సినిమాల్లో ఒక కామెడీ బిట్ ఉంటుంది. ఎవడో ఒకడు- ఒకమ్మాయిని పొరబాట్న ముద్దు పెట్టేసుకుంటాడు. సారీ చెప్తాడు. క్షమించేస్తుంది. కానీ.. వాడిలో ఆ గిల్ట్ ఉండిపోతుంది. ఆ తర్వాతి నుంచి.. కనిపించిన ప్రతి ఒక్కరితోనూ ఫలానా ఆమెను నేను కావాలని ముద్దు పెట్టుకోలేదండీ.. అంటుంటాడు.
ఆమె కనిపించిన ప్రతిసారీ.. నేను కావాలని ముద్దు పెట్టలేదండీ.. అంటూ ఉంటాడు. ముద్దు పెట్టినప్పుడు ఏం నష్టం జరిగిందో గానీ.. వాడు ఇలా వందలసార్లు సారీ చెప్పడం వలన ఎక్కువ పరువు పోతుంది.
ఇప్పుడు చంద్రబాబునాయుడు వైఖరి అలాగే ఉంది. ‘నాభార్యను అవమానించారు.. నా భార్య గురించి అసభ్యంగా మాట్లాడారు’ అని ఆయన ఇప్పుడు ఊరూరా తిరుగుతూ.. అడిగిన వారికి అడగని వారికి అందరికీ చాటి, టముకు వేసి మరీ చెప్పుకుంటున్నారు.
వైసీపీ వాళ్లు అన్నారో లేదో వేరే సంగతి.. అని ఉంటే, అనడం వలన ఎంత పరువు పోయిందో ఏమో వేరే సంగతి. కానీ.. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఊరూరా తిరిగి తన భార్య మీద అసభ్యపు మాటల గురించి జనాలు అందరికీ చెప్పుకుంటున్నారు. చంద్రబాబు వైఖరి గమనించి.. మరీ ఇంత సిగ్గుమాలిన తనమా అని జనం విస్తుపోతున్నారు.
నిజానికి చంద్రబాబు భార్య పట్ల ఏదైనా అవమానం జరిగి ఉంటే.. అది ఆయన పెంచి పోషించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ద్వారా మాత్రమే జరిగింది. వంశీ అన్న రోజున ఆయన గానీ.. ఆయన తైనాతీలు గానీ.. ఏ లోకేష్ ను ఉద్దేశించి అయితే వంశీ అసభ్యపు కామెంట్లు చేశాడో సదరు లోకేష్ గానీ స్పందించలేదు. వంశీ అంతటి తీవ్రమైన అసహ్యమైన కామెంట్లు చేసినా వారెవ్వరికీ రోషం రాలేదు.
కానీ అసెంబ్లీలో వైసీపీ నేతలు అన్నారో లేదో స్పష్టత లేని మాటల మీద మాత్రం రాద్ధాంతం జరుగుతోంది. చంద్రబాబుకు అసెంబ్లీకి శాశ్వతంగా డుమ్మా కొట్టాలనే కోరిక ఉంటే ఉండొచ్చు గాక.. కావాలంటే ఇంకేదైనా సాకులు చెప్పి డుమ్మా కొట్టవచ్చు. కానీ.. ప్రజలు ఎవరూ వినని మాటల గురించి.. బయటకు వచ్చి.. తానే ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పుకున్నారు. ఒకవేళ అని ఉన్నా కూడా.. ఆ సమయంలో ఆయన ఉద్వేగానికి గురై ఏడ్చారని అనుకోవచ్చు.
కానీ ఇప్పుడు ఊరూరా తిరిగి భార్య పట్ల అసభ్య వ్యాఖ్యల గురించి చాటడం ఏమిటి? తన పరువు తానే తీసుకున్నట్లు కదా? వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వ్యక్తి వారి కష్టాలను వినడానికి వెళ్లాడా? తన కష్టాలను చెప్పుకోవడానికి వెళ్లాడా?
భార్య ను అడ్డు పెట్టుకుని సిగ్గులేని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడని వైసీపీ నాయకులు తొలినుంచి అంటూనే ఉన్నారు.
కడప జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లి వారితో తన భార్య మీద వ్యాఖ్యల గురించి చెప్పుకోవడాన్ని గమనిస్తే అది నిజమే అనిపిస్తోంది.