రైతు భరోసాపై ‘ఈనాడు’ ఏదో కథనం రాసిందని సాక్షి తెగ బాధపడి పోయింది. ఈనాడు రాసిన కథనంలో అన్నీ అబద్ధాలే అని కౌంటర్‌గా సాక్షి పత్రిక తన మార్క్ రాతలను అచ్చోసింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సీబీఐ విచారణలో భాగంగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తన అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వదిన భారతికి అనేక సార్లు ఫోన్ చేయడానికి సంబంధించి కీలక సమాచారం ఇచ్చారని వివరంగా రాశాయి.
వివేకా హత్య జరిగిన రోజు, ఆ తర్వాత అవినాశ్ రెడ్డి అటు జగన్‌తో, ఇటు భారతితో ఇంకొకరి నంబర్లకు కాల్ చేసి పలుమార్లు మాట్లాడినట్లు సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. వివేకా హత్య కేసులో ‘తీగ’ దొరికిందని, అది తాడేపల్లికి ‘కనెక్ట్’ అయినట్లు నేరుగా జగన్, ఆయన సతీమణిని టార్గెట్ చేస్తూ ఆ రెండు పత్రికలు కథనాలు రాసుకొచ్చాయి. ఈ విషయాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ రాతలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించడం విశేషం. ఆయన ఏమన్నారంటే… సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి, సీబీఐ అధికారులే ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయాలు ఎలా తెలిశాయని వైవీ సుబ్బారెడ్డి ఆశ్చర్యంగా ప్రశ్నించారు. రాజకీయంగా ఎంతో నష్టం కలిగించే ఈ రాతలపై సాక్షి పత్రిక, వైఎస్ అవినాష్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదనే చర్చకు తెరలేచింది.
ఈనాడు పత్రికలో ఏం రాసినా, ఏది నిజమో తన కోణంలో రాసుకొచ్చే సాక్షికి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సంబంధించి మాత్రం స్పందించాలనే స్పృహ ఎందుకు కొరవడిందో అనే చర్చకు తెరలేచింది. అంటే ఆ రెండు పత్రికలు రాసినవన్నీ నిజాలని సాక్షి తన మౌనం ద్వారా ఆమోద ముద్ర వేసిందని జనం అనుకోవాలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే సందర్భంలో అవినాష్‌రెడ్డి ఎందుకు స్పందించ లేదనే ప్రశ్న ఉత్పన్నమైంది. మొత్తానికి కీలక రాతలపై ఇటు అవినాష్, అటు సాక్షి మౌనవ్రతం పాటించడంతో వైసీపీకి, జగన్‌కు డ్యామేజీ జరిగిందని చెప్పొచ్చు.