దటీజ్..దిల్ రాజు..గ్రేట్ కదా!

నైజాం పంపిణీ రంగంలో పావులు కదిపి చదరంగం ఆడడం లో దిల్ రాజు ను మించిన వారు లేరు. ఎలా నెగ్గుకు రావాలి. ఎలా వెళ్తే ఏం సాధించవచ్చు అన్నీ పక్కాగా క్లారిటీ వుంది.…

నైజాం పంపిణీ రంగంలో పావులు కదిపి చదరంగం ఆడడం లో దిల్ రాజు ను మించిన వారు లేరు. ఎలా నెగ్గుకు రావాలి. ఎలా వెళ్తే ఏం సాధించవచ్చు అన్నీ పక్కాగా క్లారిటీ వుంది. ప్లానింగ్ వుంది. నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ మరి కొందరితో కలిసి పంపిణీ రంగంలోకి ప్రవేశించగానే కాస్త కంగారు పడ్డారు. మాటలు విసిరారు. కానీ అంతలోనే సర్దుకున్నారు. క్రైసిస్ మేనేజ్ మెంట్ కు దిగారు. తన దగ్గర వున్న బలమైన సంస్థల్లో ఒకటైన హారిక హాసిని ని ముందుగా టార్గెట్ చేసారు. వాళ్ల సినిమాలు బయటకు వెళ్లే ప్రమాదం వుందని, ముఖ్యంగా మహేష్-త్రివిక్రమ్ సినిమా జారిపోయే ప్రమాదం వుందని గ్రహించారు.

వెంటనే తన దగ్గర వున్న ట్రంప్ కార్డ్ శాకుంతలం సినిమాను సరిగ్గా సితార నిర్మించిన సర్ మీదకు వేసారు. అక్కడే తన మిత్రుడు బన్నీ వాస్ సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వున్నా కూడా ఇలా చేసారేంటీ అని అందరూ క్వశ్చను మార్కు ఫేస్ లు పెట్టారు. మరోపక్క తనకు పోటీ వస్తున్న ఆసియన్ సునీల్, సురేష్ సంస్ణ జగదీష్ లను పిలిచి కాస్త గట్టిగానే క్లాస్ పీకారని బోగట్టా. దాంతో వాళ్లు కూడా కాస్త వెనక్కు తగ్గారు. 

మహేష్ సినిమాను కొనడానికి మైత్రీ మూవీస్ కు రేటు అడ్డం పడింది. హారిక హాసిని నుంచి భారీ రేటు ఎదురొచ్చింది. దాంతో వాళ్లు వెనక్కు తగ్గారు. దాంతో దిల్ రాజు తప్ప మరో ఆప్షన్ లేదన్న ఫీడ్ బ్యాక్ మహేష్ కు వెళ్లింది. ఇక ఆయన కూడా నో అనలేని పరిస్థితి.

గత రెండు మూడు రోజుల్లోనే అంతా సెటిల్ అయిపోయింది. సితార సినిమాలు బుట్టబొమ్మ, సర్, మహేష్-త్రివిక్రమ్ సినిమా అన్నీ దిల్ రాజు కాంపౌండ్ లోకి వచ్చి పడ్డాయి. అంతే, శాకుంతలం సినిమా చుటుక్కున ఫీల్డ్ లోంచి తప్పుకుంది. హిందీ డేట్ దొరకలేదనో, మరోటో రీజన్ కావచ్చు. కానీ తెరవెనుక అసలు సంగతి ఇదీ అని టాలీవుడ్ లో బలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పక్క బన్నీ వాస్ కూడా తన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ కూడా ఒక రోజు వెనక్కు జరుపుతున్నారు. దీంతో సితార నిర్మించిన ‘సర్’ సినిమాకు శివరాత్రి కి సోలో విడుదల దక్కింది.

మరోపక్క దిల్ రాజు ఒక్కో నిర్మాతను పిలుస్తున్నారు. కలుస్తున్నారు. సినిమాలు చకచకా ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే నాగ్ చైతన్య కస్టడీ సినిమా, రామ్ పోతినేని-బోయపాటి సినిమా కూడా దిల్ రాజు కు నైజాం ఏరియాకు మాట దొరికేసింది. దసరా సినిమాను వేరే వాళ్లు తెలుగు రాష్ట్రాలకు కొంటే నాలుగు కోట్లు అదనంగా ఇచ్చి మరీ దిల్ రాజు తీసుకున్నారు. ఈ ఫార్వార్డ్ ట్రేడింగ్ దిల్ రాజుకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. ముఖ్యగా ఆసియన్ సునీల్, సురేష్ బాబు ఎప్పటికీ చేయలేరు. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా కూడా దిల్ రాజుదే. మైత్రీ చేతిలో ఈ ఏడాది అమిగోస్, ఖుషీ మాత్రమే వున్నాయి.

మొత్తం మీద నైజాం తన చేతి నుంచి జారిపోకుండా ఎక్కడ వేయాల్సిన తాళాలు అక్కడ వేసేసారు. మొత్తం సీన్ ను తన కంట్రోల్ లోకి వచ్చేలా చేసుకున్నారు. దటీజ్ దిల్ రాజు.

అంతా బాగానే వుంది. కానీ పాపం, గుణశేఖర్ శాకుంతలం పరిస్థితి ఏమిటో? నాన్ థియేటర్ ఇంకా చాలా వరకు కావాల్సి వుందని గుణశేఖర్ ఇంటర్వూలో చెప్పారు. ఇలా వెనక్కు వెనక్కు జరుగుతూ వుంటే బిజినెస్ పరిస్థితి ఏమిటో?