ఈ టైమ్ లో చంద్రబాబు రాజీనామా చేస్తే…!

సీఎం అయ్యే వరకు తానిక అసెంబ్లీకి రానని తెగేసి చెప్పేసిన చంద్రబాబుకి ఎమ్మెల్యే పదవి అవసరమా..? లేనే లేదు. పోనీ ఈ సమయంలో రాజీనామా చేసి తిరిగి ప్రజల మద్దతుతో గెలిస్తే ఎలా ఉంటుందనే…

సీఎం అయ్యే వరకు తానిక అసెంబ్లీకి రానని తెగేసి చెప్పేసిన చంద్రబాబుకి ఎమ్మెల్యే పదవి అవసరమా..? లేనే లేదు. పోనీ ఈ సమయంలో రాజీనామా చేసి తిరిగి ప్రజల మద్దతుతో గెలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా బాబుకి వచ్చినట్టు తెలుస్తోంది. 

వరుస ఓటములతో దిగాలుపడ్డ టీడీపీ శ్రేణులకు కనీసం కుప్పం గెలుపుతో అయినా ఉత్సాహం ఇచ్చేందుకు బాబు సిద్ధమయ్యారట. ఇప్పుడు సింపతీతో కుప్పంలో గెలిస్తే 2024లో కూడా గెలుపు గ్యారెంటీ అవుతుందనే భావనలో ఉన్నారట. మొత్తానికి ఏదో ఒక గెలుపుతో పార్టీ శ్రేణుల్ని సంతృప్తి పరిచేందుకు బాబు వ్యూహం రచించినట్టు తెలుస్తోంది.

కుప్పంతో రాజకీయం

వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడతారని, కుప్పాన్ని వదిలేస్తారని ప్రచారం జరిగింది. కానీ అంతలోనే ఆయన 'ఏడుపుగొట్టు' సీన్ తో వ్యవహారం మారిపోయింది. ఎన్టీఆర్ ఫ్యామిలీ అండగా నిలిచింది, ఆయన కోసం ఒకరో ఇద్దరో ఉద్యోగులు రాజీనామాలు చేశారు, సూపర్ స్టార్లు ఫోన్లలో పరామర్శిస్తున్నారంటూ ఎల్లో మీడియా కథనాలిస్తోంది. ఇదంతా చూసి టీడీపీ శ్రేణులు కూడా నిరసనలకు దిగుతున్నాయి.

చంద్రబాబు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలంటే ఇదే సరైన సమయం. తనకు జరిగిన అవమానానికి కుప్పం ప్రజలు ఓట్ల రూపంలో బదులు తీర్చుకోవాలని పిలుపునిస్తూ బాబు ఉప ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు కీలక నేతలు.

ఇప్పటికే భువనేశ్వరి ఎపిసోడ్ తో బాబుపై కాస్తో కూస్తో సింపతీ పెరిగింది. రాజీనామా చేస్తే ఆ సింపతీ మరింత పెరుగుతుంది. ఇదే సరైన సమయం. ప్రచారానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా కలిసి రావచ్చేమో. ఏకంగా భువనేశ్వరి దిగి కన్నీరు పెట్టుకోవచ్చేమో. ఇవన్నీ జరిగితే కుప్పంలో చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారనే అంచనాలున్నాయి.

అదే జరిగితే వరుస ఓటములతో దిగాలు పడ్డ టీడీపీకి కాస్తో కూస్తో ఉత్సాహం వస్తుంది. అందుకే చంద్రబాబు తొలిసారిగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించే ఆలోచనలో ఉన్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే చంద్రబాబు ఆ షాకింగ్ న్యూస్ చెబుతారని తెలుస్తోంది. 

అయితే తన ఏడుపు ఎపిసోడ్ ను చంద్రబాబు ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు. 3 రాజధానుల అంశం బాబు ఎపిసోడ్ ను మరుగున పడేలా చేసింది. ఇలా 3 రోజులకే చల్లారిపోయిన ఈ అంశాన్ని పట్టుకొని చంద్రబాబు, తన పదవికి రాజీనామా చేస్తారా అనేది పెద్ద డౌట్.