కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజల్ని ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఎన్నో ఆఫర్లు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. కొన్ని దేశాలు నిర్బంధంగా టీకాలు వేస్తుంటే, మరికొన్ని దేశాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీకా వేయించుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.
ఇందులో భాగంగా కొన్ని ప్రభుత్వాలు తమ ప్రజలకు గొర్రె పిల్లల్ని బహుమతులుగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఈమధ్య వ్యాక్సిన్ వేయించుకున్న ఓ మహిళ ఏకంగా 7 కోట్ల రూపాయల లాటరీ అందుకుంది. ఇలాంటిదే ఓ ఆఫర్ ను మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ప్రకటించారు. అయితే ఇది అందరికీ కాదు, మందు బాబులకు మాత్రమే ఈ బంపరాఫర్.
మధ్యప్రదేశ్ లోని మందాసోర్ జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు వినూత్నమైన పథకం ప్రవేశపెట్టారు. తమ పరిథిలో ఉన్న మద్యం షాపుల్లో, 2 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికేట్ చూపిస్తే, 10శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎక్కువమంది మందుబాబులే రెండో డోసుకు విముఖత చూపిస్తున్నట్టు స్థానికంగా చేసిన సర్వేలో తేలింది.
అలాంటి వాళ్లందర్నీ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఎక్సైజ్ శాఖ ఈ డిస్కౌంట్ ప్రకటించింది. సీతామోపాటక్, భునియాకేడీ లాంటి ప్రాంతాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. స్థానికంగా ఇది సక్సెస్ అయితే ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఆలోచనలు చేస్తోంది.
అయితే దీనిపై ప్రస్తుతం ఆ ప్రాంతంలో రాజకీయంగా వివాదం చెలరేగుతోంది. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించడానికి ఎన్నో మార్గాలున్నాయని.. తాజా నిర్ణయం వల్ల మద్యం తాగేలా ప్రజల్ని ప్రోత్సహించినట్టు అవుతుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.