ట్ ఫోన్లను తీసుకురానీయలేదు. దీపికా, రణ్ వీర్, ప్రియంక, నిక్ జోసస్ జంటలు కూడా తమ తమ పెళ్లిళ్లకు అతిథులుఫోన్ తీసుకురావొద్దని స్పష్టం చేశారు.
పెళ్లి ఫొటోలను కూడా తమకే నచ్చిన వారితోనే షేర్ చేసుకోనున్నారట. వీరి పెళ్లి ఏర్పాట్లను చూసే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ కూడా పెళ్లి వేడుకలో ఎవరు పడితే వారు ఫోన్లతో ఫొటోలు తీయడానికి అభ్యంతరం చెప్పిందట. దీంతో.. పెళ్లి వేడుక చూడాలనుకునే వారు కాసేపు తమ ఫోన్ కు దూరంగా ఉండాల్సిందనట.