నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం జగన్ నియమించినట్టు సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా వైసీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సొంత ప్రభుత్వాన్ని కోటంరెడ్డి టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన తన ఫ్యోన్లను ట్యాప్ చేస్తున్నట్టు సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో కోటంరెడ్డి వ్యవహారశైలిపై జగన్ సీరియస్‌గా ఉన్నారు. పిలిచి మాట్లాడినా ఆయనలో మార్పు రాకపోవడంతో కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వైసీపీ అధిష్టానం వచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ వైసీపీ బాధ్యతల్ని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించాలని నిర్ణయించుకోవడం విశేషం.
గతంలో నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించారు. గత ఎన్నికల ముంగిట ఆదాల ప్రచారం చేస్తూ, ఉన్నట్టుండి హైదరాబాద్ వెళ్లారు. అనంతరం ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ సభ్యుడిగా వైసీపీ తరపున బరిలో నిలిచి గెలుపొందారు. వివాద రహితుడిగా ఆదాల పేరు పొందారు గతంలో మంత్రిగా కూడా ఆయన పని చేశారు. ఆర్థికంగా ఆదాల ఎంతో బలవంతుడు.
తాజాగా నెల్లూరు రూరల్ బాధ్యతల్ని అప్పగించడం వెనుక వైసీపీ పక్కా వ్యూహం కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌లో వైసీపీ మరోసారి గెలుస్తుందని రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే.