ప్రేమ‌, వివాహం, డేటింగ్.. అండ్ చీటింగ్!

ప్రేమ‌లో కావొచ్చు, డేటింగ్ ద‌శ‌లోనే కావొచ్చు, ఇంకా పెళ్లి అయ్యాకా కావొచ్చు.. భాగ‌స్వామిని చీట్ చేయ‌డం లేదా, చీట్ చేయాల‌నుకోవ‌డం మ‌నిషి స‌హ‌జ ల‌క్ష‌ణాల్లో ఒక‌టి. ఈ చీటింగ్ లో ఒక్కోరి త‌ర‌హా ఒక్కోరిది.…

ప్రేమ‌లో కావొచ్చు, డేటింగ్ ద‌శ‌లోనే కావొచ్చు, ఇంకా పెళ్లి అయ్యాకా కావొచ్చు.. భాగ‌స్వామిని చీట్ చేయ‌డం లేదా, చీట్ చేయాల‌నుకోవ‌డం మ‌నిషి స‌హ‌జ ల‌క్ష‌ణాల్లో ఒక‌టి. ఈ చీటింగ్ లో ఒక్కోరి త‌ర‌హా ఒక్కోరిది. అయితే ఎక్కువ మంది చీటింగ్ గా భావించేది సెక్సువ‌ల్ రిలేష‌న్ షిప్ విష‌యంలోనే. వివాహేత‌ర సంబంధాల విష‌యంలోనే మోసం చేస్తున్నార‌నే భావ‌న అధికంగా ఉంటుంది. మిగిలిన వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఇందుకు దేశం, క‌ల్చ‌ర్ పెద్ద తేడా ఉండ‌దు.

పాశ్చాత్య నాగ‌రిక‌తలో కూడా ఎక్స్ ట్రా మ్యారిట‌ల్ రిలేష‌న్ షిప్ అనేది మోసం కిందే లెక్క‌! మ‌నుషులు వీలైన‌న్ని పెళ్లిళ్లు, వీలైన‌న్ని బ్రేక‌ప్ లు, డివోర్స్.. ఇవ‌న్నీ అక్క‌డ స‌హ‌జ‌మే అనుకున్నా… ఒక‌రితో రిలేష‌న్ షిప్ కు క‌మిటై మ‌రొక‌రితో బంధం నెరిపితే మాత్రం దాన్ని ఆ నాగ‌రిక‌త‌లోనూ స‌హించ‌లేరు. ఇలా మ‌నిషి ఏ క‌ల్చ‌ర్ లో అయినా స‌హించ‌రానిది అయిన ఈ మోసం అన్ని క‌ల్చ‌ర్ ల‌లోనూ సాగిపోతూ ఉంటుంది కూడా!

మ‌రి ఇంత‌కీ మ‌నిషి ఇలాంటి అద‌న‌పు రిలేష‌న్ షిప్ ను నెర‌పాల‌నే ప‌రిస్థితి ఎందుకు వ‌స్తుంద‌నేది పెద్ద ప్ర‌శ్న‌! దీనికి అనేక కార‌ణాలుంటాయి. వీటిని ర‌క‌ర‌కాల శాస్త్రాల ఆధారంగా ప‌రిశోధించవ‌చ్చు! మ‌న‌స్త‌త్వ శాస్త్ర కోణం నుంచి కూడా ఈ అంశం గురించి ప‌రిశోధించ‌వ‌చ్చేమో! ఒక‌వేళ మాన‌సిక ప‌రిస్థితుల నుంచి ఈ ఎక్స్ ట్రా ఎఫైర్స్ ను ప‌రిశోధిస్తే.. మోసం అనే మాట లేదు! అవ‌స‌రం అయిన ప‌రిస్థితులే ఇలాంటి బంధానికి కార‌ణం అని మాన‌సిక శాస్త్రం చెప్పేస్తుంది. అలాంట‌ప్పుడు అది ఒక‌రికి ప్ర‌త్యేకంగా మోసం చేయ‌డం ఎందుక‌వుతుంది?

