వావ్‌….తెలుగు ఐఏఎస్ ఆడ‌ప‌డుచు పెళ్లి వినూత్నం

కీర్తి జ‌ల్లి. హైద‌రాబాద్‌కు చెందిన తెలుగింటి అమ్మాయి. 2013లో ఐఏఎస్‌కు ఎంపిక‌య్యారామె. సివిల్ స‌ర్వీస్ ఉద్యోగ‌మంటే సోష‌ల్ స్టేట‌స్ అని మాత్రం అనుకోరు. సేవ చేయ‌డానికి ద‌క్కిన అపూర్వ అవ‌కాశ‌మ‌ని న‌మ్మే అరుదైన అధికారి.…

కీర్తి జ‌ల్లి. హైద‌రాబాద్‌కు చెందిన తెలుగింటి అమ్మాయి. 2013లో ఐఏఎస్‌కు ఎంపిక‌య్యారామె. సివిల్ స‌ర్వీస్ ఉద్యోగ‌మంటే సోష‌ల్ స్టేట‌స్ అని మాత్రం అనుకోరు. సేవ చేయ‌డానికి ద‌క్కిన అపూర్వ అవ‌కాశ‌మ‌ని న‌మ్మే అరుదైన అధికారి. ఆలోచ‌న‌లు, ఆశ‌యాల్లో ఆమెకు ఆమే సాటి. ఒక్క మాట‌లో చెప్పాలంటే తెలుగు వాళ్ల‌గా మ‌నమంతా గ‌ర్వ‌ప‌డాల్సిన అరుదైన వ్య‌క్తిత్వం ఉన్న యువ ఐఏఎస్ అధికారిణి.

తాజాగా ఆమె పెళ్లి దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తెలుగు వాళ్ల‌గా మ‌నం కూడా ఆమె పెళ్లి వెనుక ఉన్న ఆ క‌థేంటో త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే. అస్సాం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారామె. విధి నిర్వ‌హ‌ణ త‌ర్వాతే … ఏదైనా అని ఆమె బ‌లంగా న‌మ్ముతారు. ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్య‌మైంది. కానీ త‌న‌కు పెళ్లి కంటే డ్యూటీనే ముఖ్య‌మ‌ని కీర్తి జ‌ల్లి భావించారంటే న‌మ్మ‌శ‌క్యం కాదు. కానీ న‌మ్మి తీరాలి.

అస్సాంలోని చ‌చ‌ర్ జిల్లాలో డిప్యూటీ క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేస్తున్న ఆమెకు మ‌హారాష్ట్ర‌లోని పుణేకు చెందిన వ్యాపార‌వేత్త ఆదిత్య శ‌శికాంత్‌తో పెళ్లి కుదిరింది. కీర్తి ప‌నిచేస్తున్న చ‌చ‌ర్ జిల్లా హైల‌కండిలో ప్ర‌స్తుతం రోజుకు 100 కోవిడ్ కేసులు వ‌స్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సిన ప‌రిస్థితి.

ఇలాంటి క్లిష్ట‌, కీల‌క స‌మ‌యంలో పెళ్లి పేరుతో సెల‌వు పెట్టి త‌న జీవితం , త‌న కుటుంబం అని ఆలోచించే త‌త్వం ఆమెది కాదు. పెళ్లి కోసం సెల‌వు పెట్టి హైద‌రాబాద్‌కు వెళ్ల‌లేని నిస్స‌హాయ స్థితి. ఈ విష‌యాన్ని వ‌రుడి కుటుంబ స‌భ్యుల దృష్టికి తీసుకెళ్లా రామె. విధి నిర్వ‌హ‌ణ‌లో తన కాబోయే భార్య నిబ‌ద్ధ‌త అతన్ని మ‌రింత ముగ్ధున్ని చేసింది. “మీరు ఎట్లా చెబితే అట్లా” అని వ‌రుడి వైపు నుంచి సానుకూల సంకేతాలు వెలువ‌డ్డాయి.

వ‌రుడు త‌న బంధువుల‌తో క‌లిసి పెళ్లికి ముందే సిల్చార్ వెళ్లాడు.  కోవిడ్‌–19 నిబంధ‌న‌ల ప్ర‌కారం అక్కడ క్వారంటైన్‌లో గడిపాడు.  అనంత‌రం కీర్తి అధికారిక బంగ్లాలో  హంగూ ఆర్భాటాలూ లేకుండా పెళ్లి తంతు ముగిసింది. అయితే ఇక్క‌డ మ‌రో విశేషం గురించి చెప్పుకోవాలి. మంత్రాలు లాంటివేవీ లేవు. కేవలం కర్ణాటక సంగీతం వినిపిస్తుండగా వరుడు తాళికట్టాడు. ఈ పెళ్లికి కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. అయితే  జూమ్‌ వీడియో యాప్‌ ద్వారా 800 మంది పెళ్లిని వీక్షించారు.

త‌న పెళ్లి వేడుక‌కు చెల్లి మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు కీర్తి తెలిపారు. హైద‌రాబాద్‌లో ఉన్న త‌న త‌ల్లిదండ్రుల‌కు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో, వాళ్లు ఇక్క‌డికి రాలేని ప‌రిస్థితి అని కీర్తి చెప్పుకొచ్చారు. అంతెందుకు రెండు రోజుల క్రితం పెళ్లి రోజు కూడా ఫోన్‌లో విధులు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి డ్యూటీ మైండ్ అధికారిగా, వినూత్న రీతిలో పెళ్లి తంతు ముగించి… పేరు (కీర్తి)కు త‌గ్గ‌ట్టు సార్థ‌క‌త చేకూర్చారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు