ఫేస్ బుక్ ప్రేమ.. రూ. కోటి పోగొట్టుకున్నాడు

పేరుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ గా ఉంది.. కానీ ఏం లాభం. పెళ్లి కావడం లేదు. ఏకంగా 40 ఏళ్లు వచ్చాయి. దీంతో పెళ్లి కాదేమో అనే బెంగ పట్టుకుంది.…

పేరుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ గా ఉంది.. కానీ ఏం లాభం. పెళ్లి కావడం లేదు. ఏకంగా 40 ఏళ్లు వచ్చాయి. దీంతో పెళ్లి కాదేమో అనే బెంగ పట్టుకుంది. ఇతగాడి బలహీనతను ఓ కుటుంబం గ్రహించింది. ఫేస్ బుక్ లో టచ్ లోకి వెళ్లింది. ప్రేమిస్తున్నామంటూ నమ్మించి ఏకంగా కోటి రూపాయలు కొట్టేసింది. గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచింది ఈ ఫేస్ బుక్ ప్రేమ.

బాధితుడు ఓ పెద్ద బహుళజాతి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. లక్షల్లో జీతం. కానీ 40 ఏళ్లొచ్చినా పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వలేదు. ఇతగాడికి కల్యాణిశ్రీ ఫేస్ బుక్ లో పరిచయమైంది. విజయవాడలో ఉంటున్నానని చెప్పింది. సంప్రదాయ కుటుంబం అని ఊరించింది. అలా ఏడాదిగా ఇద్దరి మధ్య ఆన్ లైన్ స్నేహం నడిచింది. అదే ఫేస్ బుక్ వేదికగా ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఇక పెళ్లికి రెడీ అని ఇద్దరూ ఓ మాట అనేసుకున్నారు.

కట్ చేస్తే.. ఆడ కాదు మగ..

సరిగ్గా ఇక్కడే  ట్విస్ట్ వచ్చింది. ఇన్నాళ్లూ సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ఛాట్ చేసింది కల్యాణిశ్రీ అనే అమ్మాయి కాదు. యర్రగుడ్ల దాసు అనే పురుషుడు. అతడిది గుంటూరు. ఎప్పుడైతే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కలుద్దామని అన్నాడో, అప్పుడు కల్యాణిశ్రీ అలియాస్ దాసు మాట మార్చాడు. పెళ్లిళ్ల పేరయ్య మధుసూదన్ తో మాట్లాడాలని, అప్పుడే కలుద్దామని కండిషన్ పెట్టాడు. ఇక్కడ మధుసూధన్ అంటే వేరే ఎవ్వరో కాదు, ఇక్కడ కూడా దాసే.

సీన్ లోకి ఎంటరైన మధుసూధన్.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నుంచి దశలవారీగా డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. అలా ఏడాదిగా కోటి రూపాయలు నొక్కేశారు. బాధితుడికి అనుమానం వచ్చి ఫోన్ చేస్తే.. తన భార్య జ్యోతితో మాట్లాడించేవాడు దాసు. కానీ కూడబెట్టుకున్న కోటి రూపాయలు పోవడం, ఎప్పటికీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు దాసును అరెస్ట్ చేసి, బాధిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు చూపించారు. ఇన్నాళ్లూ తను ఛాటింగ్ చేసింది ఓ మగాడితో అనే విషయం తెలుసుకొని బాధితుడు బిక్కచచ్చిపోయాడు. 40 ఏళ్లొచ్చినా, సదరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు 'ఆన్ లైన్ జ్ఞానం' లేదంటూ సోషల్ మీడియాలో అతడిపై జోకులు పేలుతున్నాయి.