హ‌ర్భ‌జ‌న్ రికార్డును అధిగ‌మించ‌నున్న అశ్విన్

టీమిండియ‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ముందు ఒక అరుదైన రికార్డు ఉంది. ఇండియా, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య‌న జ‌రిగే టెస్టు సీరిస్ లో అశ్విన్ ఐదు వికెట్ల‌ను సాధిస్తే.. భార‌త్ త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక…

టీమిండియ‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ముందు ఒక అరుదైన రికార్డు ఉంది. ఇండియా, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య‌న జ‌రిగే టెస్టు సీరిస్ లో అశ్విన్ ఐదు వికెట్ల‌ను సాధిస్తే.. భార‌త్ త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక వికెట్ల‌ను సాధించిన బౌల‌ర్ల‌లో అశ్విన్ కు మూడో స్థానం ద‌క్కుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ రికార్డు ప్ర‌ముఖ స్పిన్న‌ర్, మాజీ ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ పేరు మీద ఉండ‌గా, ఐదు వికెట్ల‌ను ప‌డ‌గొడితే భ‌జ్జీని అశ్విన్ అధిగ‌మిస్తాడు.

హ‌ర్భ‌జ‌న్ సింగ్ త‌న టెస్టు కెరీర్ లో మొత్తం 417 వికెట్ల‌ను సాధించాడు. ప్ర‌స్తుతం అశ్విన్ ఖాతాలో 413 వికెట్లున్నాయి. ఇంకో ఐదు ప‌డ‌గొడితే కుంబ్లే, క‌పిల్ దేవ్ ల త‌ర్వాతి స్థానం అశ్విన్ కు సొంతం అవుతుంది. హ‌ర్బ‌జ‌న్ 103 టెస్టుల్లో 417 వికెట్ల‌ను సాధిస్తే, అశ్విన్ ఇప్ప‌టి వ‌ర‌కూ 79 మ్యాచ్ ల‌ను ఆడి ఈ మేర‌కు వికెట్ల‌ను సాధించాడు. చెయ్యి తిరిగిందంటే అశ్విన్ మ‌రో మ్యాచ్ లోనే భ‌జ్జీ రికార్డును అధిగ‌మించే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం అశ్విన్ వ‌య‌సు ముప్పై ఐదేళ్లు. ప్ర‌స్తుతం టీమిండియాలో ఫైన‌ల్ లెవ‌న్ కు ఉన్న పోటీని బ‌ట్టి చూస్తే.. అశ్విన్ కు అవకాశాలు త‌గ్గిపోతున్నాయి. రెండేళ్లుగా టీ20 క్రికెట్ నుంచి దూరం పెట్టారు. అయితే ఉన్న‌ట్టుండి ఇటీవ‌ల మ‌ళ్లీ అవ‌కాశం ల‌భించింది. 

అయిన‌ప్ప‌టికీ.. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్లో అశ్విన్ కు పోటీ చాలా ఎక్కువ‌గా ఉంది. వ‌య‌సు రీత్యా కూడా ఇత‌డిని ప‌క్క‌న పెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌. టెస్టుల విష‌యంలో మాత్రం ఈ సీనియ‌ర్ కు కాస్త అవ‌కాశం ఉంది. మ‌రో ఏడాది, రెండేళ్ల పాటు కెరీర్ ను కొన‌సాగించే అవ‌కాశం ఉంది. 

సాధారణంగా స్పిన్ బౌల‌ర్లు త‌మ కెరీర్ చివ‌ర్లోనే వీలైన‌న్ని ఎక్కువ వికెట్ల‌ను సాధిస్తూ ఉంటారు.  అదే ఊపును అశ్విన్ కొన‌సాగిస్తే.. త‌న కెరీర్ లో ఐదు వంద‌ల వికెట్ల ఫీట్ ను అందుకునే అవ‌కాశాలున్నాయి.