ఈ తోడులో ల‌భించ‌ని దేన్నో ఎక్స్ పెక్ట్ చేస్తూ మ‌రొక‌రితో బంధాన్ని ఏర్ప‌రుచుకోవ‌చ్చు. ఒక‌వేళ స‌రిప‌డినంత స్థాయిలో కోరుకున్న‌ది దొర‌క్క మ‌రొక బంధం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ బంధాల‌కు ప్ర‌ధాన కార‌ణం సెక్స్ మాత్ర‌మే కాద‌ని మాత్రం క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం సెక్స్ వాంఛ‌తోనే అక్ర‌మ‌సంబంధాలు ఏర్ప‌డుతాయ‌ని అనుకోవ‌డం అమాయ‌క‌త్వం. అది యూట్యూబ్ లో క్రైమ్ ప్రొటొకాల్ సీరిస్ ల‌ను తీసేవాళ్లు, చూసే వాళ్లు ఏర్ప‌రుచుకున్న భ్ర‌మ‌.  

ప్రేమ‌కు పునాది ఆక‌ర్ష‌ణ అయిన‌ట్టుగా.. ఈ వ్య‌వ‌హారాల‌కు పునాది కూడా ఏదో ఒక ఆక‌ర్ష‌ణే! ఒక‌రితో ఒక‌ర‌క‌మైన బంధంలో ఉన్నా.. మ‌రొక‌రితో ఎందుకు అదే త‌ర‌హా బంధానికి ఆక‌ర్షితుల‌వుతున్న‌ట్టు అంటే.. ఏదో ఎక్స్ పెక్టేష‌న్, ఇంకా ఏదో కావాల‌నుకోవ‌డం రీజ‌న్లు కావొచ్చు. ఇవి ఒక్కోరి విష‌యంలో ఒక్కోటి!

ఈ బంధాల‌కు ఆర్థిక‌, సామాజిక‌, సాంస్కృతిక రీజ‌న్లు ఎన్నో ఉంటాయి. గ్రామాల్లో ఒక‌ప్పుడు ఆర్థిక శక్తి గ‌ట్టిగా ఉన్న పురుషుల‌కు వివాహేత‌ర సంబంధం ఉండ‌టం రివాజు! అది అత‌డి స్థాయికి నిద‌ర్శ‌నంగా వ్య‌వ‌హ‌రించేవారు. జ‌మీందారుల‌కు, పెద్ద రైతుల‌కు, వ్యాపారాలు చేసే వాళ్లకు ఇలాంటి చిన్నిళ్లు ఉండ‌టం రొటీనే. దాన్ని నేరంగా ప‌రిగ‌ణించేదేమీ లేదు.

అయితే రోజులు మారాయి.. ఇప్పుడు రివ‌ర్స్ లో కూడా ఉంటాయి. పురుషుడి ఆర్థిక శ‌క్తి స్త్రీని స‌మ్మోహితం చేయ‌గ‌లుగుతున్నా.. పురుషుడు ప‌క్క చూపులు చూస్తే స్త్రీ స‌హించే ప‌రిస్థితి లేక‌పోవ‌చ్చు. లేదా పురుషుడు అన్నీ స‌మ‌కూర్చి పెట్టినా ఏదో సాన్నిహిత్యం కోసం మ‌రో బంధం స్త్రీకీ ఏర్ప‌డ‌వ‌చ్చు! ఎగువ త‌ర‌గ‌తి, మ‌ధ్య త‌ర‌గ‌తి, దిగువ త‌ర‌గ‌తి అనే తేడా లేకుండా ప‌తీ, ప‌త్నీ ఔర్ ఓ బంధాలు ఉంటాయి. కొంద‌రికి చ‌ర్చ‌లోకి వ‌స్తాయి. చాలా మందివి చ‌ర్చ‌లోకి రావు! అదే ప్ర‌ధాన‌మైన తేడా. న‌యా జ‌న‌రేష‌న్ క‌మ్యూనికేష‌న్ యుగం.

ఏ బంధానికి అయినా క‌మ్యూనికేష‌నే బ్రిడ్జి. ఈ బ్రిడ్జి తేలిక‌గా ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న త‌రుణంలో ఈ స్టోరీలు కూడా వేగంగానే అల్లుకుపోవ‌చ్చు. అలా అని అంతా త‌ప్పు చేస్తున్నార‌నుకోవ‌డ‌మూ మూర్ఖ‌త్వ‌మే. చేయాల‌నుకుంటే మాత్రం అవ‌కాశాలు బోలెడు!