మండలి విషయంలో మడమ తిప్పారు.. అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక మీడియా ఈ తరహా హెడ్డింగ్ పెట్టే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉన్నట్టుగా ఉంది. మాట తప్పం, మడమ తిప్పం అనే జగన్ నినాదాన్ని ఇలా వ్యంగ్యంగా ఉపయోగించినందుకు పచ్చమీడియాకు సహజంగానే ఆనందం ఉండొచ్చు. మరి వారి ఆనందం సంగతెలా ఉన్నా.. మండలి విషయంలో పునరాలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఊరటను ఇచ్చే అంశంగా మారింది.
నిన్ననే ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. మరో 11 మందికి కొత్తగా అవకాశాలు లభిస్తున్నాయి. ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవుల్లో చాలా మంది ఉన్నారు. అందే కాదు.. రానున్న రెండేళ్లలో కూడా మండలి ద్వారా ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అవకాశం లభిస్తుంది. ఎంతలా అంటే.. 2023 లోపే మండలిలో మొత్తం సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కడం ఖాయంగా ఉంది.
తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఎన్నికైన ఎమ్మెల్సీలందరి పదవీ కాలం ముగుస్తుంది. టీడీపీ తరఫున ఏ కోటాలోనూ కొత్త సభ్యుల ఎంపిక గగనంగా మారింది. ఈ నేపథ్యంలో మండలిలో టీడీపీ ఒకటీ అర సీట్లకు పరిమితం అయ్యి, మొత్తం సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. మరి రాజకీయంలోకి వచ్చిన వారు ఏదో ఒక పదవి కావాలనుకుంటారు. పార్టీ కోసమో, అధినేత చెప్పాడనో కొందరు త్యాగం చేసి సందర్భాల్లో మండలి వాళ్లకు అవకాశం.
పొలిటికల్ గా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం కూడా మండలి జగన్ కు ఇస్తోంది. మూడురాజధానుల అంశంలో తెలుగుదేశం చేసిన రాజకీయంతో ఆవేశానికి లోనై అప్పట్లో జగన్ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆ వేడి తగ్గింది. ఇప్పుడు ఆ బిల్లుకు మరో రూపాన్ని కల్పించే ప్రయత్నంలో ఉన్నారు.
మండలిలో ఎలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి దాదాపు మెజారిటీ లభించింది. ఈ సారి టీడీపీ ఆటలకు ఛాన్సే లేదు. ఇలాంటి నేపథ్యంలో మండలి రద్దు బిల్లు వెనక్కు వెళ్లడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పెద్ద ఊరటగా మారింది.