ప్రజల్లో ఉంటాడా ? ఇంట్లో ఉంటాడా ?

ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్నాడు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో చంద్రబాబును తప్పుపట్టలేం. గతంలో జగన్ కూడా ఇలాగే అసెంబ్లీని బహిష్కరించాడు. ఆయన మాత్రమే కాదు, పార్టీ ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు.…

ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్నాడు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో చంద్రబాబును తప్పుపట్టలేం. గతంలో జగన్ కూడా ఇలాగే అసెంబ్లీని బహిష్కరించాడు. ఆయన మాత్రమే కాదు, పార్టీ ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు బహిష్కరించారు. పొరుగున ఉన్న తమిళనాడులో జయలలిత కూడా బహిష్కరించింది. కాబట్టి ఇది బాబు చేసిన కొత్త పని కాదు. ఆయన వచ్చే ఎన్నికల్లో సీఎంగానే అసెంబ్లీకి వస్తాడో రాడో ఇప్పుడు చెప్పలేం.  

వచ్చే ఎన్నికల దాకా ఆయన హైదరాబాదులోని తన ఇంట్లో కూర్చుంటారా ? లేదా ప్రజల్లో ఉంటూ వారి సమస్యల మీదా పోరాటం చేస్తారా ? ఏపీలో బలమైన ప్రతిపక్షం టీడీపీయే కాబట్టి దానికి ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన బాధ్యత ఉంది. అందులోనూ ఉమ్మడి ఏపీలో, విడిపోయిన ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ కూడా. ఇక చంద్రబాబు పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కూడా.

 రాష్ట్రంలో టీడీపీ పోరాటం చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ మరో సమస్య తెచ్చి పెట్టాడు. ప్రస్తుత మూడు రాజధానుల బిల్లును రద్దు చేసి మళ్ళీ కొత్త బిల్లు తెస్తానని చెప్పాడు. అదెలా ఉంటుందో తెలియదు. దాంట్లో ప్రజా వ్యతిరేక అంశాలు ఏముంటాయో తెలియదు. ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు వచ్చాయనే ఆ బిల్లును రద్దు చేశాడు. 

మరి రాబోయే బిల్లులో న్యాయపరమైన చిక్కులు రావని ఎలా చెప్పగలం? అవన్నీ ఎదుర్కోవాలంటే చంద్రబాబు సభలో ఉండాలి కదా. మళ్ళీ సీఎంగానే అసెంబ్లీకి వస్తానని బాబు చెప్పిన రోజున గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ బాబు అసెంబ్లీకి వెళ్లునప్పుడు తాము కూడా అంటే మిగతా సభ్యులు కూడా అసెంబ్లీకి వెళ్లాలో వద్దో త్వరలో నిర్ణయిస్తామని అన్నాడు.

ఇంకా రెండున్నరేళ్ల వరకు ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజల్లో వ్యతిరేకత రాదా ? టీడీపీ సభకు వెళ్లకపోతే అసెంబ్లీలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టేది ఎవరు ? అధికార పక్షం ఇష్టా రాజ్యంగా చేయదా? చంద్రబాబు ఎప్పుడూ  ఆవేశంగా ప్రకటన చేసేందుకు ఇష్టపడరు. ఆయన ఏ విషయంలో అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. కానీ అసెంబ్లీకి రాకూడదన్ననిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నారో, ఆవేశంతో తీసుకున్నారో చెప్పలేం. అధినేత ముందుండి నడిపిస్తేనే కదా నాయకులు ముందుకు కదిలేది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్న‌ర‌ సంవత్సరాలు టైం ఉంది.

ఇటు శాసనసభలోనూ అటు శాసనమండలిలోను కలిపి టిడిపికి 30 మందికి పైగా సభ్యుల బలం ఉంది. ఇలాంటి టైంలో బాబు పోరాటం చేయ‌కుండా బ‌య‌ట ఉంటే జ‌నాల్లో నెగిటివ్ వ‌స్తుందా ? అన్న సందేహాలు టిడిపి వాళ్ళకు వస్తున్నాయి. మరోవైపు రాజ‌ధాని బిల్లును స‌రి కొత్త‌గా మ‌ళ్లీ అసెంబ్లీ లోకి తీసుకువస్తామని వైసిపి చెబుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు అసెంబ్లీలో లేకపోతే ప్రజల్లో బాబు పై వ్యతిరేకత వస్తుందా? అమ‌రావ‌తి రైతుల ప‌క్షాన బాబు లేర‌న్న అభిప్రాయం క‌లుగుతుందా? పార్టీ పై న‌మ్మ‌కం మ‌రింత స‌న్నిగిల్లుతుందా ? అన్న సందేహాలు ఇప్పుడు టిడిపి వాళ్ళకు కలుగుతున్నాయి.

బిల్లు అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ళ్లీ ఏ మాత్రం వ్య‌తిరేకంగా ఉన్నా కూడా అప్పుడు అసెంబ్లీలో గ‌ట్టి గా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం బాబుకు ఎంతైనా ఉంది. లేక‌పోతే ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతుంటే బాబు అసెంబ్లీ లేర‌న్న అభిప్రాయం బ‌లంగా ప్ర‌జ‌ల్లో ఉంటుంది. ఇది అంతిమంగా బాబుకు పెద్ద మైన‌స్ అయ్యే అవకాశం ఉంది. 

తమ తరపున పోరాడని బాబును ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతాడు. రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా పరిస్థితులు అంతగా బాగాలేవు కాబట్టి బాబు తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటారా? ఎంతో అనుభవం ఉన్న బాబు ఈ విషయం గురించి ఆలోచించుకోవాలి.